close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ఉల్లి విక్రయాలకు విరామం!

వ్యాపారుల అరుదైన నిర్ణయం


ఆత్మకూరులోని ఓ వ్యాపారి వద్ద ఉల్లి సరకు

న్యూస్‌టుడే, ఆత్మకూరు గ్రామీణం : నిత్యావసర సరకుల మార్కెట్లో ముందెన్నడూ లేని రీతిలో ఉల్లి ధర పెరిగిపోయింది. వీటిని కూరల్లో సైతం ఆచితూచి వినియోగిస్తున్నారు మహిళలు. దాంతో వీటి కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ధరలతో చాలా మంది వ్యాపారులు వీటి విక్రయాన్ని పూర్తిగా నిలిపేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అక్కడక్కడా అందుబాటులో ఉన్న ఉల్లిపాయల ధరలు టోకున కిలో రూ.140, చిల్లరగా రూ.150 నుంచి రూ.170 వరకు పలుకుతున్నాయి. అయితే వీటి విక్రయాలకు విముఖత చూపడం వెనక సహేతుక కారణాలే స్పష్టమవుతున్నాయి. ధరలు పెరిగిన తరుణంలో వ్యాపారులు తమ ఆధీనంలో నిల్వ ఉన్న సరకును అనుసరించి ఎంతోకొంతైనా ఆదాయం పొందడం పరిపాటి. ఆ సరకు అంతా విక్రయాలు జరిగి మళ్లీ పెరిగిన ధరలకు కొనుగోలు చేయాలంటే చాలామంది ధైర్యం ప్రదర్శించలేకున్నారు. ఒక్కసారిగా తగ్గి ఆ ధరలకే అమ్మకాలు సాగించాల్సి వస్తే నష్టం వస్తుందని భావిస్తున్నారు. ధరల పెరుగుదలతో సరకు కదలిక సన్నగిల్లింది. ఉల్లికి కొన్ని అనివార్య సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. పలు రకాల సరకు పక్షం రోజులకు మించి నిల్వ ఉండదు. ఉల్లిపాయలు సత్వర విక్రయాలకు నోచుకోకుంటే, రోజూ కనీసం పదిశాతం అయినా కుళ్లిపోవడం, వాటిని వృథాగా పారవేయడం జరుగుతుంది. ప్రస్తుత వర్షాలు, మంచుకాలంలో ఉల్లి పొరలు పొరలుగా నల్లబారడం, కుళ్లు అధికంగానే ఉంటాయని వ్యాపారులు వాపోతున్నారు. దాంతో పారబోసే సరకు సంగతి గురించి ప్రస్తావించుకున్నా. వ్యాపారుల్లో నెలకొనే ఆందోళన వర్ణనాతీతం. ఇలా వివిధ కారణాలను సరిపోల్చుకుంటూ దానితో వచ్చే ఆదాయం కన్నా పొంచి ఉన్న నష్టమే అధికమని భావించి విక్రయాలను విరమించుకుంటున్నారు. ఈ నేపథ్యంతో వివిధ రకాల ఉల్లి సరకును అనుసరించి ధర విపరీతంగా పెరగడమే కాకుండా లభ్యత చాలా వరకు తగ్గిపోతుండటం వింతగొలుపుతోంది. కృత్రిమ డిమాండ్‌ వికృతంగా సాగుతోందనే విమర్శలున్నాయి. రోజువారీ వంటింటి ఉల్లి అవసరాల్లో గతంలో మాదిరి నేడు సగటు ప్రజానీకం ఉపయోగించడం లేదు. నగర ప్రాంతాల్లో కొందరికే రైతుబజార్ల ద్వారా రాయితీ ధరలకు ఉల్లిపాయలు దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా.. చిన్నపాటి హోటళ్లు, అల్పాహార విక్రేతలు ధరల పెరుగుదలతో సందిగ్ధంలో పడుతున్నారు. సాంబారు వంటి తయారీల్లో కొద్దిగానైనా ఉల్లిపాయ వినియోగం తప్పనిసరిగా వినియోగిస్తారు. దాంతో ఇక చేసేదేమీ లేక ఎంత ధరైనా కొనుగోలు చేసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ధరలు అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆశగా వేచి చూస్తున్నారు.

అమ్మకాలు తగ్గిపోయాయి:  పి శ్రీనివాసులు, రిటైల్‌ కిరాణా దుకాణం, నెల్లూరుపాళెం

గతంలో రోజూ 30 కిలోల వరకు ఉల్లి విక్రయాలు జరిగేవి. ఇప్పుడు ధరల పెరుగుదలతో పట్టుమని పది కిలోలు కూడా అమ్మడం లేదు. ఒకవేళ అమాంతంగా ధరల తగ్గుదల చోటుచేసుకుంటే మా వద్ద నిల్వ ఉన్న రాశిని అనుసరించి నష్టపోతాం. వర్షాలు, ముసురు వాతావరణంతో దెబ్బతిన్న ఉల్లి సరకు కూడా ఎప్పటికప్పుడు ఎక్కువగానే ఉంటోంది. వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే మేం కూడా కొనుగోలు చేసేందుకు భయపడుతున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.