close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

పెడచెవి నిజమే!

సీఎంఆర్‌ బకాయిలు చెల్లించని మిల్లర్లు ఖరీఫ్‌ ధాన్యం సేకరణకూ ఇవ్వని

బ్యాంకు గ్యారెంటీలు తనిఖీ బృందాల ఏర్పాటు

మొదటి దశలో నెల్లూరు, నాయుడుపేట, కావలిలో మిల్లులపై దాడులు


ఈనెల 9వ తేదీన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : జిల్లాలో కొందరు మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)లో భాగంగా తీసుకున్న ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు చుక్కలు చూపిస్తున్నారు. అదేమని అడిగితే ‘అదిగో.. ఇదిగో’ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా రూ.79.07 కోట్ల విలువైన సరకుకు సంబంధించిన బకాయిలు వారివద్ద ఉండిపోయాయి. ఈ బకాయిల వ్యవహారాన్ని ‘ఈనాడు’లో ఈనెల 9వ తేదీన ‘మొండి.. బకాయి దండి’ కథనంతో వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీంతో జిల్లా అధికారులు స్పందించారు. 2014 నుంచి 2019-20 వరకు లెక్కలు తీశారు. పౌరసరఫరాల సంస్థకు ఎవరెంత బకాయి ఉన్నారు? వారిలో ఎవరెవరిపై క్రిమినల్‌ కేసులున్నాయి? డిఫాల్టర్స్‌ ఎంత మంది ఉన్నారు? తదితర వివరాలు సేకరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కూ బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకుండా, రైతుల నుంచి దొడ్డిదారిన ధాన్యం సేకరిస్తున్నవారిని గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాలమేరకు జేసీ వినోద్‌కుమార్‌ పర్యవేక్షణలో ఆరు శాఖలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరు నగరం, కావలి, నాయుడుపేటల్లో మూడు రైస్‌మిల్లులపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

● ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ నెల మొదటి నుంచే కోతలు మొదలయ్యాయి. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలూ ఇవ్వకుండా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యాన్ని సేకరించేందుకు మిల్లర్లు కొందరు ఇంకా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వలేదు. కలెక్టర్‌ శేషగిరిబాబు, జేసీ వినోద్‌కుమార్‌, పౌరసరఫరాలశాఖ, సంస్థ అధికారులు అనేకసార్లు వారితో సమావేశాలు ఏర్పాటుచేసి బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలని కోరారు. కొందరు మాత్రం అందజేశారు. ఇంకొందరిలో మాత్రం స్పందన లేదు. ప్రస్తుతం ధాన్యం అత్యధికంగా కల్లాల్లో నుంచి కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. ఇంకా కొందరు కాలయాపన చేస్తుండటంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో సీఎంఆర్‌ రైస్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సిన(డిఫాల్టర్‌లు) మిల్లర్ల రైస్‌ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు, దాడులకు సిద్ధమయ్యారు.

పౌరసరఫరాలు, విజిలెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో..

పౌరసరఫరాలశాఖ , సంస్థ, అగ్నిమాపకశాఖ, విద్యుత్తు, కాలుష్య నియంత్రణ శాఖ, వాణిజ్య పన్నుల శాఖాధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు మొదటి దశలో భాగంగా మంగళవారం నెల్లూరు నగరం, నాయుడుపేట, కావలిలోని మూడు మిల్లులపై ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించారు. రికార్డులు, పత్రాలు, స్టాకును తనిఖీ చేశారు. వాటిల్లో అన్నీ లోపభూయిష్టంగా, రికార్డులు లేని బియ్యం బస్తాలు, ధాన్యం బస్తాలు టన్నుల కొద్దీ ఉన్నట్లు బహిర్గతమైంది. ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులు, బిల్లులు, లైసెన్సులు కూడా వారి వద్ద లేకపోవడంతో అధికారులు కూడా వారికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించారు. వారిపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని, అందుకు బుధవారం ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్‌ కార్యాలయంలోని జేసీ ఛాంబర్‌లో జేసీ వినోద్‌కుమార్‌ ఎదుట హాజరుకావాలని ఆయా అధికారులు సంబంధిత మిల్లుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వారి ఆకస్మిక తనిఖీలకు సంబంధించి మంగళవార రాత్రి జేసీకి వేరు వేరుగా నివేదికలు తయారుచేసి సమర్పించినట్లు సమాచారం.

సౌభాగ్యలక్ష్మి రైస్‌మిల్లుపై ఆకస్మిక తనిఖీ

నెల్లూరు నగరం, గ్రామీణ మండల పరిధిలో రైస్‌మిల్లులపై తనిఖీలు, దాడులకు సివిల్‌ సప్ల్లయిస్‌ విజిలెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఐదు శాఖలకు సంబంధించిన బృంద సభ్యులను జేసీ వినోద్‌కుమార్‌ ఏర్పాటు చేశారు. వారిలో కాలుష్య నియంత్రణ అధికారి, అగ్నిమాపకశాఖ అధికారి, విద్యుత్తుశాఖ ఈఈ, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి, అసిస్టెంట్‌ సివిల్‌ సప్లయిస్‌ అధికారి, సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసీల్దారు, ఫుడ్‌ ఇన్‌స్పె క్టర్‌ తదితరులున్నారు. నెల్లూరు నగర పరిధిలోని మూడోమైలు ప్రాంతంలో ఉన్న సౌభాగ్యలక్ష్మి రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించారు. యజమాని, అకౌంటెంట్‌ ఎవరూ అందుబాటులో లేరు. రఘు అనే క్లర్క్‌ మాత్రమే అక్కడ ఉన్నారు. ధాన్యం రైతుల నుంచి డి-రిజిస్టర్‌ (వే బిల్లులు, రైతుల నుంచి ఎంతకు కొనుగోలుకు సంబంధించిన ఆధారాల నమోదు రిజిస్టర్‌) వివరాలు అడిగారు. అలాంటివి ఏవీ లేవు.. తమ ఆడిటర్‌ బాలసుబ్రహ్మణ్యం వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ రిజిస్టర్‌ మిల్లులోనే ఉండాలని, ఆడిటర్‌ వద్ద ఉండకూడదు కదా అని డిప్యూటీ కలెక్టర్‌ ఆ క్లర్క్‌ని ప్రశ్నిస్తే.. ఎలాంటి సమాధానం రాలేదు. మిల్లులో తనిఖీలు చేస్తే.. సదరు మిల్లరు రైతుల నుంచి కొనుగోలుచేసి మర ఆడించిన 2,500 బియ్యం బస్తాల(25 కేజీలు)ను గుర్తించారు. వాటికి సంబంధించిన రికార్డులు లేవు. ధాన్యం కూడా మిల్లు పరిధిలోని రెండు గోదాముల్లో 1,100 మెట్రిక్‌ టన్నులు స్టాక్‌ చేసుకొని ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన వివరాలూ లేవు. దీంతో ఆ అధికారి నోటీసు జారీ చేశారు. అలాగే.. పొల్యూషన్‌కు సంబంధించి అక్కడ ఎటువంటి సర్టిఫికెట్‌లు తీసుకోలేదని గుర్తించారు. ఫైర్‌ సేఫ్టీ పరికరాలు, సర్టిఫికెట్‌లు కూడా అక్కడ లేవు. మిగతా శాఖాధికారులు సైతం వారికి సంబంధించిన అనుమతులు లేకపోవడంతో వారూ నివేదికలు సిద్ధం చేసి జేసీకి అందజేశారు.

గోదాములో ధాన్యం బస్తాలను పరిశీలిస్తున్న అధికారులు

నెల్లూరు : మూడో మైలులోని రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.