close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భక్తిశ్రద్ధలతో గొబ్బెమ్మ ఓలలాడింపు వేడుక  

తమ ఇళ్లలో పూజలందుకొన్న గొబ్బెమ్మలతో మహిళలు

 

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే : సంక్రాంతి పండుగ సందర్భంగా పెన్నాతీరంలో జరుపుకొనే ఆధ్యాత్మిక సంబరం.. భక్తజన ఆనందాలకు వేదికగా నిలిచింది. విద్యుద్దీప కాంతులనడుమ కళకళలాడిన పెన్నాతీరంలో శనివారం జరిగిన గొబ్బెమ్మ ఓలలాడింపు వేడుకకు భక్తజనం తరలివచ్చారు. సంక్రాంతి సందర్భంగా గొబ్బి గౌరమ్మకు పూజలు నిర్వహించి పెన్నానదిలో నిమజ్జనం చేసేందుకు వచ్చిన భక్తులతో పెన్నాతీరం సందడిగా మారింది. వేడుక అనంతరం భక్తులు కుటుంబసమేతంగా పెన్నాతీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. మహిళలు చేసిన కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన భక్తులు దర్శించుకునేందుకు వీలుగా జిల్లాలోని పలు దేవస్థానాల నుంచి ఉత్సవమూర్తులు పెన్నాతీరంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై విశేష అలంకారాల్లో కొలువుదీరి దర్శనమిచ్చారు. రంగనాయకులపేట నుంచి శ్రీ రంగనాథుడు, జొన్నవాడ నుంచి కామాక్షమ్మవారు, దర్గామిట్ట నుంచి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు, నర్రవాడ పేరంటాళ్లమ్మ, నరసింహకొండ నుంచి నరసింహస్వామి, మూలాపేట నుంచి గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి, భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వరుడు, శ్రీ కృష్ణ ధర్మరాజస్వామి, శ్రీ ముత్యాలమ్మవారు భక్తులకు కమనీయంగా దర్శనమిచ్చారు. దీపాలు వెలిగించిన బెలూన్లను వైకాపా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌ ఎగురవేసి పిల్లలకు గాలిపటాలను పంపిణీ చేశారు. దేవదాయశాఖ ఏసీ వేగూరు రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో దేవస్థానాల ఈవోలు, ధర్మకర్తల మండలి సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. పాల్గొన్న భక్తులకు దేవాదాయశాఖ, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాలను, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. నగర డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలోని కాళంగి నది తీరాన రెండు రోజులపాటు నిర్వహించిన ఏటి పండగ శనివారం రాత్రి ముగిసింది. మొదటి రోజు అమ్మవార్లను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శనివారం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పిల్లల నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, మిమిక్రీ, పాటకచ్చేరి, తదితర కార్యక్రమాలు జరిగాయి. రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డితోపాటు, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన ఏటి పండగ

నాయుడుపేట: పట్టణ సమీపంలోని స్వర్ణముఖి తీరంలో జరుగుతున్న ఏటి పండగ శనివారం ముగిసింది. ఉత్సవాలకు పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. పిల్లాపాపలతో వచ్చి ఆటపాటలతో సరదాగా గడిపారు. మహిళలు గొబ్బెమ్మలను నదిలో నిమజ్జనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సినీ గాయని మాళవిక ఆలపించిన పాటలు మైమరిపించాయి.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.