close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

సరికొత్తగా అభ్యసన ప్రక్రియ

హరివిల్లు పేరిట విద్యాశాఖ ప్రయోగం

కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు

న్యూస్‌టుడే, మానుకోట

జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడుతున్న డీఈఓ శర్మ

నేటి సమాజంలో విద్య అనేది పిల్లల్లో విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రాథమిక స్థాయి నుంచి నైతిక విలువలను పెంచుతూ బాలల బాల్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ‘హరివిల్లు’ పేరిట సంతోష విద్యా ప్రణాళిక (జాయ్‌పుల్‌ లర్నింగ్‌) అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలో మహబూబాబాద్‌, వికారాబాద్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు నిర్వహించనుంది. ఆనందాత్మక విద్యాభ్యసన ప్రక్రియ ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంపై ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని రెండు దఫాలుగా శుక్రవారం నుంచి ప్రారంభమైంది. డిసెంబర్‌ నుంచి మూడు నెలల పాటు జరుగుతుంది.

జిల్లాలో.. ప్రాథమిక పాఠశాలలు 677

ప్రాథమికోన్నత పాఠశాలలు 121

ఆటాపాటలు.. కథలు చెప్పడం..

విద్యార్థిని బడికి రప్పించడానికి, అభ్యసన ప్రక్రియ ఆహ్లాదంగా సాగడానికి ఆనందం అనేది అత్యవసరం. ఆలోచనలతో హత్తుకునే కథలు చెప్పుకోవడం, తరగతి గదిలో ఆసక్తిగా పాల్గొనేలా చేయడం, సరదాగా సంభాషించేలా చేసి ప్రతి విద్యార్థి మౌనం వీడేలా చేయడానికి చేస్తున్న కృషిలో భాగమే హరివిల్లు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు పాఠశాలలో ఒక పీరియడ్‌ను కేటాయిస్తారు. సాధారణ పీరియడ్‌లా కాకుండా పిల్లలు ఆనందంగా మాట్లాడేందుకు, పాటలు పాడేందుకు, కథలు చెప్పేందుకు పూర్తి అవకాశం ఇస్తారు. సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో వివిధ కథలు, కృత్యాలు, చివరగా శనివారం రోజున ఒకటి, రెండు తరగతులకు సమన్వయ కృత్యాలు, మూడు, ఐదు తరగతులకు తమను తాము వ్యక్తపరచుకోవడం కాలాంశాలుగా విద్యార్థుల స్థాయి బేధాన్ని బట్టి శిక్షణను రూపొందించారు. ఈ కార్యక్రమాల అంతిమ లక్ష్యం బాలల్లో విలువలను పెంపొందించడమే. అయితే విలువలు బోధిస్తే వచ్చేవి కావు.. ఆచరిస్తేనే వస్తాయన్న నిజం మరువకూడదు.. అందువల్లే రకరకాల సన్నివేశాలు కల్పించడం, పిల్లలు పాల్గొనేలా చేయడం కీలకం. ఈ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది.

మానుకోట, న్యూస్‌టుడే: నూతన విద్యా పథకాలను పాఠశాలల్లో విజయవంతంగా అమలు పరుస్తూ.. కొత్త బోధనా పద్ధతులను అనుసరించి బోధన చేయాలని డీఈవో ఈఎస్‌ఎస్‌ శర్మ ఉపాధ్యాయులను కోరారు. హరివిల్లు కార్యక్రమంపై శనివారం మహబూబాబాద్‌ జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మండల ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదవడం, రాయడం నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ మందుల శ్రీరాములు, ఎంఈఓ కాంతారావు, హరివిల్లు కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు దీపక్‌రెడ్డి, రిసోర్సు పర్సన్లు నాగముని, ఓంకార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.