close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

రైతులకు సహకారం

● ఉమ్మడి జిల్లాలో కొత్తగా 62 సంఘాల ఏర్పాటు

● ఇక వ్యాపార కేంద్రాలుగా, అప్పులిచ్చే బ్యాంకులుగా..

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

ప్రాథమిక సహకార సంఘాలు.. అన్నదాతల పాలిట వరాలు.. పంట రుణాలు అందిస్తున్నాయి.. అవసరమైన ఎరువులూ సరఫరా చేస్తున్నాయి.. ఇక మరింత మెరుగైన సేవలు అందించనున్నాయి.. వ్యాపార కేంద్రాలుగా మారనున్నాయి.. సొంత ఆదాయం పెంచుకోనున్నాయి.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరో 62 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి..

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకిచ్చే రాయితీ పథకాలను ప్రాథమిక సహకార సంఘాల ద్వారానే అమలు చేయాలని ప్రతిపాదించింది. అయితే రైతుల సంఖ్యకు అనుగుణంగా పీఏసీఎస్‌లు లేవు. ఫలితంగా సత్వర సేవలు అందడం లేదు. కొత్త మండలాల్లో ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులకు పంటరుణాలు సరిగా అందడం లేదు. ఈ క్రమంలో సహకార వ్యవస్థలో పెనుమార్పులు చేయాల్సి వచ్చింది. మెరుగైన సేవలను అందించడానికి ప్రతి మండలానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో ఇప్పటి వరకు ఒక్కటి ఉంటే కొత్తగా మరోటి, అలాగే కొత్త మండలాల్లో రెండు సంఘాల్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి మండల కేంద్రంలో తప్పకుండా ఒకటి ఉండేలా చూస్తారు. ఇంకోటి పెద్ద గ్రామం లేదా రైతుల సంఖ్యను బట్టి అనువైన చోట పెడతారు. అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించారు. ఆమోదం కూడా లభించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2003 వరకు 162 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండేవి. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వాటిని తొలగించి పక్కనే ఉన్న సంఘంలో విలీనం చేయాలని వైద్యనాథన్‌ కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు నష్టాల్లో ఉన్న 71 కేంద్రాలను రద్దు చేసి పక్కనే ఉన్న సంఘాల్లో విలీనం చేశారు. ఫలితంగా వాటి సంఖ్య 91కి చేరంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మండలానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం కొత్తగా మరో 62 కొత్త సంఘాలు ఏర్పాటు కానున్నాయి. కొన్ని మండలాల్లో రెండు కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. వాటిని తొలగించరు. రెండు కంటే తక్కువ ఉన్న చోట్ల కొత్తవి ఏర్పాటు చేస్తారు.


● ఇప్పటి వరకు ఉన్న సంఘాలు  మండలాల సంఖ్య


వ్యాపార కేంద్రాలుగా..

సహకార సంఘాలు వ్యాపార కేంద్రాలుగా మారనున్నాయి. మండలంలోని ప్రతి రైతుకు సభ్యత్వం కల్పిస్తారు. గతంలో పంటరుణాలు ఇవ్వడంతో పాటు ఎరువులు సరఫరా చేశాయి. ఇక నుంచి కమర్షియల్‌ బ్యాంకుల మాదిరిగా బంగారాన్ని కుదవ పెట్టుకొని అవసరమైన రుణాలు ఇస్తాయి. వ్యవసాయశాఖ అమలు చేసే ప్రతి రాయితీ పథకం, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు పంపిణీ, విత్తనాల దుకాణాలు ఏర్పాటు చేస్తాయి. పెట్రోలు బంకులు సైతం నిర్వహిస్తాయి. ప్రజల నుంచి డిమాండ్‌ ఉండే వ్యాపారాలను చేసేందుకు సర్కారు అనుమతి ఇచ్చింది. మండల కేంద్రాలు, గ్రామాల్లోని సంఘాలు వ్యాపార కేంద్రాలుగా, రైతులకు అప్పులిచ్చే బ్యాంకులుగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు.

కొత్తగా 806 పదవులు

ప్రస్తుత సంఘాల పాలకవర్గం పదవి కాలం ముగిసి సుమారు 16 నెలలు కావస్తోంది. మూడు సార్లు ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తు వచ్చింది. మూడో సారి గడువు కూడా వచ్చే ఫిబ్రవరితో ముగుస్తుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంఘాలకు సైతం పాత వాటితో కలిపి ఎన్నికల్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈలోగా అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. కొత్త సంఘాల ఏర్పాటుతో రాజకీయ నాయకులకు పండుగే అని చెప్పాలి. మండల స్థాయిలో కొత్త పదవులు అందుబాటులోకి వస్తాయి. ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గంలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌తో పాటు మరో 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ లెక్కన కొత్తగా 806 పదవులు అందుబాటులోకి వస్తున్నాయి.


● కొత్తగా ప్రతిపాదించిన సంఘాలు


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.