close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ధాన్యపు సిరి.. భరోసా ఊపిరి!

జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

అధికారుల చర్యలు

ఈనాడు, నెల్లూరు : ధాన్యపుసిరికి భరోసా ఊపిరిలూదే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో రెండునెలల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిపేలా ఇప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభించారు. అధికారవర్గాల్లో హడావుడి నెలకొంది. దిగుబడిపై అంచనాలు సిద్ధం చేశారు. ప్రత్యేక సమావేశాల ద్వారా సంసిద్ధమవుతుండటం కనిపిస్తోంది. వరిసాగుకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. భారత ధాన్యాగారంగా గుర్తింపు పొందిన ఇక్కడ 68శాతం మంది దీనిపైనే ఆధారపడ్డారు. నాలుగేళ్లుగా వరుస కరవు కాటకాలతో రైతులకు ఇబ్బందులే మిగిలాయి. జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటిపోవడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. ఓ దశలో పెట్టిన పంటలు ఎండిపోవడంతో ఆర్థికంగానూ నష్టపోయారు. అయితే, ఈ ఏడాది పరిస్థితులు మారాయి.ఎక్కువ మొత్తంలో వరి నాట్లకు దిగారు. తొలుత విత్తనాలకు సమస్య ఏర్పడగా.. ప్రధానంగా ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకానికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. సమస్యలను అధిగమిస్తూ సాగుకు సన్నద్ధమయ్యారు.

ఇదీ పరిస్థితి.. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల పరిధిలో వరినాట్లు పూర్తికాగా.. మరికొన్ని చోట్ల ముమ్మరంగా జరుగుతున్నాయి. వేసిన పంట ఫిబ్రవరి చివరి వారంలో కోతకు వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు రైతులకు ధాన్యం అమ్మకాలకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో పక్షం రోజుల క్రితమే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. తాజాగా మరో సమావేశం జరగ్గా.. ఈ నెల 18వ తేదీన రైతుసంఘాలు, రైతులు, అధికారులతో మరోమారు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాలుకు రూ.1835, కామన్‌ రకానికి రూ.1815 లెక్కన చెల్లించేలా ప్రయత్నం జరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతేడాది 106 మాత్రమే నెలకొల్పినట్లు అధికారుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

పక్కాగా ప్రక్రియ.. వరిసాగు చేసిన రైతుల కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. ఇక్కడ డ్వాక్రా, పౌరసరఫరాలు, సహకారశాఖల సమన్వయంతో వీటిని నెలకొల్పనున్నారు. అయితే, పంట పెట్టిన రైతులు ఈ-పంటలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉండగా.. 17శాతం తేమ ధాన్యంలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందన్నది సూచన. ఫిబ్రవరి చివరివారంలో పంట చేతికొచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తుండగా, మార్చి-ఏప్రిల్‌ మధ్యన ముమ్మరంగా కోతలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆ మేరకు కోతలకు పదిరోజుల ముందు నుంచే కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా సన్నద్ధమవుతున్నారు. ప్రతి బుధవారం ప్రొక్యూర్‌మెంట్‌ సమావేశాన్నీ నిర్వహిస్తున్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలకృష్ణారావుతో ‘ఈనాడు’ మాట్లాడగా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. జిల్లా ఉన్నతాధికారుల నేతృత్వంలో ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ఆరంభమైనట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.