close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

తాజా వార్తలు

సోయా కొనుగోళ్ల నిలిపివేతతో రైతుల ఆగ్రహం

అధికారులు, ఖరీదుదారులతో వాగ్వాదం

మార్కెట్‌లో పడిగాపులు కాసిన రైతులు

అధికారులు, ఖరీదుదారులతో వాగ్వాదానికి దిగుతున్న రైతులు

భైంసా, న్యూస్‌టుడే : పట్టణంలోని గాంధీగంజ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోయా రైతులు వ్యాపారుల తీరుతో అసహనానికి గురయ్యారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సోమవారం విక్రయానికి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వారికి మార్కెట్‌ అధికారులు టోకెన్లు జారీ చేశారు. సుమారు 450 మంది రైతులు మొక్కజొన్న, సోయా దిగుబడులను మార్కెట్‌కు తరలించారు. కాగా ఇక్కడి వ్యాపారులు సరకును పరిశీలించి తేమ శాతం నిర్ధరించి మార్కెట్‌ అధికారులకు ఇచ్చి ఆన్‌లైన్‌లో బిడ్‌లు వేయాల్సి ఉంది. కానీ సాయంత్రం 5 గంటల వరకు సరకు వద్దకు వ్యాపారులెవరూ రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు ఆకాశంలో మబ్బులు ఉండటంతో సరకు తడుస్తుందని, రాత్రి ఇక్కడే బస చేయాల్సి ఉంటుందని ఆగ్రహించిన వారు మార్కెట్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. కొనుగోలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక్కడి వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్పందించిన అధికారులు వెంటనే ఖరీదు దారులను పిలిపించి మాట్లాడారు. ఒక దశలో ఖరీదుదారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వెంటనే తూకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారసంత కావడంతో కొనుగోలు చేసిన సరకును తీసుకెళ్లేందుకు వీలులేదని, మంగళవారం ఉదయం కొనుగోళ్లు చేపడతామని ఖరీదుదారులు పేర్కొన్నారు. దాంతో పాటు సకాలంలో సరకు ధరలు ఇవ్వడం లేదని, దీంతో తూకాలకు సమయం లేక కొనుగోళ్లు చేయడం లేదని సాకు చెప్పారు. మార్కెట్‌ కమిటీ కార్యదర్శి అడేల్లు ఎంతకీ దిగిరాని వ్యాపారులకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా.. కొనుగోళ్లకు వారు ఒప్పుకొన్నారు. కాగా రాత్రి 8 గంటలైనా బిడ్లు వేయలేదు. ధరలు ప్రకటించలేదు. ఇదంతా చేయాలంటే రాత్రి 11 అవుతుందని, దీంతో తూకాల్లో మోసపోయే అవకాశముందని వారిని ఆయన నచ్చజెప్పారు. మంగళవారం బిడ్లు వేసి ధరలు ప్రకటించి తూకాలు వేస్తారని రైతులను ఒప్పించారు. చేసేదేమి లేక శాంతించిన రైతులు అక్కడే పడిగాపులు కాశారు. పంట దిగుబడులపై టార్పాలిన్లు కప్పి జాగ్రత్తపడ్డారు. రైతుల ఆందోళన సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ వేణుగోపాల్‌రావు, అధికారులు, వ్యాపారులు రైతులతో మాట్లాడి శాంతింపజేశారు.


సోమవారం రాత్రి పంట దిగుబడుల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు


పడిగాపులు కాసి అలసి అక్కడే నిద్రిస్తున్న రైతులు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.