close

గురువారం, అక్టోబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దస్త్రం దాటని పరిహారం

92 మంది రైతుల ఎదురుచూపులు
అయిదేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
న్యూస్‌టుడే, గూడూరు-వాకాడు


స్వర్ణముఖి నదికి కుడి వైపున రైతుల పంట పొలాల్లో పోసిన పొర్లుకట్ట

వారంతా చిన్న, సన్నకారు రైతులు.. పొర్లుకట్టల నిర్మాణంలో తమ భూములు కోల్పోయారు.  పరిహారం ఇస్తామన్న అధికారులు ముఖం చాటేశారు. గత అయిదేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... మీకు ఇంత పరిహారం ఇస్తామని కానీ, ఫలానా సమయంలో ఇస్తామన్న మాట కానీ లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కట్టల నిర్మాణంలో కొంత భూమి పోయి.. మిగిలిన దానిలో ఇసుక మేటలేసి జీవనం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
సమస్య: వాకాడు స్వర్ణముఖి నదికి బ్యారేజీ నుంచి కుడి వైపున 2016లో పొర్లు కట్టల నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో అయిదు గ్రామాలకు చెందిన 92 మంది రైతుల 39.54 ఎకరాలు కట్ట నిర్మాణంలో పోయాయి. సంబంధిత రైతులకు గత అయిదేళ్లుగా భూ పరిహారం అందలేదు. వారు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సాగదీత: అయిదేళ్ల కిందటే.. సంబంధిత దస్త్రాలు జిల్లా, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలకు వెళ్లినా.. అక్కడ ఎటూ తేల్చడం లేదు. 2016 మార్చిలో నదికి పొర్లుకట్టలు పోయగా- అదే ఏడాది జులైలో అధికారుల నుంచి భూ పరిహారంపై రైతులకు ఫారం-6 నోటీసులు అందాయి. తర్వాత మళ్లీ రెండోసారి నవంబరులో నోటీసులిచ్చారు. ఏడాది తర్వాత అవి రద్దయ్యాయని తెలిపారు. మళ్లీ గ్రామాల వారీగా భూ పరిహారం నోటీసులు ఇస్తున్నా.. అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇలా సమస్య ఏళ్లుగా దస్త్రాల్లోనే సాగుతోంది. 
సవాలు:  2014లో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ నుంచి మండలంలోని పామంజి వరకు 14.5 కిలో మీటర్ల పొడవునా నదికి కుడివైపున రూ. 17కోట్లతో పొర్లు కట్టల నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో వాటి కోసం వాకాడు, కోట మండలాల్లోని రైతులు తమ భూములిచ్చారు. వాకాడు మండలంలోని నెల్లిపూడిలో 5.58 ఎకరాలు, పోళ్ల కండ్రిగలో 5.97, మొలగనూరులో 4.35, గంగన్నపాలెంలో 1.40, కోట మండలం పుచ్చలపల్లిలో 22.24 ఎకరాల చొప్పున 92 మంది రైతులు తమ భూములు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులే. అటు భూములను కోల్పోయి.. ఇటు పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులను అడిగితే.. తాము ప్రతిపాదనలు పంపాం. ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్న సమాధానం తప్ప.. సమస్య పరిష్కారం కావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వం కోల్పోయాం - దుంపల పొండయ్య, రైతు గంగన్నపాలెం 
నాకు 40 సెంట్ల భూమి ఉంది. అందులో 12 సెంట్లు పొర్లుకట్టల నిర్మాణంలో పోయింది. 2015లో వచ్చిన వరదలకు మిగిలిన 28 సెంట్లలో ఇసుక మేటలు లేచాయి. అటు పంటలు వేసుకోలేక, కట్టలకు ఇచ్చిన భూమికి పరిహారం అందక సర్వం కోల్పోయాం. ఇకనైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలి.
కలెక్టర్‌ స్పందించాలి - కర్లపూడి రమణమ్మ, మహిళా రైతు
మాకు 60 సెంట్ల భూమి ఉండగా- అందులో 20 సెంట్లు పొర్లకట్టల నిర్మాణంలో పోయింది. మిగిలిన దానిలో ఇసుక మేటలు వేయడంతో పంటలు పండటం లేదు. గత అయిదేళ్లుగా పరిహారం కోసం తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. కలెక్టరైనా స్పందించి.. న్యాయం చేయాలి. 
పరిశీలించి చర్యలు - ఆర్‌.గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్, గూడూరు 
స్వర్ణముఖి పొర్లుకట్టల భూములకు సంబంధించిన రైతుల భూ పరిహారం ఇంత వరకు నాకు తెలియదు. పరిశీలించి, చర్యలు తీసుకుంటా. 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.