close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

అంతా గమ్మత్తే!..

జిల్లాలో భారీగా గుట్కా వ్యాపారం

రెండు రోజుల్లో రూ.14లక్షల సరకు సీజ్‌

సీసీఎస్‌ పోలీసులు సీజ్‌ చేసిన పొగాకు నిషేధిత ఉత్పత్తులు

గురువారం సీసీఎస్‌ పోలీసులు పొగాకు నిషేధిత ఉత్పత్తులను నెల్లూరులో దిగుమతి చేస్తుండగా పట్టుకున్నారు. గుట్కా, ఖైనీ, జర్దా లాంటి ఉత్పత్తులు ఉన్నాయి. వీటిని బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో తెప్పిస్తున్నారు. వీటి విలువ రూ.7.32లక్షలు.

శుక్రవారం గూడూరులో ఒక వ్యక్తి ఇంట్లోనే గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అతని ద్వారా సేకరించిన సమాచారంతో మరో ముగ్గురి వద్ద పొగాకు నిషేధిత ఉత్పత్తులను గుర్తించారు. మొత్తం రూ.7లక్షల విలువైన సరుకును సీజ్‌ చేశారు.

జిల్లాకు నిత్యం బెంగళూరు నుంచి గుట్కా సరుకు దిగుమతి అవుతూనే ఉంది. ట్రావెల్స్‌, ఆర్టీసీ బస్సులు, లారీలు, ప్రత్యేక వాహనాల్లో రూ.లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు వస్తూనే ఉన్నాయి. జిల్లాలో వ్యాపారాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. న్యూస్‌టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు)

న్యూస్‌టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు) : జిల్లాలో మరోసారి గుట్కా గుప్పుమంది.. ఇప్పటి వరకు జిల్లాలో పొగాకు నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు లేవంటున్న పోలీసులు.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ.14లక్షల విలువైన సరుకును సీజ్‌ చేశారు. దీన్ని బట్టి జిల్లాలో దీని వ్యాపారం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న వారంతా చిన్నపాటి వ్యాపారస్తులే. గుట్కా భాషలో వీరిని ఏజెంట్లుగా పిలుస్తారు. ప్రధాన సూత్రధారులు మాత్రం తెర వెనక ఉండి చక్రం తిప్పుతుంటారు. వారెవరనేది పోలీసులకు కూడా తెలుసు. జిల్లాలో గుట్కా వ్యాపారం రూ.లక్షల్లో కాదు.. రూ.కోట్లలోనే. నెల్లూరు నగరం కేంద్రంగా సాగుతున్న ఈ వ్యాపారం.. ఎంతో మంది ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది.

నిత్యం రవాణా.. కావలి నుంచి తడ వరకు జాతీయ రహదారి.. తమిళనాడు రాష్ట్రం పక్కనే ఉన్న జిల్లా.. ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు.. ఇవన్నీ అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. నిత్యం జిల్లా మీదుగా గుట్కా రవాణా జరుగుతున్నా.. నిఘా మాత్రం నిస్తేజంగా ఉంది. గతంలో వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద గుట్కాకు సంబంధించిన ముడి సరుకును భారీ ఎత్తున విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. రూ.కోట్ల విలువ ఉండే ఆ ముడి సరుకు.. ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుందని నాడు అధికారులు దర్యాప్తు చేస్తామని చెప్పారు. కానీ నేటికి దాని ఊసే లేదు. దాంతో పాటు జీ, హాయ్‌, ఎండీఎం తదితర రకరకాలుగా ఉండే ఈ గుట్కాలకు ఒక్కొక్క దానికి ఒకరు లీడ్‌ చేస్తుంటారు. వీరంతా గుంటూరు, విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచే కథ నడుపుతుంటారు.

రూ.కోట్ల పడగలెత్తిన అక్రమార్కులు

పోలీసుల నామమాత్రపు తనిఖీలు, దాడులతో అసలు పాత్రధారులు, సూత్రధారులు మాత్రం రూ.కోట్లు సంపాదిస్తున్నారు. జిల్లాలో నెలకు రూ.20కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు గుట్కా వ్యాపారం జరుగుతుందంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అప్పుడప్పుడు పోలీసుల దాడులతో గుట్కా ధరలు రెట్టింపు చేసి మార్కెట్‌లో డిమాండ్‌ పెంచేస్తున్నారు. ఇలా వీరి వ్యాపారం జోరుగా సాగుతోంది. అసలు సూత్రధారి ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేయడం లేదు. అవి తయారుచేసే ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం లేదు. దీంతో వారంతా రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న సరుకును కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఇలా నియోజకవర్గాల వారిగా ఒక్కో ఏజెంట్లను నియమించుకొని సరఫరా చేస్తున్నారు.

బడా బాబులేరీ..? అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేసి పట్టుకునేవారంతా చిన్న వ్యాపారస్తులే. బడా బాబులు మాత్రం తెర వెనక ఉండి కథ నడిపిస్తున్నారు. వారిని మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. కనీసం విచారించేందుకు కూడా ఆహ్వానించడం లేదు. దీన్ని బట్టి వారి పలుకుబడి ఎక్కడ నుంచి ఉందో తెలుస్తోంది. కేవలం బడ్డికొట్టు, ఏజెంట్లనే అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రధాన పాత్రధారులను మాత్రం చూసీచూడినట్లుగా వ్యవహరించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. జాతీయ రహదారిపై ఉండే పోలీసు స్టేషన్లలో భారీగా ముడుపులు అందుతున్నాయనేది ప్రచారం జరుగుతోంది. అందుకే నిత్యం రవాణా జరుగుతున్నా.. సరుకు మాత్రం దాని గమ్యం చేరిపోతుంది. నగరంలో ఉండే కీలకమైన వ్యక్తులను చిన్నబజారు పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు మరికొంత మంది ఉన్నారు. వారు మాత్రం దర్జాగా మూడు గుట్కా ప్యాకెట్లు.. ఆరు ఖైనీ ప్యాకెట్లు మాదిరి వ్యాపారం చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటే జిల్లాలో గుట్కా మాఫియా ఉండకపోవచ్ఛు

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.