close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హతవిధీ.. నిర్లక్ష్యమిది!

రూ.కోట్లు ఉన్నా.. పనుల్లో కనిపించని ప్రగతి
జిల్లాలోని నగర, పట్టణాల్లో అభివృద్ధి పనులపై క్రీనీడ
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంలో నత్తనడక 
ఈనాడు, నెల్లూరు న్యూస్‌టుడే, నెల్లూరు నగరపాలకసంస్థ


కొత్తూరు ఎస్సీ కాలనీ వద్ద డ్రైనేజీ నిర్మాణం

అభివృద్ధి కోసం మంజూరు చేసిన ఆ నిధులు కొరగాకుండా పోతున్నాయి.. అట్టడుగు ప్రాంతాల అభ్యున్నతిలో భాగంగా కేటాయించిన ఆ సొమ్ములకు చెందిన పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.. ఓ వైపు ఎన్నికల కోడ్, మరోవైపు అనూహ్య కొవిడ్‌ పరిణామాలతో ఇబ్బందికరంగా మారింది.. ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ నత్తనడకను తలపిస్తుండటం సమస్యకు అద్దం పడుతోంది.. నెల్లూరు జిల్లాలోని పుర, నగరపాలికల్లో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంలో ఈ దుస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా భారీగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద నిధులు మంజూరు చేస్తోంది. తద్వారా సీసీరోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నది లక్ష్యం. గతేడాది జిల్లాలోని అనేక పాలికలకు సొమ్ములు ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేయాలన్న ఆదేశాలు వెలువరించారు.
ఇదీ పరిస్థితి
పాలికల్లోని ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం వెచ్చించాల్సిన ఆ నిధులకు కాలగ్రహణం పట్టింది. ప్రారంభంలో అధికారులు త్వరితగతిన పనులు చేపట్టకపోవడంతో సమస్య ఏర్పడింది. నిధులు మంజూరైన నెలల తర్వాత పనులు కేటాయించగా.. అవి ప్రారంభమయ్యేలోపే స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సమస్య నెలకొంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినంతనే ఈ పనులు నిలిపేశారు. కొన్నిచోట్ల టెండర్ల దశలోనే ఆగిపోగా.. మరికొన్నిచోట్ల కొంతమేర జరిగి స్తబ్ధుగా మారాయి. ఒక్క నెల్లూరు నగరపాలక సంస్థలోనే పరిస్థితి చూస్తే విస్మయం కలగకమానదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల మేర ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రాగా.. అనేక పనులు చేపట్టారు. ఇప్పటికీ ఆ పనులు చేసిన గుత్తేదార్లకు రూ.77 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.కోటి మాత్రమే మంజూరు కాగా.. ఆ నిధులతో చేపట్టిన పనులు ప్రారంభంలోనే నత్తనడకను తలపిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి పూర్తికాకపోవడం గమనార్హం. వాస్తవానికి మార్చి నెలాఖరుకు పూర్తికావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్, అనంతరం కొవిడ్‌ పరిణామాలతో అసంపూర్తిగా మారాయి.
అక్కడా అంతే
ఒక్క నెల్లూరు నగరపాలక సంస్థలోనే కాదు.. జిల్లాలోని మిగతా పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సూళ్లూరుపేటలో గత ఆర్థిక సంవత్సరానికి రూ.3.85 కోట్లు మంజూరైంది. ఇక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. మరో రూ.15 కోట్ల పనులు టెండర్ల స్థాయిలోనే రద్దయ్యాయి. గూడూరులో రూ.4 కోట్లు రాగా.. పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి. వెంకటగిరిలో రూ.2.15 కోట్లు రాగా.. 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మిగతావి కొవిడ్‌ కారణంగా ఆగిపోయాయి. ఆత్మకూరులో రూ.కోటి రాగా.. ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. చివరకు కావలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడా రూ.కోటి మంజూరు కాగా.. 50 శాతం మేర మాత్రమే ఖర్చయ్యాయి. నెల్లూరు నగరంలో 14వ ఆర్థిక సంఘం నిధుల పరంగానూ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల కోడ్, కొవిడ్‌ పరిణామాలతో అట్టడుగు ప్రాంతాల అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకోవడం కీలకమైంది. ఈ విషయమై నెల్లూరు నగరపాలకసంస్థ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ సంజయ్‌తో ‘ఈనాడు’ మాట్లాడగా.. కొవిడ్‌ పరిణామాల అనంతరం ఇసుక దొరక్కపోవడం, కూలీల కొరత.. ఇలా అనేక కారణాలతో పనులు నెమ్మదించినట్లు చెప్పారు. ప్రస్తుతం సడలింపుల నేపథ్యంలో వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.