close

శనివారం, జులై 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముందడుగు

రైతు వేదికలకు స్థల సేకరణ

గ్రామాల్లో అధికారుల పర్యటన

న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం

అన్నదాతలకు వ్యవసాయ శాఖ సేవలు మరింత సులభం కానున్నాయి. గ్రామాల్లో రైతుల సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం జిల్లాలోని పలు గ్రామాల్లో స్థల సేకరణ నిర్వహిస్తోంది.

జిల్లాలో ప్రస్తుతం మండల కేంద్రాల్లోనే వ్యవసాయశాఖ కార్యాలయం ఉంది. చిన్న అవసరానికి సైతం గ్రామాల్లోని రైతులు మండల కేంద్రానికి వెళ్లి అధికారులను సంప్రదించాలి. పంటల సీజన్‌లో సమయం లేక ఇబ్బంది పడేవారు. దీంతో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారు. వ్యవసాయ క్లస్టర్‌ గ్రామంలోనే ఉంటూ రైతులకు సలహాలు, సూచనలతోపాటు ఇతర సేవల్ని అందించాల్సి ఉంది. ఏఈవో స్థానికంగా ఉండేందుకు కార్యాలయం కరవైంది. మండల కేంద్రంలోని కార్యాలయం నుంచే విధులు నిర్వహించాల్సి వస్తోంది. సాగు సమస్యలపై సమావేశాలు అక్కడనే నిర్వహించడంతో గ్రామాల్లోన్ని రైతులు చాలా మంది హాజరుకాలేక పోతున్నారు. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయశాఖ సేవలు రైతుల ముంగిటికి తెచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెవెన్యూ గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన వ్యవసాయ క్లస్టర్ల కేంద్రంలో రైతు వేదికలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని గత సీజన్‌లో ప్రతిపాదించినా వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. ఈసారి వానాకాలం సీజన్‌లోనే రైతు వేదికల్ని నిర్మించి అన్నదాతలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వ్యవసాయ శాఖ యంత్రాంగం మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రైతు వేదిక నిర్మాణానికి స్థలసేకరణ, నిధులపై దృష్టి సారించారు.

మునిపల్లి శివారులో స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

పూర్తి కావచ్చిన స్థలసేకరణ..

అర్బన్‌ జిల్లాలోని వ్యవసాయ క్లస్టర్‌ గ్రామాల్లో రైతు వేదికల్ని నిర్మించేందుకు అధికారులు స్థల సేకరణ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమం పూర్తి కావచ్చింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు స్థలాల కేటాయింపునకు చొరవ తీసుకుంటున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 11 మండలాలుండగా 40 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టరుకు ఒక రైతు వేదికను నిర్మిస్తారు. ఒక రైతు వేదిక నిర్మాణానికి కనీసం 20 గుంటల స్థలం అవసరమని ప్రతిపాదించారు. ఇందుకోసం గ్రామంలోని ప్రభుత్వం భూమిని కేటాయించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో దాతల నుంచి స్థలాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు లేని గ్రామాల్లో కొనుగోలు చేయాలని కూడా ప్రతిపాదించారు.

ఒక్కో వేదికకు రూ.20లక్షలు..

ఒక్క వేదిక నిర్మాణానికి సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. రైతు వేదికలో ఒక సమావేశ మందిరం, రెండు గదులతో కార్యాలయ నిర్మాణం, ఇతర సౌకర్యాలతో నిర్మించేందుకు ఇంజినీర్లు ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్తగా నిర్మించే రైతు వేదికలు ఈ వానాకాలం సీజన్‌లోనే రైతులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.