close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

బహిరంగంగా, పారదర్శకంగా లాటరీ ప్రక్రియ
ఈ నెల 8న అట్టహాసంగా ప్రభుత్వ కార్యక్రమం
పట్టాల ముద్రణ పూర్తయి పంపిణీకి సిద్ధం
‘ఈనాడు’తో జిల్లా సంయుక్త కలెక్టర్‌ వినోద్‌కుమార్‌
ఈనాడు, నెల్లూరు

‘‘ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 8వతేదీన రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలోనూ ఆ మేరకు సన్నద్ధమయ్యాం. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా స్థలాలు, లబ్ధిదారులను గుర్తించి సిద్ధం చేశాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ నూరుశాతం స్థలాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భూసమస్యలు తలెత్తిన చోట ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి సిద్ధం చేస్తున్నాం.’’ అని జిల్లా సంయుక్త పాలనాధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. మరో మూడు రోజుల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్లాట్లలో కల్పించిన వసతులపై ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పలు ప్రాంతాల్లో తలెత్తుతున్న నిరసనలు, లాటరీ ప్రక్రియలో ఇబ్బందుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించారు. 
ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
ఈనెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మరో మూడు రోజులే గడువు ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 1,79,887 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఇందులో 46,928 మందికి టిడ్కోలో నిర్మాణం చేపట్టిన ఇళ్లు అందుతాయి. మిగతా 1,32,029 మందికి ఇళ్లస్థలాలు చూపాల్సి ఉంది. గురువారానికి లెక్కల ప్రకారం.. 1,00,626 ప్లాట్లు అన్ని వసతులతో సిద్ధంగా ఉన్నాయి. 88,732 మందికి లాటరీ ప్రక్రియ పూర్తిచేసి జాబితా రూపొందించాం. 25,533 మంది కొత్త లబ్ధిదారులుగా నమోదయ్యారు. 15 రోజుల కిందట వీరందరూ నమోదు చేసుకున్నారు. వీరిలోనూ అర్హులెవరన్న దానిపై అధ్యయనం చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 3455.17 ఎకరాల భూమి ఇళ్లస్థలాల కోసం అవసరం కాగా.. అందులో 2,420.43 ఎకరాల ప్రభుత్వ, 1034.74 ఎకరాల పట్టా భూమిని సేకరించాం. ఇందులో డ్వామా ఆధ్వర్యంలో వసతుల కల్పన జరిగింది.
ప్రత్యామ్నాయ సేకరణ
జిల్లాలో పారదర్శకంగానే భూమి సేకరించాం. ప్రభుత్వ భూమి అయితే బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు స్వాధీనం చేసుకుంటున్నాం. కొన్నిచోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాంటి చోట్ల పంపిణీ కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 44 కేసులకు 117.07 ఎకరాల భూమి ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఇందులో 29 కేసులు స్టే ఆర్డర్‌లో వచ్చాయి. ఈ తరహాలో 78.93 ఎకరాల భూమి ఉంది. 3 కేసులు స్టేటస్‌కో కింద వచ్చాయి. ఈ తరహాలో 9.06 ఎకరాల భూమి ఉంది. వాటిపై న్యాయస్థానంలో స్పష్టత వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’’
మున్ముందూ దరఖాస్తు చేసుకోవచ్చు
లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన లాటరీ ప్రక్రియను బహిరంగంగా, పారదర్శకంగా చేస్తున్నాం. నేనూ ఆత్మకూరు డివిజన్‌లో పాల్గొన్నాను. గ్రామసభల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకవేళ ఎక్కడైనా అనర్హులకు జాబితాలో చోటు దక్కి ఉంటే అధికారుల రీసర్వేలో ఆ పేర్లు తొలగిస్తున్నాం. కలువాయిలో అలా 281 మంది అనర్హులను గుర్తించాం. ఇళ్లస్థలాలకు సంబంధించి పట్టాల ముద్రణ చివరిదశకు చేరుకుంది. కొన్ని ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరాయి. సేల్‌డీడ్‌ కూడా పట్టాలోనే పొందుపరచడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పొచ్చు. తహసీల్దారు సంతకాలు చేసి లబ్ధిదారుల ఫొటోలు తీసుకొని ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా తాను ఆ స్థలం తీసుకోవడానికి సమ్మతించినట్లుగా సమ్మతి పత్రం అందిస్తేనే మంజూరు చేస్తున్నాం. పట్టాల పంపిణీ ఇదే చివరిది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మున్ముందూ గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.