close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

మార్పిడి లేకుండా.. ఇష్టారాజ్యంగా..!

కళ్లు గప్ఫి.. తప్పుదోవ పట్టించి..

అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు

అమాయకులను బురిడీ కొట్టిస్తున్న స్థిరాస్తి వ్యాపారులు

నిర్మల్‌, న్యూస్‌టుడే

నిర్మల్‌ పట్టణ శివారులోని సిద్ధాపూర్‌ సమీపంలో కొత్తగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతం పైభాగంలో చెరువు ఉంది. గతంలో ఈ చెరువు నుంచి కాలువ ద్వారా పంట పొలాలకు నీరు సరఫరా అయ్యేవి. ఈ భూములన్నీ ‘రియల్‌’ దెబ్బకు ప్లాట్లుగా మారుతున్నాయి. సాగు కాలువ భూములను కూడా వదలకుండా మొరంతో నింపేసి చదునుచేసి లేఅవుట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ‘పుర’, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా లేఅవుట్లు చేస్తుండటంతో భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. చెరువు నీరు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడనుండటంతో రానున్న రోజుల్లో ఆ ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొవాల్సిందే.

నిర్మల్‌లో కొందరు రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉండటంతో స్థిరాస్తి వ్యాపారులు ఏం చేసినా చెల్లుబాటు అవుతోంది. వ్యవసాయ భూమిలో లేఅవుట్‌ చేయాలంటే నాలా (వ్యవసాయేతర భూమి)గా మార్చుకోవాలి. తర్వాత డీటీపీసీ నుంచి అనుమతులు పొంది లేఅవుట్‌లు వేసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా నిర్మల్‌లో వారు ఆడిందే ఆటగా మారింది. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో నాలా అనుమతులు లేకుండా అక్రమంగా వందల ప్లాట్లు చేస్తూ దర్జాగా విక్రయిస్తున్నారు. అనుమతులు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తూ తమ జేబులు నింపుకొంటున్నా.. సంబంధిత అధికారులు మిన్నకుండిపోతుండటం గమనార్హం.

మంజులాపూర్‌ సమీపంలో వెలసిన లేఅవుట్‌

జిల్లా కేంద్రంలో అనుమతుల్లేకుండా లేఅవుట్లు ఏర్పాటుచేసినట్లు అధికారులు గుర్తించినా.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలా రాంనగర్‌లో 409 నుంచి 414 సర్వేనెంబర్లలో పదెకరాల స్థలంలో లేఅవుట్లు చేశారు. ఆదర్శనగర్‌లో 1394 నుంచి 1403 సర్వేనెంబర్లలో ఆరెకరాలు, 1355, 1393, 1404, 1405 సర్వే నెంబర్లలో 17 ఎకరాలు, వైఎస్సాఆర్‌ కాలనీలో 391, 392, 148, 149 సర్వేనెంబర్లలో 23 ఎకకరాలు, సిద్ధాపూర్‌లో 129 సర్వేనెంబరులో ఎనిమిది ఎకరాలు, ప్రియదర్శినినగర్‌లో 167, 257, 259 సర్వేనెంబర్లలో 12 ఎకరాలు, లంగ్డాపూర్‌లో 331 నుంచి 339, 380, 385 సర్వేనంబర్లలో ఆరు ఎకరాలు, సోఫినగర్‌లో 499 సర్వేనెంబరులో ఎనిమిది ఎకరాలు లేఅవుట్లు చేశారని అధికారులు గుర్తించారు. ఇవేకాకుండా మంజులాపూర్‌, శాంతినగర్‌, విద్యానగర్‌, గాజుల్‌పేట్‌, విశ్వనాథ్‌పేట్‌, గొల్లపేట్‌, కురన్నపేట్‌, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల సమీపంలో, వైఎస్సార్‌నగర్‌, సోఫినగర్‌ ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేసినా.. వీటి జాబితాలు రూపొందించకపోవడం అధికారుల పనితీరును తేటతెల్లం చేస్తోంది.


సిద్ధాపూర్‌ సమీపంలో ఏర్పాటుచేసిన లేఅవుట్‌

అంతా ఇష్టారాజ్యం...

నిర్మల్‌ దినదినాభివృద్ధి చెందుతుండటంతో స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుమతి కోసం పురపాలక సంఘానికి చెల్లించాల్సిన రుసుమును ఎగవేయడంతో పాటు రెవెన్యూశాఖకు చెల్లించాల్సిన నాలా ఎగ్గొడుతున్నారు. భూమి స్వభావాన్ని మార్పిడి చేయకుండానే పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మారుస్తున్నారు. పన్నులు చెల్లించకపోవడం ఆ స్థలాల్లో రహదారులు, మురుగుకాలువలు, విద్యుత్తు, తదితర వసతులేవీ కల్పించడం లేదు. అధికారులు కూడా చూస్తూ ఉండిపోవడంతో అక్రమ లేఅవుట్ల దందా జోరుగా సాగుతోంది. కాలువలు, కుంటలు, గుట్టలు.. ఇలా ఏ ప్రాంతం అందుబాటులోఉన్నా. ఆ స్థలాలను లేఅవుట్‌గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటామని చెబుతున్నా...

అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినా.. అమ్మినా చట్టరీత్యా నేరం. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం. పురపాలక సంఘ కార్యాలయం నుంచి లేఅవుట్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాలి. అనుమతులు వచ్చిన తర్వాతే అందులో ప్లాట్లు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ‘పుర’ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో ముందుకెళ్లడం లేదు. స్థిరాస్తి వ్యాపారులకు రాజకీయ పార్టీల నేతల మద్దతు ఉండటంతో అధికారులు కూడా చూస్తూ ఉండిపోతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.