close

సోమవారం, అక్టోబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆశల కిరణం.. ఆకాంక్షల తరుణం

పారిశ్రామికవాడ శంకుస్థాపనకు ఏర్పాట్లు


పారిశ్రామిక వాడ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో, మంత్రి ఓఎస్డీ తదితరులు

ఆత్మకూరు పట్టణం సమీపంలోని నారంపేట వద్ద ముంబయి రహదారిని ఆనుకుని పారిశ్రామికవాడకు రంగం సిద్ధమైంది. దీని ఏర్పాటుతో ఆత్మకూరుతోపాటు ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. నాలుగేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ ఊరించిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కనుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.

పారిశ్రామికవాడ స్థలాన్ని ఆర్డీవో సువర్ణమ్మ గురువారం పరిశీలించారు. ఆదివారం శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం నాటికి అన్ని పూర్తిచేయాలని సూచించారు. ఆర్డీవో వెంట మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఓఎస్‌డీ చెన్నయ్య, ఆత్మకూరు సీఐ సోమయ్య, ఆత్మకూరు పట్టణ వైకాపా కన్వీనర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి, సిండికేట్‌ ఫార్మర్‌ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, తహసీల్దారు కృష్ణప్రసాద్‌, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే

ఆత్మకూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతం. ఇక్కడ వ్యవసాయమే జీవనాధారం. అందులోనూ తీవ్ర కష్ట నష్టాలే. దీంతో యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్న.. వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రాంతంలో పరిశ్రమలు వస్తే.. తమ కష్టాలు కొంతైనా తీరుతాయని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. వీరి ఆశలను నిజం చేస్తూ ఎట్టకేలకు పారిశ్రామికవాడకు ఆత్మకూరు మండలం నారంపేట వద్ద ఏపీఐఐసీకి 173.65 ఎకరాలు సేకరించారు. ఆ స్థలంలో రోడ్లు వేసి.. ప్లాట్లు పెట్టి పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ పనులకు ఆదివారం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

ఆ రెండింటితో నాంది

ఆత్మకూరు పారిశ్రామికవాడ ఏర్పాటుకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ.. ప్రస్తుతం శంకుస్థాపన వరకు తీసుకువచ్చారు. మొదట ఈ ప్రాంతంలో ప్లాస్టిక్‌ పార్క్‌, ఫర్నీచర్‌ పార్క్‌ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఆయా ఉత్పత్తుల సామర్థ్యం, పరిశ్రమల అవసరాన్ని బట్టి ఏడు సెంట్ల నుంచి ఎకరా వరకు స్థలంలో ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే అదనంగానూ భూమిని కేటాయిస్తారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖా మంత్రి స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఎక్కువ సంఖ్యలోనే పరిశ్రమలు ఈ పారిశ్రామిక వాడకు తరలివస్తాయని ఆశిస్తున్నారు.

మౌలిక వసతులు కల్పిస్తాం : జె.చంద్రశేఖర్‌, జడ్‌ఎం, ఏపీఐఐసీ

నారంపేట వద్ద పారిశ్రామికవాడ ఏర్పాటుకు 173 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. మొదట ప్లాస్టిక్‌ పార్క్‌, ఫర్నిచర్‌ పార్కులు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన త్వరలో చేపడతాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సరళీకృత విధానాలతో సౌకర్యాలు అందుబాటులోకి తెస్తాం. మున్ముందు మరిన్ని పరిశ్రమలు వచ్చేలా వసతులు అందుబాటులోకి తెస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.