close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కష్టం.. వరుణార్పణం 

 వేరుసెనగ రైతుకు కోలుకోలేని దెబ్బ 

తడిచిన ఓదెలు.. ఆరబెట్టుకునేందుకు అవస్థలు

కాయలు ఆరబెడుతున్న రైతులు
 

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వేరుశెనగ రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికందిన పంట భద్రపరచుకోలేక గగ్గోలు పెడుతున్నారు. నీటిలో తడిచిన ఓదెలను చూస్తూ..కన్నీళ్లు దిగమింగుకుని మిగిలిన పంటను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు తడిచిన కాయలను కొనుగోలు చేసేనాథుడే లేక అన్నదాతల బాధ వర్ణనాతీతం. 
న్యూస్‌టుడే, బిట్రగుంట: కావలి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ప్రధానంగా బోగోలు, దగదర్తి, కావలి గ్రామీణ ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో వేరుసెనగ సాగు చేశారు. బోగోలులో 3500 ఎకరాలు, దగదర్తిలో 3000 ఎకరాలు, కావలి గ్రామీణంలో 1000 ఎకరాల్లో సాగు చేపట్టారు. బోర్లు, బావులు, సోమశిల జలాలు ఆధారంగా నీటి సరఫరా పుష్కలంగా ఉండటంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావించి అన్నదాతలు పది రోజుల నుంచి వేరుసెనగ తీత పనులు చకచకా సాగించారు. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో రైతుల వెన్ను విరిచినట్లైంది. వర్షాలు ఇలాగే కొనసాగితే పంట ఇంటికి వస్తుందా? అన్న సందేహాలతో అయోమయంలో పడిపోయారు.  
నీళ్లల్లో ఓదెలు.. రోడ్లపై కల్లాలు 

అన్నదాతలు వేరుసెనగ పంటను కాపాడుకోలేక నరకం అనుభవిస్తున్నారు. నీళ్లల్లో ఉన్న వేరుశెనగ కాయల ఓదెల్ని మెరకకు చేర్చుకుంటున్నారు. మరికొందరైతే రోడ్ల వెంబడి రాశులు కూర్చి తెరిపి ఉన్న సమయంలో ఆరబెట్టుకుంటున్నారు. ఆకస్మికంగా వర్షపు జల్లులు వస్తే పట్టలు కప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాశుల్లో ఉన్న వేరుశెనగ కాయల్లో ఆవిరి రావడంతో మొలకలు వస్తాయన్న భయం వారిని వేధిస్తోంది. 
ప్రభుత్వమే కొనాలని వేడుకోలు
ప్రభుత్వం వెంటనే వేరుసెనగ కాయలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చి తమకు అండగా నిలవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఏటా పచ్చికాయలే బస్తాకు కొంత తరుగు తీసుకొని కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈ సారి దళారుల జాడే లేదు. కరోనా ప్రభావంతో ఈ దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి నేటి వరకు భారీ పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకొంటున్నారు. 

​​​​​​​

 నీళ్లల్లో వేరుసెనగ ఓదెలు 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.