close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

అదిరింది.. వాహన మేళా..

ఆకట్టుకున్న ‘ఈనాడు-ఆటోషో’

కొలువుదీరిన అత్యాధునిక వాహనాలు

సందర్శకుల సందడి ● నేడు ముగింపు

బాలసముద్రం, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంత ప్రజల వరకు బిజీబిజీగా గడుపుతున్న తరుణంలో ