close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

మహిళల జోలికొస్తే శంకరాభరణమే!

సినీ నటి రాజ్యలక్ష్మి

 ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖి

 

శంకరాభరణం రాజ్యలక్ష్మి

న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతిక విభాగం: ‘ఆధునిక సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. బాలికలు, యువతులు, మహిళలు తేడా లేకుండా అందరినీ కామవాంఛతో చూసే... మృగాళ్లు మన మధ్యలోనే తిరుగుతున్నారు. సాంకేతికతను ఆసరాగా తీసుకొని... వేధింపులకు గురిచేస్తున్నారు. అలాంటి దుర్మార్గులకు ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ గుణపాఠం కావాలి. ఆ శంకరుని ఆభరణమైన ఆ సర్పమే కామాంధులను కాటేస్తుంద’ని ప్రముఖ సినీనటి శంకరాభరణం రాజ్యలక్ష్మి. అక్కినేని కళాపరిషత్తు ద్వారా మహానటి సావిత్రి పురస్కారం అందుకునేందుకు ఆమె శనివారం ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో పలు విషయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే...

మాది తెనాలే...

మా సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి. అమ్మ రంగస్థల నటి. కె.విశ్వనాథ్‌ శంకరాభరణం సినిమా తీస్తూ... శారద పాత్రకు కొత్తమ్మాయిని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. జంధ్యాల నా గురించి చెప్పడంతో... ఆయన్నుంచి పిలుపొచ్చింది. అమ్మతో కలిసి చెన్నై వెళ్లి కళా తపస్విని కలిశా. అప్పటికి నా వయసు 15 ఏళ్లే. పదో తరగతి పరీక్షలు రాశానంతే. స్క్రీన్‌ టెస్టులో అర్హత సాధించడంతో శారద పాత్ర దక్కింది. అలా... మొదలైన సినీ నట ప్రస్థానం... నేటికీ 300 చిత్రాలు పూర్తి చేసుకుంది. శంకరాభరణం విజయ యాత్రలో భాగంగా 1980లో ఒంగోలు వచ్ఛా ఇప్పటికీ ఆ మధురానుభూతి నాకు గుర్తుంది. నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా.

దర్శకేంద్రుడితో రెండో సినిమా....

శంకరాభరణంలో సంప్రదాయ కుటుంబ అమ్మాయిగా నటించిన నాకు... రెండో చిత్రంలో మోడ్రన్‌ అమ్మాయి పాత్ర దక్కింది. ఆ సినిమా ‘నిప్పులాంటి నిజం’. రాఘవేంద్రరావు దర్శకులు. మోడ్రన్‌ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయానంటే, నేటికీ నాకు ఆశ్చర్యమే. ఆ గొప్పదనమంతా దర్శకేంద్రుడిదే. ఇద్దరు మహోన్నత దర్శకులతో తొలి రెండు చిత్రాలు చేయడం నా అదృష్టం.

ఎన్టీఆర్‌తో క్రమశిక్షణ... ఏఎన్నార్‌తో ఆప్యాయత

జస్టిస్‌ చౌదరి చిత్రంలో అన్నగారు ఎన్టీఆర్‌ కుమార్తెగా నటించా. ఆ మహా నటుడితో కలిసి నటించడమంటే ఆషామాషీ కాదు. తొలుత ఎంతో భయపడ్ఢా కానీ, ఆయన ప్రోత్సాహం నాలో బెరుకు పోగొట్టింది. సొంత తండ్రీకూతుళ్లలా పాత్రలో ఒదిగిపోయాం. నటనంటే కాలక్షేపం కాదు.. అదో పవిత్రమైన వృత్తి. ఇందులో రాణించాలంటే క్రమశిక్షణ ఉండాలని ఎన్టీఆర్‌ పదేపదే చెప్పేవారు. చిత్రసీమలో నటసామ్రాట్‌ అక్కినేని నుంచి ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నా. అందరితో ఆప్యాయంగా మాట్లాడటం, చిరునవ్వుతో పలకరించడం తదితరాలన్నీ ఏఎన్నార్‌ నేర్పినవే.

పురస్కారం అదృష్టం...

కె.విశ్వనాథ్‌, రాజశ్రీ లాంటి గొప్పవాళ్లను సత్కరించిన అక్కినేని కళాపరిషత్తు... నాకు మహానటి సావిత్రి పేరిట పురస్కారం ఇవ్వాలనుకోవడం అదృష్టం. ఇంత గౌరవం కల్పించిన పరిషత్తు అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య, కమిటీ సభ్యుడు మండవ శ్రీనివాసరావు తదితరులకు నా కృతజ్ఞతలు.

ఆ వార్త... ఆనందం నింపింది...

నేను ఈటీవీ న్యూస్‌ ఎక్కువగా చూస్తుంటా. మొన్న పొద్దున టీవీ పెట్టగానే ‘దిశ’ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారంటూ తాజా వస్తోంది. దాన్ని చూసి ఉద్వేగానికి గురయ్యా. ఎనలేని ఆనందం నింపిన వార్తది. ఈ మానవ మృగాలు యువతిని ఎంత వేధించి హత్యాచారం చేశాయో... ఆలోచిస్తేనే గుండె బరువెక్కుతోంది. వీరి పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదు. తెలంగాణ పోలీసులను మనసారా అభినందిస్తున్నా.

పరభాషా చిత్రాల్లో...

చిత్ర పరిశ్రమ ప్రతిభను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచి గణనీయ ప్రోత్సాహం లభించింది. మలయాళంలో 30 సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. తొలి సినిమా మమ్ముట్టితో.. తరువాత మోహన్‌లాల్‌తో... ఇలా ప్రముఖ నాయకులందరి సరసన నటించే అవకాశం దక్కింది. తెలుగులో రాణించడం వల్లే ఇదంతా సాధ్యమైంది.

తెలుగుదనం విస్తరించాలి...

ప్రస్తుతం అన్ని చోట్లా తెలుగు భాషపై చర్చ జరుగుతుండటం సంతోషం. తెలుగుదనం అంతటా విస్తరించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యంగా చిత్ర సీమలో తెలుగు కళాకారిణులకు తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఇటీవల కాలంలో చివరకు అమ్మ పాత్రలకూ ఇతర భాషల నటుల్ని తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో మార్పు రావాలి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.