close

శుక్రవారం, జులై 10, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షిప్త వార్తలు

కాలువలు శుభ్రం: జులైవాడ: నగరంలోని 37వ డివిజన్‌ జులైవాడ గిరిజన బాలికల వసతిగృహం ప్రాంతంలో ఉన్న మురుగు కాలువలు శుభ్రం చేయడంలేదంటూ కాలనీకి చెందిన రాజు ‘ఈనాడు’కు తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ స్పందించి కాలువలను శుభ్రం చేయించి సమస్యకు పరిష్కారం చూపారు.

రోడ్డు పరిశుభ్రం : హన్మకొండ చౌరస్తా: హన్మకొండ కాకాజీకాలనీ ప్రధాన రహదారి పక్క వీధుల్లో రోడ్డు పక్కగా ఉన్న చెత్తను తొలగించడం లేదంటూ కాలనీకి చెందిన ప్రశాంత్‌ ‘ఈనాడు’కు తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అనీల్‌ సిబ్బందితో ఆ ప్రాంతంలోని వీధులను శుభ్రం చేయించారు.

రాళ్లు తొలిగించారు: తరిగొప్పుల : తరిగొప్పులలోని ఏడో వార్డు మురుగుకాల్వలో బండ రాళ్లు పడి మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుందని కాలనీవాసులు ఈనెల 26న ‘ఈనాడు’కు తెలిపారు. స్పందించిన గ్రామ కార్యదర్శి రామారావు సిబ్బందితో రాళ్లను తొలగించారు.

విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ: దుగ్గొండి, న్యూస్‌టుడే: దుగ్గొండి మండలంలోని మందపల్లిలో వారం రోజుల క్రితం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. సమస్యను పరిష్కరించాలని ఈనెల 27న ‘ఈనాడు’ డిస్కం ఏఈ సురేశ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన ఆయన సిబ్బంది సహకారంతో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి నీటి సరఫరా బావి మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పించారు.


రాజీనామా చేస్తా..

వరంగల్‌ 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ శారదాజోషి


వివరాలు వెల్లడిస్తున్న కార్పొరేటర్‌ శారదాజోషి

దేశాయిపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ మహా నగర పాలక సంస్థకు చెందిన అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రాజీనామా చేస్తానని 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ శారదాజోషి తెలిపారు. గురువారం పోచమ్మమైదాన్‌లోని డివిజన్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల రోజులుగా తన డివిజన్‌ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ పూడికతీత, ఇతర ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని, మనస్తాపం చెందిన తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యలను పరిష్కరించని కార్పొరేటర్‌ పదవి వద్దని, శుక్రవారం బల్దియా కమిషనర్‌ పమేలా సత్పతిని కలిసి రాజీనామా అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ భర్త సురేష్‌జోషి, డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు.


కువైట్‌ నుంచి స్వస్థలానికి వచ్చేందుకు ఏర్పాట్లు

అహ్మద్‌ హుస్సేన్‌కు ఆర్థిక సహాయం అందజేస్తున్న వినయ్‌భాస్కర్‌

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : లాక్‌డౌన్‌కు ముందు కువైట్‌ వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వరంగల్‌వాసులను స్వస్థలానికి రప్పించేందుకు చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ కృషి చేశారు. నగరంలోని 41వ డివిజన్‌కు చెందిన సమద్‌ (ఫసీయోద్దీన్‌) రెండు నెలల కిందట తన కుటుంబీకులతో కువైట్‌ వెళ్లారు. అక్కడ పని దొరక్క స్వదేశానికి రాలేని పరిస్థితుల్లో దయనీయ జీవితం గడుపుతున్నట్లు వారు వినయ్‌భాస్కర్‌కు ఫోన్‌లో తెలిపారు. దీంతో చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు తెలపగా ఆయన సమద్‌ నగరానికి వచ్చేలా ఏర్పాట్లు చేయించారు. మరో రెండు రోజుల్లో వారు రానున్నట్లు తెలిపారు. గురువారం నగరంలోని సమద్‌ తండ్రి అహ్మద్‌ హుస్సేన్‌కు ఇంటికి రూ.30 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్పొరేటర్‌ ఉపమేయర్‌ సిరాజుద్దీన్‌, డివిజన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌, నాయకులు ప్రదీప్‌ తదితరులున్నారు.


మతిస్థిమితం కోల్పోయిన ముంబయి వైద్యురాలు

కుటుంబ సభ్యులకు అప్పగింత

మహిళను అప్పగిస్తున్న పోలీసులు

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ మండలం పెంబర్తిలో గురువారం ఓ మహిళ గాయాలతో గ్రామంలో తిరుగుతున్నట్లు స్థానికులు జనగామ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆ మహిళను జనగామలోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. ఆమె వద్ద ఉన్న వివరాలను సేకరించగా ఆమె పేరు అలోక్‌మిత్ర అని, ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అని తెలిసింది. సంబంధిత కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు జనగామకు వచ్చారు. మతిస్థిమితం కోల్పోవడంతో గత నెలలో ముంబయి నుంచి తప్పిపోయినట్లు వారు వివరించారు. ఏసీపీ వినోద్‌కుమార్‌ ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.


