close

బుధవారం, అక్టోబర్ 16, 2019

తాజా వార్తలు

మాటలతో ఆకట్టి...మస్కా కొట్టి

వైద్య నిపుణులకు  టోకరా
విదేశాల్లో గొప్ప అవకాశాలంటూ నయా సైబర్‌ వంచన
ఈనాడు, హైదరాబాద్‌

ఎంత దూరమైనా వెళ్లి పేరు, డబ్బు సంపాదించాలని ఉవ్విళ్లూరే ప్రతిభావంతులను..ముఖ్యంగా  వైద్యరంగంలోని వారిని మాటలతో ఆకట్టుకుంటారు. మరిన్ని మంచి అవకాశాలు వచ్చేలా చేస్తామని; ఆస్ట్రేలియా, సింగపూర్‌, మలేసియా...ఎక్కడికైనా సరే చేరి కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చేలా చూస్తామని నమ్మబలుకుతారు. వివిధ జాబ్‌ పోర్టళ్లలో తమ అర్హతలను ఉంచే నగర యువతను దిల్లీ కేంద్రంగా ఆకర్షించి సైబర్‌ నేరాలకు పాల్పడి ఆ తర్వాత మొహం చాటేస్తారు. అలా తమదైన రీతిలో దండుకుంటున్న వంచకుల ఆగడాలు పెచ్చుపెరుగుతున్నాయి. కేవలం వారంరోజుల వ్యవధిలోనే ఇద్దరు వైద్యనిపుణులను అదే కోవలో మోసం చేసిన ఉదంతాలు తాజాగా బయటపడ్డాయి. దాదాపు రూ.5.5 లక్షలను జమ చేయించుకుని మాయమైన ఆ వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది.

నేరం కథాక్రమం ఇదీ..
ఉద్యోగార్థుల నంబర్లు సేకరించి, వారికే నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. ‘మీరు చాలా ప్రతిభావంతులు. మీకున్న అర్హతలను వైద్యసంస్థలు పరిశీలించాయి. మీకు నచ్చిన చోట చేరండి’ అంటూ కబుర్లు చెబుతున్నారు. ఆకర్షణీయమైన జీతం ఉంటుందని, ఉచితంగా వసతి కల్పిస్తారని, అంతా అయ్యాక తమకు కమీషన్‌ ఇస్తే చాలని ఆశపెడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుం, విదేశాలకు పంపించే ప్రక్రియలంటూ..నగదు బదిలీ చేయించుకుంటున్నారు. నాంపల్లిలో నివాసముంటున్న ఒక వైద్యనిపుణుడు అక్కడే ఓ ఫార్మసీలో ఆచార్యుడిగా నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. సింగపూర్‌లో ఐదేళ్లు పనిచేసి తిరిగి వద్దామనుకున్న ఆయన- ఒక డాట్‌ కాంలో తన అర్హతలను రెండు నెలల క్రితం నమోదు చేసుకున్నారు. గత నెల 15న దిల్లీ నుంచి నరేష్‌ పేరుతో ఒకతను ఫోన్‌ చేశాడు. ‘మీ విద్యార్హతల ఆధారంగా నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లో ఎంతో గొప్ప అవకాశం లభిస్తుంది’ అని చెప్పాడు. మరో రెండు కార్పొరేట్‌ వైద్యసంస్థల ప్రతినిధులూ సంసిద్ధత వ్యక్తంచేశారని నమ్మించాడు. ‘యూనివర్సిటీ’లో ఉద్యోగం వస్తే తనకు రూ.1.5లక్షలు ఇవ్వాలన్నాడు. పూర్తిగా విశ్వసించిన ఆయన నగదును రెండు రోజుల్లోనే అతడికి పంపించారు. ఆగస్టు చివరి వారం నుంచే రక్షిత్‌, మోహన్‌, రష్మి పేర్లతో ముగ్గురు ఆయనతో మాటలు కలిపారు. ఉద్యోగ నియామక పత్రం వస్తుందని, వీసా ఇప్పిస్తామని మరింత బురిడీ కొట్టించి దశలవారీగా రూ.3.26లక్షలు ‘సొంతం చేసుకున్నారు’. ఉద్యోగం ఇంకెప్పుడని ఆయన ప్రశ్నిస్తే, సెప్టెంబరు తొలివారంలో నియామక కాగితాలు వస్తాయన్నారు.రెండోవారం దాటుతున్నా వాటి జాడ లేకపోవడంతో, అనుమానించిన ఆయన ఫోన్‌ చేసినా స్పందన లేదు. నరేష్‌తో మాట్లాడేందుకు యత్నించినా, ఫోన్‌ స్విచ్చాఫ్‌ అని వచ్చింది. వెంటనే  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పంజాగుట్ట.. మలేసియా.. సికింద్రాబాద్‌
పంజాగుట్టలోని ఓ వైద్యపరీక్షల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న నిపుణుడొకరు మలేసియాలో అవకాశం వస్తే వెళ్లాలనుకున్నారు. గతనెల చివరి వారంలో డాట్‌కాంలో తన అర్హతలను నమోదు చేశారు. రెండురోజుల తర్వాత రేవంత్‌ అనే వ్యక్తి ఫోన్‌ చసి, మలేసియాలోనే ఒక ప్రైవేటు వైద్యశాలలో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. అక్కడ పనిచేసేముందు సికింద్రాబాద్‌లోని ఓ వైద్య కేంద్రంలో రెండు నెలలు ఉండాలన్నాడు. వారే రెండు నెలలూ  జీతాలిస్తారని, అందులో కొంత మలేసియా సంస్థ యాజమాన్యం భరిస్తుందని చెప్పి మోసగించాడు. చివరికి ఆయన వారం తర్వాత రేవంత్‌కు ఫోన్‌ చేశారు. సికింద్రాబాద్‌ డయాగ్నైజ్‌ కేంద్రానికి వెళ్లాలని, ధరావతుగా రూ.80వేలు చెల్లించాలని అనడంతో ఆ వ్యక్తి సూచించిన ఖాతాలోనే నగదు వేశారు.అనంతరం సికింద్రాబాద్‌ కేంద్రానికి వెళ్లి అడిగితే, అటువంటిదేమీ లేదని సమాధానం వచ్చింది. విషయం గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.