close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

‘తుక్క’వుతున్నా.. పట్టింపు కరవు...

స్వల్ప మరమ్మతులకు నోచుకోని వైనం

మూలన పడుతున్న రూ.లక్షల విలువైన వాహనాలు..

ఇదీ నిర్మల్‌ బల్దియాలో పరిస్థితి...

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే:


టైరు లేక కార్యాలయం వెనుక భాగంలో ఉంచిన ట్రాక్టర్‌ ట్రేలర్‌

రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడం, ఇష్టారీతిన నిర్వహణ చేపట్టడంతో ఏళ్ల పాటు సేవలందించాల్సినవి కొన్నాళ్లకే మూలనపడుతున్నాయి. కొద్ది పాటి మరమ్మతులకు నోచుకోక మూలనపడి తుక్కుగా మారుతున్నాయి. సంబంధిత బల్దియా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఇలా నిర్మల్‌ పురపాలక సంఘంలో నిర్లక్ష్యంతో పలు వాహనాలు పనికిరాకుండా పోతున్న వైనంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

నిర్మల్‌ పురపాలక సంఘంలో 42 వార్డులుండగా, పారిశుద్ధ్య కార్మికులు 195 మంది ఉన్నారు. నిత్యం 66 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. చెత్త సేకరణ కోసం కార్యాలయం వాహనాలతో పాటు అదనంగా మరో మూడు ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు 180 లీటర్లు, ఆటోలకు 48 లీటర్లు, డీసీఎంకు 300 లీటర్లు, టిప్పర్‌కు 210 లీటర్ల డీజిల్‌ను కేటాయిస్తున్నారు. వాహనాల వినియోగం విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడం, కొద్ది పాటి మరమ్మతులు చేయక విలువైన వాహనాలు కొన్నాళ్లకు మూలనపడే పరిస్థితులు నెలకొన్నాయి.

కొన్నాళ్లకే...

‘పుర’ అధికారులు వాహనాల నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించక ఏళ్ల పాటు నడవాల్సిన వాహనాలు కొన్నాళ్లకే ‘తుక్కు’గా మారుతున్నాయి. పంక్చర్‌ అయిన టైర్లను వెంటనే చేపట్టకపోవడం, కాలం చెల్లిన టైర్ల స్థానంలో కొత్తవి అమర్చకపోవడం, వాహనాల్లో ఏవైనా సమస్యలు ఏర్పడితే వాటిని చేయించకపోవడం వంటి తదితర కారణాలతో అవి మూలనపడుతున్నాయి. వాహనాలు పైకి చూస్తే బాగున్నప్పటికీ.. అవి పనికిరావంటూ పక్కన పెట్టేస్తుండడంతో రూ. లక్షల ప్రజా ధనం వృధా అవుతోంది. వాహనాల వినియోగం, వాటిపై శ్రద్ధ చూపకపోవడం వంటి వాటితో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిని పక్కన పారేసి కొత్తగా మరో ఎనిమిది ఆటోలు, అయిదు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ‘పుర’ అధికారులు వాహనాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. లేనిచో విలువైన ప్రజాధనం వాహనాల ‘తుక్కు’ రూపంలో వృధా అయ్యే ప్రమాదం ఉంది.

వినియోగంలోకి తెచ్చేలా చర్యలు

వెంకటేశ్వర్లు, ఇన్‌ఛార్జి కమిషనర్‌, పురపాలక సంఘం, నిర్మల్‌

పురపాలక సంఘానికి సంబంధించిన వాహనాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. నిర్వహణ విషయంలో ఎక్కడా లోటుపాట్లు జరుగకుండా మరమ్మతులను వెనువెంటనే చేపట్టి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

మూలనపడి పనికిరాకుండా పోతున్న ఈ ఆటోలు నిర్మల్‌ బల్దియా కార్యాలయం ఆవరణలో ఉన్నాయి. మరమ్మతులకు నోచుకోక కొన్ని నెలలుగా మూలన పారేయడంతో ప్రస్తుతం పనికిరాకుండా పోయాయి. ఒక్కో ఆటోను గతంలో రూ. 1.20 లక్షలు కేటాయించి కొనుగోలు చేశారు. కొద్ది పాటి నిర్లక్ష్యం, మరమ్మతులు లేక ఇలా కార్యాలయంలో తొమ్మిది ఆటోలు మూలనపడి తుక్కుగా మారే పరిస్థితి ఏర్పడింది.

పట్టణంలో పిచ్చిమొక్కలు, పూడిక తొలగింపు, చదును చేయడం వంటి పనుల నిర్వహణ కోసం గతంలో దాదాపు రూ. 8 లక్షలు వెచ్చించి బ్లేడ్‌ ట్రాక్టర్‌ను బల్దియా అధికారులు కొనుగోలు చేశారు. అయితే సుమారు ఏడెనిమిది నెలలుగా దానిని కార్యాలయం ఆవరణలో మూలన పారేశారు. టైర్లు, కొద్ది పాటి మరమ్మతులకు నోచుకోక ఇలా పక్కన పెట్టేశారు. దాదాపు రూ. లక్ష వెచ్చిస్తే వాహనం వినియోగించుకునే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇది ఇలాగే వదిలేస్తే తుప్పు పట్టి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.