close

బుధవారం, ఫిబ్రవరి 19, 2020

ప్రధానాంశాలు

గ్రామసభలు మమ

ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్వహణ

పింఛనుదారుల గుర్తింపులో నిర్లక్ష్యం

న్యూస్‌టుడే, సూళ్లూరుపేట

దామానెల్లూరు గ్రామసభలో అరకొరగా పాల్గొన్న గ్రామస్థులు

పింఛన్ల ఏరివేతకు ఇటీవల వివిధ సర్వేల ద్వారా అనర్హులను గుర్తించారు. వారి నుంచి అభ్యంతరాల స్వీకరణకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. కానీ వీటిపై ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు సవరణ చేయించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వృద్ధాప్య, వితంతు, వికలాంగత్వం తదితర పింఛన్లు పలుచోట్ల అనర్హులు పొందుతున్నారని తెలుసుకుని సర్వే చేపట్టింది. ఈ సర్వే పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ఆధ్వర్యాన చేపట్టారు. వీరు ఇళ్ల వద్ద కూర్చొని ఇష్టానుసారంగా చేశారన్న అభియోగాలు లేకపోలేదు. సర్వే వివరాలను ఆయా పంచాయతీలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులకు పంపారు. నవశకం సర్వేలో భాగంగా వివిధ కోణాల్లో పింఛను పొందుతున్న పలువురిని అనర్హులుగా గుర్తించి బహిరంగ విచారణ జరిపి, వాస్తవాలను గ్రామస్థులకు వివరించి, అభ్యంతరాలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాలోని 46 మండలాల పరిధిలో 940 పంచాయతీలు ఉన్నాయి. 23వ తేదీ గ్రామాల్లో పింఛన్ల అర్హులు, అనర్హుల జాబితాలు ప్రదర్శించారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు 28వ తేదీ సభలు పెట్టాలని అప్పట్లోనే ఆదేశాలు వచ్చాయి. కానీ అధికారులు అలసత్వం వహించారు. సమాచారం లేకుండా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తూతూమంత్రంగా నిర్వహించారు. కొన్ని చోట్ల గ్రామస్థులకే సభలు జరుగుతున్న విషయం తెలియదు. సూళ్లూరుపేట మండలంలోని దామానెల్లూరులో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులకు సమాచారం లేదు. దీంతో సభకు కేవలం 15 మంది లోపు హాజరయ్యారు. అలాగే ఆబాక పంచాయతీలోనూ గ్రామసభపై ఎలాంటి సమాచారం గ్రామస్థులకు రాలేదు. తీరా మధ్యాహ్నం పలువురు గ్రామసభ నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లేసరికి అప్పటికే అధికారులు పత్తా లేకుండాపోయారు. గూడూరు, చిల్లకూరు, పెళ్లకూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

నిర్వహణ ఇలా..

గ్రామసభలపై ముందుగా గ్రామస్థులకు సమాచారం ఇవ్వాలి. ముందురోజు ఎక్కడ సభ నిర్వహిస్తున్నారో తెలుపుతూ దండోరా వేయించాలి. అలాగే పంచాయతీలో స్థానికులకు అందుబాటులో మూడు చోట్ల వీటిని నిర్వహించాలి. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కాలేదు.

వాలంటీర్లకే ఆలస్యంగా సమాచారం

పంచాయతీల పరిధిలో గ్రామసభల నిర్వహణపై వాలంటీర్లకు ముందస్తుగా పంచాయతీ కార్యదర్శులు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే వాలంటీర్లకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చరవాణుల్లో సభలపై సందేశం పంపినట్లు ‘న్యూస్‌టుడే’ పరిశీలనలో వెల్లడైంది. అలాగే పలు పంచాయతీల్లోని వాలంటీర్లకు మంగళవారం ఉదయం కార్యదర్శులు ఫోన్‌ చేసి, గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అనర్హుల గుర్తింపునకు నిబంధనలు

పింఛను పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. పింఛను లబ్ధిదారుడికి మూడు ఎకరాల మాగాణి, ఏడెకరాల మెట్ట భూమికి మించి ఉండకూడదు. రెండూ కలిపితే 10 ఎకరాలు పైబడి ఉండకూడదు. అలా ఉంటే అనర్హులవుతారు. దీని ప్రకారం 10 ఎకరాలకు పైబడిన వారు పింఛను పొందేందుకు అనర్హులు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఆదాయ పన్ను చెల్లింపుదారు కారాదు. విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రామసభలను నిర్వహించి, అనర్హులను గుర్తించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.