ఆదివారం, డిసెంబర్ 15, 2019
గాయకులను సత్కరిస్తున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ నుడా ఛైర్మన్ కోటంరెడ్డి
నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: పరమేశ్వరునికి సమర్పించిన స్వరనీరాజనం భక్తులను ఆనంద తన్మయంలో ఓలలాడించింది. సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న కార్తీక మాస మహారుద్రాభిషేకోత్సవాల ప్రారంభ వేడుక కార్తీకదీప స్వరార్చన శనివారం రాత్రి బాలాజీనగర్‌లోని త్యాగరాజ కల్యాణమండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాడుతాతీయగా గాయనీ గాయకులు అద్భుతమైన గానామృతంలో శివార్చనచేసి భక్తులను పరవశింపచేశారు. అనంత్ లౌలీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో గాయనీమణులు ఏల్చూరి సుగంధిని, మల్లాది అనూష, ఇందు శేఖర్, ఇందు మాధురిలు ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవించంద్ర పాల్గొని మాట్లాడారు. తొలుత కార్యక్రమాన్ని మాజీ నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సతీమణి సంధ్యతో కలిసి కార్తీకదీపాన్ని వెలిగించి ప్రారంభించారు. సింహపురి ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు