close

గురువారం, అక్టోబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిద్దరోతున్న నిఘా

పెరుగుతున్న నేర ప్రవృత్తి

వరుస సంఘటనలతో ఆందోళన

అల్లరి మూకలు పెట్రేగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని నేర సంస్కృతికి తెరదీస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. పోలీసు భయం లేకపోవడం.. తమను ఎవరూ ఏమి చేయలేరన్న ధీమాతోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న మాట వినిపిస్తోంది. సరైన నిఘా వ్యవస్థ లేకనే ఈ తరహా పోకడ పెరుగుతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి.. కఠిన చర్యలతో కట్టడి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు నెలల కిందట నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడిని తోటి స్నేహితులే దారుణంగా హత్య చేశారు. ఆరేడు మంది మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హతుడితో పాటు దాడి చేసిన వారిపై రౌడీషీట్‌లు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ బాలుడి అపహరణ కేసులో ప్రధాన నిందితుడిపై గూడూరు పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. అతడితో పాటు మరో ఇద్దరు కలిసి జిల్లాలో అపహరణ సంస్కృతికి తెరదీశారు. స్థానికులు గుర్తించి పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. అది మరువక ముందే.. తాజాగా నగరంలో రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రధాన నిందితుడి పైనా రౌడీషీట్‌ ఉండటం గమనార్హం.

న్యూస్‌టుడే, నెల్లూరు నేర విభాగం

జిల్లాలో రౌడీషీటర్ల సంఖ్య పెరుగుతోంది. అయిదు పోలీసు సబ్‌ డివిజన్ల పరిధిలోని పోలీసుస్టేషన్లలో 790 మందిపై షీట్లు ఉన్నాయి. వీటి సంఖ్య తగ్గించాల్సి ఉండగా- ఏటేటా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఎవరైతే ఎక్కువ సార్లు నేరాలకు పాల్పడుతారో.. సమాజంలో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తారో.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారో.. అలాంటి వారిపై షీట్లు తెరుస్తారు. రౌడీషీట్లు ఉన్నవారికి ప్రతివారం కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. స్టేషన్‌లో సంతకం చేయాలి. వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలి. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అవేమీ జరగడం లేదనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా స్టేషన్లకు కొత్త సీఐలు, ఎస్సైలు వచ్చినప్పుడు మాత్రమే రౌడీషీటర్లను పిలిపించి.. పరిచయాలు చేసుకొని పంపుతున్నారే తప్ఫ. కౌన్సెలింగ్‌ నిర్వహించడం లేదన్నది పలువురి వాదన.

అమలు కాని జేఆర్‌ఎంఎస్‌

పాత నేరస్థులపై నిఘా ఉంచేందుకు జైలు రిలీజస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(జేఆర్‌ఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. కారాగారాల నుంచి విడుదలైన ఖైదీల సమాచారాన్ని జేఆర్‌ఎంఎస్‌లో నమోదు చేస్తారు. న్యాయస్థానాల కానిస్టేబుళ్ల ద్వారా ఆయా స్టేషన్లకు సమాచారం అందుతుంది. జైళ్ల నుంచి విడుదలైన నిందితులను పోలీసులు విచారించాల్సి ఉంది. కారాగారంలో ఎవరెవరు కలిశారు? ఎవరితో మాట్లాడారు? శిక్ష అనుభవించిన నేరస్థుల వ్యూహం తదితర సమాచారం సేకరించాల్సి ఉంటుంది. జైలు జీవితం అనుభవించి వచ్చాక సమాజంలో ఎలా మెలుగుతున్నారు? కొత్తవారితో మాట్లాడుతున్నారా? కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారా? తదితరాలు పరిశీలన చేయాల్సి ఉంది. ఎక్కడా ఈ ప్రక్రియ సజావుగా జరగడం లేదు.

నిశితంగా పరిశీలిస్తాం..

రౌడీషీటర్ల కదలికలను నిరంతరం ఓ కంట కనిపెడుతుంటాం. వారి రోజువారీ జీవనాన్ని నిశితంగా పరిశీలిస్తుంటాం. నిఘా వ్యవస్థ లేనిదే పోలీసుశాఖ లేదు. సమాజంలోని ప్రతిఒక్కరి రక్షణ బాధ్యత పోలీసులదే. అలాంటప్పుడు శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్లను తేలికగా ఎందుకు తీసుకుంటాం. కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారి వరకు జ్యుడిషియల్‌ పరిధిలోని నిందితులపై నిఘా ఉంచుతారు. - వెంకటరత్నం, అదనపు ఎస్పీ, నెల్లూరు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.