‘నిరాశపరిచిన ప్రత్యేక ప్యాకేజీ’

మాట్లాడుతున్న రాములు

గిర్మాజీపేట, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌తో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రుణ మాఫీ చేయాలని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) డిమాండ్‌ చేసింది. గురువారం వరంగల్‌ అండర్‌బ్రిడ్జి వద్ద గల ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయం ఓంకార్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ సభ్యుడు బీరం రాములు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ నష్టాల్లో ఉన్న రైతాంగానికి ఊరటిస్తుందని ఎంతో ఆశించినా, నిరాశపరిచిందన్నారు. సమావేశంలో రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ సభ్యులు సోమిడి శ్రీనివాస్‌, రాచర్ల బాలరాజు, గైకాడ్‌ మోహన్‌రావు, వీరగోని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


నేడు కేయూ అధికారులతో గవర్నర్‌ వీసీ

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే : కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాకతీయ విశ్వవిద్యాయలం రిజిస్ట్రార్‌ ఆచార్య కె.పురుషోత్తం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేయూలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరిస్తారని ఆయన పేర్కొన్నారు.


రాష్ట్రావతరణ దినోత్సవంలో ముఖ్య అతిథులు వీరే

ఈనాడు, వరంగల్‌: జూన్‌ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించే ముఖ్య అతిథుల పేర్లను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. వరంగల్‌ రూరల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, వరంగల్‌ అర్బన్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, జనగామలో మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు, భూపాలపల్లిలో మండలి విప్‌ టి.భానుప్రసాద్‌రావు, ములుగులో మండలి విప్‌ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు పాల్గొంటారు.


పరీక్షల నిర్వహణపై కమిటీ

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయంలో అన్ని పరీక్షల నిర్వహణపై వర్సిటీ అధికారులతో కమిటీని నియమించినట్లు కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.పురుషోత్తం గురువారం ప్రకటనలో తెలిపారు. పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో అన్ని ఫ్యాకల్టీ డీన్‌లు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కమిటీ పరీక్షల నిర్వహణ కోసం చేపట్టే మార్పులపై నివేదిక సమర్పించాలన్నారు. నివేదిక ఆధారంగా ఒకటి రెండు రోజుల్లో యూజీసీ నిబంధనల మేరకు విధాన నిర్ణయాలను రూపొందిస్తామని రిజిస్ట్రార్‌ వివరించారు. కేయూ స్టాండింగ్‌ కమిటీలో తుది నిర్ణయం తీసుకుని కొత్త విధానాలను అమలు చేస్తామని ఆయన వివరించారు.


అక్రమ లేఅవుట్లపై హెచ్చరిక బోర్డులు

గిర్నిబావి (దుగ్గొండి), న్యూస్‌టుడే: గిర్నిబావిలోని అక్రమ లేఅవుట్లకు వారం రోజుల క్రితం హద్దురాళ్లు తొలగించిన పంచాయతీ అధికారులు తాజాగా హెచ్చరిక బోర్డులు గురువారం ఏర్పాటు చేశారు. 2007లో 33 ఎకరాల్లో, 2019లో 5.05 ఎకరాల్లో రెండు వేర్వేరు వెంచర్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ప్లాట్లుగా చేసి హద్దురాళ్లు పాతుకున్నారు. హద్దురాళ్లను డీపీవో సిబ్బందితో తొలగించారు. మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్‌ లేఅవుట్ల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసి అక్రమ లేఅవుట్లలో నిర్వహించే అమ్మకం కొనుగోళ్లు చెల్లుబాటు కావని బోర్డులు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


పార్కులు సుందరీకరించాలి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: పక్షం రోజుల సమయం ఇస్తున్నా.. వరంగల్‌ మహా నగరంలోని పార్కులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని బల్దియా కమిషనర్‌ పమేలా సత్పతి ఉద్యాన, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులను ఆదేశించారు. గురువారం గ్రేటర్‌ సమావేశ మందిరంలో పార్కులాభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. అన్ని పార్కుల్లో గ్రీనరీ, పూల మొక్కలు, పిల్లల ఆట వస్తువులు, ఓపెన్‌, ప్లే జిమ్‌లు, తాగునీటి వసతి ఉండేలా చూడాలని కోరారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలని, ప్రతి పార్కు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని, వీధిదీపాలు, కంపోస్టు, డస్ట్‌ బిన్లు, టూల్‌ రూమ్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. నెల రోజుల్లో టాయిలెట్స్‌ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, సీహెచ్‌వో సునీత, ఈఈ లక్ష్మారెడ్డి, పార్కు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.