close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

పుర ఎన్నికలకు సన్నద్ధం

కులాల వారీగా ఓటర్ల గణన


సూళ్లూరుపేట పురపాలికలోని 25 వార్డులు తెలిపే పటం

న్యూస్‌టుడే, సూళ్లూరుపేట: పురపాలిక ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధమయ్యారు. కులాల వారీగా ఓటర్ల గణన చేసి, ఈ నెల 21 నాటికి ముసాయిదాను ప్రకటించనున్నారు. ఆ తరువాత రిజర్వేషన్ల పక్రియ, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన చేసి, ఏ వార్డుల్లో వారికి అక్కడే ఓటరుగా ఉండే పక్రియను పురపాలిక సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పనుల్లో సిబ్బంది తీరిక లేకుండా ఉన్నారు.

సూళ్లూరుపేట పురపాలిక స్వరూపం మారింది. ఈమేరకు వార్డుల విభజనను అధికారులు పూర్తిచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో పురపాలిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినా నిర్వహించేందుకు సిబ్బంది పక్రియ అంతా సిద్ధం చేస్తున్నారు. గతంలో సూళ్లూరుపేట పురపాలక సంఘంలో 23 వార్డులు ఉండేవి. నేడు వాటి సంఖ్య 25కి చేరింది. మండలంలోని డేగళపాలెం, నూకలపాళెం గ్రామాలు పురపాలక సంఘంలో విలీనం కావడంతో రెండు వార్డులు పెరిగాయి.

ఓటర్లు పరిశీలిస్తే..

పురపాలక సంఘంలో గత ఏడాది డిసెంబరు 23వ తేదీ నాటికి 33,504 మంది ఓటర్లు ఉన్నారు. వీటికి అదనంగా డేగలపాళెం నుంచి 1026, నూకలపాళెం నుంచి 386 ఓట్లు కలిశాయి. దీంతో ఓటర్ల సంఖ్య 34,916కు చేరింది. ఈ మేరకు వార్డులు విభజన చేశారు. గత ఎన్నికలకు మొదటి వార్డు కోళ్లమిట్ట నుంచి ప్రారంభమైంది. నేడు ఇందుకు భిన్నంగా కొత్తగా పురపాలికలో విలీనమైన డేగలపాళెం నుంచి మొదటి వార్డు ప్రారంభమవుతోంది. అలాగే మన్నారుపోలూరులో గతంలో 18, 19, 20, 21 వార్డులు ఉండేవి. కొత్త గ్రామాల చేరికతో ఈ వార్డుల్లో మార్పులు రానున్నాయి. దీంతోపాటు ఇక్కడ అదనంగా మరో వార్డు వచ్చే అవకాశం లేకపోలేదు. సూళ్లూరుపేట పురపాలక సంఘంలో గతంలోని వార్డులకు నేడు విభజన చేసిన వార్డులకు పూర్తిగా తేడాలు కనిపిస్తున్నాయి.

1397 ఓటర్లతో వార్డు

సూళ్లూరుపేటలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం 34,916 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 1257 నుంచి 1537 మంది ఓటర్లతో ఒక్కో వార్డు విభజన చేయాలి. ఈ పద్ధతి ప్రకారం సూళ్లూరుపేటలోని 34,916 ఓటర్లకు 25 వార్డులు ఏర్పాటు కానున్నాయి. అంటే 1,397 మందికి ఒక వార్డు చొప్పున విభజించారు. ఈమేరకు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారు. అదే తరహాలో వార్డుల వారీగా కులాల వారీగా ఓటర్లను లెక్కించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ పని చురుగ్గా జరిగే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు ఇలా..

పురపాలక సంఘంలో ఓటర్ల సంఖ్య 34,916 ఉంది. దీని ప్రకారం 25 వార్డులను విభజించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గతంలోనే స్థానిక సంస్థల్లో సగం సీట్లు మహిళలకు రిజర్వు చేశారు. సూళ్లూరుపేటలో 25 వార్డులు ఉన్నాయి. ఇందులో 13 వార్డులు మహిళామణులకు రిజర్వు చేయనున్నారు. మిగిలిన 12 వార్డులు జనరల్‌ కింద చూపనున్నారు. గతంలో పురపాలక సంఘాల్లో 50 శాతం లోపే రిజర్వేషన్లు చేశారు. ఆ మేరకు సూళ్లూరుపేట పురపాలక సంఘంలో రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.