close

శుక్రవారం, ఆగస్టు 07, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భయంతో పంపేస్తున్నారు..!

కరోనా సాకుతో నాడీ పట్టని వైద్య సిబ్బంది●

బతుకు జీవుడా అంటూ బాధితులు బిక్కుబిక్కు

వేధిస్తున్న వైద్యుల కొరత

విస్తుగొలుపుతున్న సంఘటనలు

ఆత్మకూరులోని క్యాజువల్‌ వార్డులో గర్భిణి (దాచిన చిత్రం)

న్యూస్‌టుడే, నెల్లూరు(వైద్యం), కోట, ఆత్మకూరు : కరోనా కాలంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎక్కడకు వెళ్లినా.. కరోనాను బూచిగా చూపి వైద్యం చేయడానికి సిబ్బంది ముందుకు రావడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇలాంటి పరిస్థితులు కన్పించడం విస్తుగొలుపుతోంది. ప్రాణదానం చేయాల్సిన వైద్యనారాయణులే ఇలా భయంతో వెనుకంజ వేయడం దారుణమని రోగులు వాపోతున్నారు. మరోగత్యంతరం లేక ‘ప్రైవేటు’ వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ వసతుల లేమి వారిని వెక్కిరిస్తోంది. తలకు గాయమైనా.. తీసేందుకు సిటీ స్కాన్‌ లేదు, హైరిస్క్‌ గర్భిణులు వస్తున్నా.. శస్త్రచికిత్సలు చేసే పరిస్థితులు ఉండటం లేదు. గతిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న ప్రజల జేబులకు చిల్లిపడుతోంది. ఇంత చేసినా ప్రజల ప్రాణాలకు భరోసా ఉండటం లేదు. అక్కడా.. ఇక్కడా తిప్పడంతో ఏదొక సందర్భంలో కరోనా సోకుతోంది. దాంతో పేదల జీవితాలు తల కిందులుగా మారుతున్నాయి.

ఖాళీ పోస్టులతో వైద్యం.. దైన్యం

*● జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలో 16 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో నలుగురు ప్రొఫెసర్లకు గానూ ఏ ఒక్కరూ లేరు. అదేవిధంగా నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎవరూ లేరు. ఇకపోతే 8 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు గానూ ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల అల్లూరు నుంచి ఓ వైద్యురాలిని డిప్యూటేషన్‌ వేసినట్లు తెలుస్తోంది. అసోసియేట్‌ ప్రొఫెసర్లు ముగ్గురు డిప్యూటేషన్‌పై వైజాగ్‌లో పనిచేస్తున్నారు.

*● ప్రస్తుతం జీజీహెచ్‌ను కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడంతో చిన్న పిల్లల ఓపీ సైతం చాలా వరకు తగ్గిపోయింది. కేవలం రోజుకు 20 మంది మాత్రమే వస్తున్నారు. కరోనా భయంతో చాలా వరకు బయట ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ● ఆస్పత్రి మొత్తంగా 43 మంది ప్రొఫెసర్లకు 22 మంది ఉన్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 53 మందికి 40 మంది, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 101 మందికి 76 మంది సేవలందిస్తున్నారు. ఇలా 197 పోస్టులకు 138 పోస్టులు భర్తీ కాగా, 59 వరకు ఖాళీగానే మిగిలిపోయాయి. ● ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో 15 మందికి 14 మంది వైద్యులు ఉన్నారు. ఇద్దరు చిన్న పిల్లల వైద్యులు ఉన్నారు. జిల్లా ఆసుపత్రి కావడంతో మరింత మంది వైద్యుల అవసరముంది. పలుమార్లు అత్యవసర వైద్యానికి నెల్లూరుకు పంపుతున్నారు. ● గూడూరు ఏరియా ఆస్పత్రిలో కేవలం ఒక చిన్న పిల్లల వైద్యుడు మాత్రమే పనిచేస్తున్నారు. దాంతో ఏరియా ఆస్పత్రి పరిధిలో చిన్న పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినా ఆపదలో నెల్లూరుకు రావాల్సిన పరిస్థితి. ● సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరుగురు వైద్యుల వరకు ఉండాల్సి ఉండగా.. చాలా చోట్ల మూడు నుంచి నలుగురు మాత్రమే ఉంటున్నారు. ● కావలి ఏరియా ఆస్పత్రిలో మొత్తం 20 మంది వైద్యుల అవసరం కాగా.. 17 మంది ఉన్నారు. ముగ్గురు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిన్న పిల్లల వైద్యులు మాత్రం ముగ్గురు ఉన్నారు. ఇక్కడ సిటీ స్కాన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో నెల్లూరుకు తరలించాల్సి వస్తోంది.

కోటకు చెందిన శశాంక్‌ అనే మూడేళ్ల అబ్బాయి మిద్దెపై నుంచి ప్రమాదశాత్తు పడిపోయాడు. తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో బాలుడిని కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీరా అక్కడ చిన్న పిల్లల వైద్యుడు లేకపోవడంతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడా వైద్యం అందకపోవడంతో.. హుటాహుటిన చెన్నైకు తరలించారు. దాంతో అక్కడ రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాకాడు మండలం ముట్టెంబాకకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కొద్ది రోజుల కిందట మోటారుసైకిల్‌ వెనక కూర్చొని వెళ్తుండగా ప్రమాదశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వైద్య చికిత్సల నిమిత్తం గూడూరు, నెల్లూరు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఎవరు ఆమెను చేర్చుకోకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందారు. ఇలాంటి సంఘటనలు గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఉన్నాయి.

ఏప్రిల్‌ 4వ తేదీ బోయల చిరువెళ్ల దళితవాడ నుంచి ఎర్రబల్లి లావణ్య అనే గర్భిణి ప్రసవ వేదనతో ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు దగ్గు వస్తుండటంతో వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆమె భర్త కారు డ్రైవర్‌ కావడంతో ఎక్కడెక్కడో తిరుగుతుంటారని ఆమెను కాన్పుల గదిలో కాకుండా క్యాజువాల్టీ వార్డులో (స్త్రీ, పురుషులు కలసి ఉండే గది)కి తరలించారు. చాలా సేపటి వరకు చికిత్స చేయకపోవడంతో గర్భిణి బంధువులు మరో గత్యంతరం లేక స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సులభ కాన్పుతోనే కథ సుఖాంతమైంది.

గత నెల 22వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో డబ్బుగొట్టు ప్రవల్లిక అనే గర్భిణి ప్రసవ వేదనతో వింజమూరు మండలం ఆరేటిపల్లి నుంచి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలివచ్చారు. ఆమెకు కాన్పు చేసేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారు. కాన్పు చేసేది లేదు పొమ్మన్నారు. ఎంతో నిరుపేద అయిన ఆమె.. అర్ధరాత్రి వేళలో డబ్బులకు ఇబ్బందులు పడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. అదృష్టవశాత్తు ప్రైవేట్‌ ఆసుపత్రిలో సుఖ ప్రసవంతో గండం గట్టెక్కింది. దాంతో ఆ బాలింత కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు - చెన్నయ్య, డీసీహెచ్‌

జిల్లాలోని సీహెచ్‌సీ, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని వైద్యుల పోస్టులను సర్దుబాటు చేస్తున్నాం. ఎక్కడా వైద్యుల కొరత రాకుండా చూస్తున్నాం. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

సామాజిక ఆరోగ్య కేంద్రాలు 14

ఏరియా ఆస్పత్రులు 2

జిల్లా ఆస్పత్రి(ఆత్మకూరు) 1

జీజీహెచ్‌ 1

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.