close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతరిక్ష కేంద్రాలపై కరోనా పడగ

పలువురు ఉద్యోగులకు పాజిటివ్‌ ●

ఇస్రో కేంద్ర కార్యాలయంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

సారాభాయ్‌ శతజయంతి ఉత్సవాలు, యువైకా వాయిదా

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)పై కరోనా పడగ విప్పింది. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా కేంద్రాలు ఉండగా- వాటిల్లోని పలువురు ఉద్యోగులకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. ఇస్రోతో పాటు ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించగా, ఆ ప్రభావం కాస్త అంతరిక్ష ప్రయోగాలపై పడింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి ఉత్సవాలను, యువైకా షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఇస్రో కేంద్ర కార్యాలయం బెంగళూరులో ఉంది. జులై నెలలో ఇక్కడ ఓ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. దాంతో కేంద్ర కార్యాలయంలో అత్యవసర పనుల మినహా మిగిలిన వాటిని నిలిపేశారు. ఉద్యోగులు సైతం విధులకు వెళ్లలేదు. తర్వాత గత నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. గత 22న లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం ఇస్రో కార్యాలయాలు తెరిచేందుకు సిద్ధమైనా, బెంగళూరులోని కేంద్రాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరగడంతో యాజమాన్యం 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. తాజాగా ఈ నెల మూడో తేదీ నుంచి కేంద్ర కార్యాలయంతో పాటు ఇతర కేంద్రాలను తెరిచేందుకు సిద్ధం కాగా.. మరికొందరికి పాజిటివ్‌ రావడంతో మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించారు.

షార్‌లోనూ...

గత నెలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని స్ప్రాబ్‌, ఆసుపత్రి, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం విభాగాల్లోనూ పలువురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో యాజమాన్యం ఉద్యోగులు విధులకు రాకుండా లాక్‌డౌన్‌ ప్రకటించింది. కొద్ది రోజుల తర్వాత 30 శాతం, ఆ తర్వాత 50 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో 11 మంది మహమ్మారి బారిన పడ్డారు. దాంతో అక్కడా కొద్ది రోజుల పాటు ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 50 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. దీంతో రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించిన పనులన్నీ వాయిదా పడ్డాయి.

పది ప్రయోగాల వరకు వాయిదా

ఈ ఏడాది గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3 సహా పది అంతరిక్ష ప్రయోగాలపై కరోనా ప్రభావం పడింది. కొన్ని నెలలుగా అంతరిక్ష మిషన్‌ల పనులు నిలిచిపోయాయి. పలుచోట్ల పరిశ్రమలు ఇప్పటికీ కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో లాక్‌డౌన్‌ ప్రభావం గగన్‌యాన్‌పై పడిందని చెప్పొచ్ఛు చంద్రయాన్‌-2 ప్రయోగం ల్యాండింగ్‌ లోపం తలెత్తి విఫలమైన తర్వాత చంద్రయాన్‌-3కి ఇస్రో ప్రణాళికలు రచించింది. ఈ ఏడాది చివరిలోగా ఈ ప్రయోగం, మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. దీనికి ముందుగా ఈ ఏడాది చివర్లో చేయతలపెట్టిన మానవ రహిత ప్రయోగం సైతం వాయిదా పడినట్లే.

ప్రత్యేక అధికారుల నియామకం

నగరంలోని కొవిడ్‌ ఆసుపత్రులకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీజీహెచ్‌కు సంయుక్త కలెక్టర్‌(ఎఫ్‌ఏసీ) వీకే శీనానాయక్‌, నారాయణ కొవిడ్‌ ఆసుపత్రికి తెలుగు గంగ డిప్యూటీ కలెక్టర్‌ జీవీవీఎస్‌ నాగలక్ష్మి, అపోలోకు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మధుసూదన్‌రావు, మెడికవర్‌కు సెట్నెల్‌ సీఈవో యతిరాజ్‌, విజయకుమార్‌ మెమోరియల్‌ నెల్లూరు ఆసుపత్రికి డీఎఫ్‌వో వైవీకే షణ్ముఖ కుమార్‌, ఎయిమ్స్‌కు తెలుగు గంగ డిప్యూటీ కలెక్టర్‌ జీవీవీఎస్‌ నాగలక్ష్మి, లోటస్‌కు టీజీపీ డిప్యూటీ కలెక్టర్‌ పీఏ సువర్ణమ్మను నియమించారు.

557 కేసులు

11 మంది మృతి

జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 557 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన జారీ చేసింది. దాంతో కేసుల సంఖ్య 9,899కి పెరిగాయి. ఇంకోవైపు జీజీహెచ్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి 160 మంది డిశ్చార్జి అయినట్లు నోడల్‌ అధికారి నరేంద్ర తెలిపారు. వీరిలో 145 మందికి నెగెటివ్‌ రాగా.. 15 మందిని హోమ్‌ ఐసోలేషన్‌కు పంపినట్లు వివరించారు. నారాయణ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి 30 మంది డిశ్చార్జి అయినట్లు నోడల్‌ అధికారి సుబ్బారావు వెల్లడించారు. దీంతో డిశ్చార్జిల సంఖ్య 3246కు పెరిగింది. ఇక జిల్లాలో మరో 11 మంది కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరిలో కావలికి చెందిన 56 ఏళ్ల మహిళ, గూడూరు మండలం చెన్నూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా.. వైరస్‌ నిర్ధరణ అయింది. జీజీహెచ్‌లో బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు మూలాపేటకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి, హరనాథపురానికి చెందిన 66 ఏళ్ల వ్యక్తి, చిన్నబజారుకు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు, దండువారీవీధికి చెందిన 71 ఏళ్ల వృద్ధుడు, నగరానికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. కొత్తపాళేనికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి జీజీహెచ్‌కు వచ్చి మృతి అక్కడిక్కడే చెందగా, చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్‌కు చెందిన 51 ఏళ్ల వ్యక్తి నారాయణలో చికిత్స పొందుతూ దుర్మరణం చెందారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 139కి చేరింది.

కంటెయిన్‌మెంట్‌ జోన్లు 445

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,899కి చేరుకుంది. దీంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా కేసులు ఎక్కువగా నమోదైన 445 ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా నిర్ధరించారు. ఆయా ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేశారు. ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు బ్లీచింగ్‌, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ, పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. కొండాపురం, కావలి, జలదంకి, కలిగిరి, వరికుంటపాడు, బోగోలు, అల్లూరు, దగదర్తి, దుత్తలూరు, కోవూరు, నెల్లూరు నగరం, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్‌, తోటపల్లి గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు, విడవలూరు, రాపూరు, కొడవలూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, సంగం, సీతారామపురం, ఏఎస్‌పేట, ఉదయగిరి, కలువాయి, వింజమూరు, మర్రిపాడు, చేజర్ల, అనంతసాగరం, ఆత్మకూరు, సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు, కోట, గూడూరు, చిట్టమూరు, సైదాపురం, వెంకటగిరి, చిల్లకూరు, బాలాయపల్లి, డక్కిలి, మల్లాం, వాకాడు తదితర మండలాల్లోని 445 ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా అధికారులు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.