close

శనివారం, జులై 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కారాగారానికి పచ్చలహారం

ఖర్జూర లాంటి పండ్ల మొక్కల పెంపకం

పక్షుల ఆలవాలంగా మారుతున్న ప్రాంగణం

ఈనాడు, వరంగల్‌

అది వరంగల్‌ కేంద్ర కారాగారం. వెనక భాగమంతా గతేడాది వరకు పెద్ద చెత్త కుప్ఫ దాన్ని చదును చేసి పచ్చని మొక్కలతో కళకళలాడే నర్సరీగా మార్చారు. ఈసారి హరితహారం కార్యక్రమానికి ఏకంగా 8 లక్షల మొక్కలతో సిద్ధమైంది. దేశంలో కారాగారాలు నిర్వహించే అతిపెద్ద నర్సరీ ఇదేనని అధికారులు చెబుతున్నారు.

ది ఎకరాల్లో భారీ నర్సరీని ఏర్పాటు చేశారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా 14 లక్షల మొక్కలను పెంచారు. గతేడాది 6 లక్షల వరకు కుడాకు అందజేయగా, 30వేల వరకు ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. ఈ సారి మరో 8 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఖర్జూర లాంటి ఎడారి మొక్కలను నాటడం ఈ సారి ప్రత్యేకత. పైగా అందరూ ఇళ్లలో పూజించే తులసి మొక్కలను కూడా 30 వేల వరకు పెంచుతున్నారు. మందార, మల్లె, గులాబీ, గన్నేరు లాంటి పూలు, దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, నేరేడు, సీతాఫలం లాంటి పండ్లు, ఉసిరి, మారేడు తదితర ఔషధ గుణాలున్న 60 జాతుల మొక్కలను పెంచుతున్నారు. 60 మంది ఓపెన్‌ ప్రిజన్‌ ఖైదీలు ఈ నర్సరీ నిర్వహణ కోసం పనిచేస్తున్నారు.

మొక్కలను పరిశీలిస్తున్న పర్యవేక్షకుడు మురళీబాబు

సీతాకోక చిలుకలకు, అనేక రకాల పక్షులకు ఇది ఆలవాలంగా మారింది. ఉదయం వేళల్లో నెమళ్లు కూడా ఇక్కడ సందడి చేస్తున్నాయని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. మై నేషన్‌ నర్సరీగా దీనికి నామకరణం చేశారు. మొక్కల బెడ్డు వద్ద వాటి పేర్లతో బోర్డులు ఏర్పాటుచేశారు. విచారణ ఖైదీలు ప్లాస్టిక్‌ కవర్లలో మట్టి నింపేందుకు వస్తుంటారు. ఇప్పటికే నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో పేరు పొందిన వరంగల్‌ కేంద్ర కారాగారం, ఇప్పుడు కారాగారాల్లో దేశంలోనే అతిపెద్ద నర్సరీని నిర్వహిస్తూ మరో ఘనత సాధిస్తోంది.

అలా మొదలైంది

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేయాలని గత కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌తో పాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు. వరంగల్‌ కేంద్ర కారాగారం పర్యవేక్షకుడు ఎన్‌.మురళీబాబు కారాగారం వెనక భాగంలో డంపింగ్‌ యార్డును నర్సరీగా మార్చడానికి ముందుకొచ్చారు. డంపింగ్‌ యార్డు కోసం ఓ మూలన స్థలాన్ని గుర్తించి, అక్కడ శాస్త్రీయ పద్దతిలో డంపింగ్‌ యార్డును నిర్వహిస్తున్నారు. ఇక నర్సరీ స్థలంలో చదును చేసేందుకు ఇదే ఆవరణలో మట్టిని తీసుకునేందుకు భారీ కుంటను తవ్వారు. వర్షాకాలంలో ఆ కుంటలో నీళ్లు నిండడంతో చేపలు కూడా పెంచుతున్నారు. ఈ నీటిని మొక్కల పెంపకం కోసం వాడుతున్నారు. పైగా ఇక్కడ కుంట అభివృద్ధి చేయడం వల్ల జైలు ప్రాంతంలో భూగర్భజల మట్టం పెరిగి బోరుబావుల్లో కూడా నీరు పెరిగింది. జంతు శాస్త్రం చదువుకున్న పర్యవేక్షకుడు మురళీబాబుకు జంతువులు, మొక్కలంటే చాలా ఇష్టమట. అందుకే ఈ నర్సరీని చూసేందుకు రోజుకు రెండు సార్లు వచ్చి పనులను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. మొక్కల పెంపకంతో ఉదయం వేళ నెమళ్ల సందడి మొదలైంది. అనేక రకాల అరుదైన పక్షులు వస్తుండడంతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా మారి, జైలుకు ఇదో పచ్చలహారంగా రూపు దాల్చింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.