close

శనివారం, జులై 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాంకేతికతకు దూరంగా పల్లెలు..!

ఈ-పంచాయతీల్లో నిర్వహణ లోపం

నిరుపయోగంగా కంప్యూటర్లు, సామగ్రి

ఆపరేటర్లు లేక అవస్థలు

పాలకుర్తి, న్యూస్‌టుడే

గ్రామ పంచాయతీల ద్వారా విస్తృత సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐదేళ్ల కిందట రూ.లక్షల విలువ చేసే కంప్యూటర్లు, ఇతర సామగ్రిని అందజేసింది. ఎంపిక చేసిన పల్లెలను ఈ-పంచాయతీలుగా గుర్తించి ఈ-సేవలకు శ్రీకారం చుట్టింది. కాలక్రమేణ అనేక గ్రామాల్లో వాటి నిర్వహణ లేకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో విలువైన సామగ్రి, కంప్యూటర్లు మూలనపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధిని కాంక్షిస్తున్న దృష్ట్యా, జిల్లాలో ఈ-పంచాయతీల నిర్వహణను మెరుగుపరిస్తే బాగుంటుందని సూచిస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.

నగామ జిల్లాలో 281 గ్రామాల్లో 132 పల్లెలను ఈ పంచాయతీలుగా గుర్తించారు. విలువైన సామగ్రి, కంప్యూటర్లను ఆ గ్రామాలకు అప్పగించారు. ఆరంభంలో ఆయా పంచాయతీల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా ఏర్పాటు చేసి పలు చోట్ల ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించారు. కొన్ని చోట్ల నియమించలేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా ఇవ్వలేదు. నియమించిన చోట జీతాలు చెల్లించలేకపోవడంతో ఆపరేటర్లు మానేశారు. కంప్యూటర్లు మరమ్మతుకు గురైతే నిర్వహణ లేకపోవడం, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోవడం.. తదితర కారణాలతో ఆ పల్లెల్లో కంప్యూటర్లు, సామగ్రి దుమ్ముపట్టి పనికిరాకుండా పోతున్నాయి. రానురాను పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రస్తుతం మండలానికి ఒకరు, ఇద్దరు చొప్పున ఆపరేటర్లు సేవలందిస్తున్నారు. కొన్ని పల్లెల్లో కార్యదర్శులే అన్ని పంచాయతీల్లో ఆన్‌లైన్‌ సేవలను నిర్వహిస్తున్నారు. కొందరు కార్యదర్శులు ఫోన్లతో నెట్టుకొస్తున్నారు. ఆపరేటర్లు లేకపోవడంతో వారిపై పని భారం పడుతోంది.

ఈ పంచాయతీల్లో చేసే పనులు..

కార్యదర్శుల రోజువారి విధులకు సంబంధించిన వివరాలు, నివేదికలను పొందుపరచాలి ● జనన, మరణాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి ● నూతన వివాహాలకు సంబంధించిన వివరాలు ● దుకాణాలు, గ్రామం పరిధిలోని ఆస్తులకు సంబంధించినవి ● గృహ, ఇతర నిర్మాణ భవంతిలకు సంబంధించిన అనుమతిపత్రాలు ● ఇంటి, నల్ల పన్నుల వివరాలు ● పంచాయతీ చట్టంలోని నగదుకు సంబంధించిన లావాదేవీలు ● ఉపాధి హామీ పనులకు సంబంధించిన వివరాలు.


గతంలోనే అందించారు కానీ..

- కొంరయ్య, సర్పంచి, గూడూరు

గతంలోనే కంప్యూటర్లు, సామగ్రి అందించారు. కానీ మళ్లీ కనీసం వారి గురించి ఊసెత్తడం లేదు. ఆపరేటర్లను నియమించలేదు. తాత్కాలికంగా నియమించుకున్నా, జీతం ఇవ్వకపోవడంతో మానేశారు. ఆపరేటర్లు నియమించి ఉంటే ఈ పాలన సజావుగా సాగేది.

కార్యదర్శులే విధులు నిర్వహిస్తున్నారు

- వెంకటేశ్వరరావు, డీపీవో, జనగామ

కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. గతంలో కొన్ని పంచాయతీలకు కంప్యూటర్లు ఇచ్చాం. ఆపరేటర్లను కూడా నియమించాం. కానీ రానురాను వివిధ కారణాలతో ఆపరేటర్లు మానేశారు. ఫలితంగా కంప్యూటర్లు, సామగ్రి మూలనపడ్డాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులే కంప్యూటర్లను వినియోగిస్తూ.. ప్రజలకు సేవలందిస్తున్నారు. నిర్వహణ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.