close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

ఉల్లి.. సెంచరీ కొట్టింది..!

కిలో రూ.100 దాటిన ధర

సామాన్యులపై ఆర్థికభారం

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే:

ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

ఉల్లిచేసిన మేలు తల్లయినా చేయదంటారు. ఆరోగ్యపరంగా ఎన్నో విశిష్టతలను మూటగట్టుకున్న ఉల్లిగడ్డ మరింత ఘాటెక్కింది. సామాన్యులకు అందనంటూ వారిని మరింతగా బెంబేలెత్తిస్తోంది. ఆర్థికంగా అదనపు భారాన్ని మోపుతోంది. దీనికి ప్రధాన కారణం.. ధర పెరుగుదలే. కొద్దిరోజుల క్రితం కిలో రూ.50 వరకు ఉన్న వీటి ధర ప్రస్తుతం రూ.100 వరకు చేరింది. కాస్త పెద్దగా, బాగున్న ఉల్లిగడ్డలు రూ.130 సైతం పలుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఉల్లిధర ఇంతలా ఎప్పుడు పలకలేదని వ్యాపారులు పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఉల్లిగడ్డలు

కాయగూరలతో పోటీపడుతూ..

సాధారణంగా ఎలాంటి వంటకాలైనా అందులో ఉల్లిగడ్డను వినియోగించడం సర్వసాధారణం. భగవత్‌ సేవకై మాలధారణ చేసుకున్న భక్తులు తినే వంటకాలు మినహా, శాకాహారమైనా, మాంసాహారమైనా ఉల్లి ఉండాల్సిందే. అంతటి ఆవశ్యకత ఉన్న ఈ ఉల్లి ఇప్పుడు ధరల పెరుగుదలలో కాయగూరలతో పోటీపడుతోంది. తానేం తక్కువ కాదన్నట్లుగా ఉరుకలెత్తుతోంది. సాధారణంగా ఉల్లిగడ్డలు కిలో రూ. 10 నుంచి లభించేవి. ఆ తర్వాత కాస్త ధర పెరగడంతో రూ. 30 వరకు చేరాయి. అనంతరం కొద్దిరోజుల పాటు రూ. 50 పలికింది. కానీ, గత వారం రోజుల కాలంలో వీటి ధర మరింతగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రూ. 100కి చేరింది. కాస్త పెద్దగా ఉన్నవి రూ. 130 సైతం పలుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత ధర పలకలేదని విక్రేతలు పేర్కొంటున్నారు. గత వర్షాకాలం చివరలో కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగానే ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మల్‌ మార్కెట్‌కు సాధారణంగా మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతం నుంచి ఎక్కువగా ఉల్లిగడ్డలు దిగుమతి అవుతుంటాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. కొత్తగా పంట సాగుచేసినప్పటికీ దిగుబడి ఇంకా రాలేదు. పైపెచ్చు రవాణాపరమైన ఇబ్బందులు సైతం ఏర్పడటంతో డిమాండ్‌కు సరిపడా ఉల్లి మార్కెట్‌లో అందుబాటులో ఉండటం లేదని చెప్తున్నారు. ఈ కారణంగానే ధరలు పెరిగాయంటున్నారు. ప్రస్తుతం సాగవుతున్న పంట దిగుబడి వచ్చేవరకు ధరలు తగ్గకపోవచ్చని, మరింతగా పెరిగే అవకాశమూ లేకపోలేదని విక్రేతలు పేర్కొంటున్నారు. పెరిగిన ధరల కారణంగా గిరాకీలు సైతం తగ్గిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

హోటళ్లలో.. నిలిపేశారు..

హోటళ్లలో భోజనం చేసినా, బిర్యానీ తిన్నా ఉల్లిగడ్డలు, నిమ్మకాయలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ, ఇప్పుడు ఉల్లిగడ్డలు మచ్చుకైనా కనిపించడం లేదు. దాని స్థానంలో దోసకాయ ముక్కలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇదేంటని అడిగితే, ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే సమాధానం చెప్తున్నారు. దాబా హోటళ్లలో భోజనం కన్నాముందే ఉల్లిముక్కలు, మిరపకాయలు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మిర్చిబండీలు, పానీపూరీ బండీల వద్ద సైతం ఉల్లిముక్కలు అంతగా కనిపించడం లేదు.

సామాన్యులపై భారం..

సాధారణంగా కిలోకు 10 వరకు ఉల్లిగడ్డలు వస్తాయి. నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి సగటున కిలో ఉల్లిగడ్డలు వారం రోజుల పాటు వస్తాయి. ఈ లెక్కన కుటుంబానికి ప్రతినెలా ఎంత లేదన్నా కనీసం మూడు నుంచి నాలుగు కిలోల ఉల్లిగడ్డలు అవసరమవుతాయి. ఇదివరకైతే ఇది పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు. కిలోకు రూ. 15 చొప్పున నెలకు రూ. 45 ఖర్ఛు ఒకవేళ కిలో ఉల్లిగడ్డల ధర రూ. 30 ఉంటే, నెలకు రూ. 90 ఖర్చయ్యేది. కానీ, ఇప్పుడు రూ. 100 నుంచి రూ. 130 వరకు ధర పలుకుతోంది. అంటే.. కనీసం రూ. 300 నుంచి రూ. 390 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక కుటుంబానికే నెలకు ఒకటిన్నర రెట్లు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తే ఇక జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజానీకంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుందో ఊహించలేనిది కాదు.

ప్రభుత్వం చొరవ చూపితేనే..

గతంలోనూ ఉల్లిగడ్డల ధరలు ఎక్కువగా పెరిగినపుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటుచేసి తక్కువ ధరలో ఉల్లిగడ్డలు విక్రయించింది. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి చర్యలు చేపడితేనే పెరిగిన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.

కొనాలంటేనే ఆలోచిస్తున్నాం

చక్రపాణి, నిర్మల్‌

ఉల్లిగడ్డల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇదివరకు రూ. 10 నుంచి రూ. 30 లోపు కిలో ఉల్లిగడ్డలు వచ్చేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. కనీసం రూ. 100 చెల్లించాల్సి వస్తోంది. ఇంత ధర పెట్టి కొనుగోలు చేయడం సామాన్యులకు ఇబ్బందికరమైన విషయం. అందుకే, ఉల్లిగడ్డలు కొనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తక్కువ ధరలు ఉల్లిగడ్డలు సరఫరా చేయాలి. లేకపోతే కష్టమే.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.