close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

‘మాయ’మైనా...పట్టేశారు!!

నెల రోజులకు పైగా గాలింపు

ఎట్టకేలకు చిక్కిన ‘సర్వాధికారి ట్రస్టు వ్యవస్థాపకుడు’

భారీ మోసానికి పాల్పడిన వైనం

ప్రజల నుంచి రూ.2.19 కోట్లకు పైగా వసూలు

రూ.25.40 లక్షల నగదు స్వాధీనం

బంగారం, కారు, గృహోపకరణాలు కూడా...

న్యూస్‌టుడే, అరసవల్లి

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డి

ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని అతను పన్నాగం పన్నాడు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లలోనే మోసానికి పాల్పడ్డాడు. కొంత మొత్తం చెల్లిస్తే చాలు మిగిలిన మొత్తం తాను భరించి కావాల్సిన వస్తువులు అందిస్తానని నమ్మబలికాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి భారీ మోసానికి తెరలేపాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

టెక్కలి కేంద్రంగా ‘సర్వాధికారి మినిస్ట్రీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ ట్రస్టు’ను నడుపుతున్న చల్లా రాజా తిరుపతిరావు(36)ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమ్మిరెడ్డి సమక్షంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...ద్విచక్రవాహనాల ఖరీదులో 70 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ట్రస్టు ద్వారా భరించి ఇప్పిస్తానని నమ్మబలికి ప్రజల నుంచి రూ.కోట్లతో వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు.

 

హైదరాబాద్‌ నుంచి వచ్చి...  పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన రాజాతిరుపతిరావు 12 ఏళ్లుగా హైదరాబాద్‌లో మత బోధకుడిగా ఉన్నాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఏడాది కిందటే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో... అడ్డదారిలలో డబ్బులు సంపాదించాలనే పన్నాగంతో టెక్కలి పట్టణంలోని బాలాజీనగర్‌లో సర్వాధికారి మినిస్ట్రీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ ట్రస్టు పేరుతో కార్యాలయం ప్రారంభించాడు.

పోలీసులకు రివార్డును అందజేస్తున్న ఎస్పీ

ద్విచక్రవాహనాలు..ఇతర యంత్రాలు ఎరచూపి... ద్విచక్రవాహనం ఖరీదులో 70 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ట్రస్టు ద్వారా సమకూర్చి కొనుగోలుకు అవకాశం కల్పిస్తామని ప్రజలను నమ్మించాడు. వీటితోపాటు ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, వరి నూర్పిడి యంత్రాలు ఇస్తామని అమాయక ప్రజలను నమ్మించాడు. సంతబొమ్మాళి, సారవకోట, జలుమూరు, పాతపట్నం, నరసన్నపేట, మెళియాపుట్టి, శ్రీకాకుళం పరిసరప్రాంతాల్లో ప్రజల నుంచి రూ.2,19,74,600 వసూలుకు పాల్పడ్డాడు. సుమారు 200 మందికి తక్కువ ధరకు వాహనాలు ఇప్పించి ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసుకున్నాడు.

 

కాలయాపనతో వెలుగులోకి... డబ్బులు చెల్లించినవారికి వాహనాలను ఇవ్వకుండా కాలయాపన చేయడం, అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన సంతబొమ్మాళికి చెందిన బాధితుడు కృష్ణారావు గత నెల 1వ తేదీన పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా, టెక్కలి పట్టణంలో సర్వాధికారి మినిస్ట్రీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ ట్రస్టు పేరుతో కార్యాలయం ప్రారంభించినట్లు తెలిసింది. ట్రస్టులో తనిఖీలు చేపట్టి రూ.25.40 లక్షల నగదు, రెండు తులాల బంగారు గొలుసు, రూ.12 లక్షలు విలువ చేసే కారు, రూ.లక్ష విలువ చేసే గృహోపకరణాలు స్వాధీనం చేసుకుని రాజాతిరుపతిరావును అరెస్టు చేశారు. రిమాండుకు తరలించిన అనంతరం విచారణ కొనసాగించనున్నారు. ఆధారాలు గల బాధితులకు కోర్టు ద్వారా నగదును అందించనున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

కేసును ఛేదించినవారికి రివార్డులు: కేసును చేధించిన టెక్కలి సీఐ నీలయ్యను ఎస్పీ అభినందించారు. సంతబొమ్మాళి ఎస్‌.ఐ.ఎన్‌.కామేశ్వరరావు, సంతబొమ్మాళి పోలీసుకానిస్టేబుళ్లు ఈశ్వరరావు, టి.చంద్రశేఖర్‌, శ్యామ్‌, రాజు, మురళీ, ఎర్రన్నకు రివార్డులు అందజేశారు. సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ ఆర్‌.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.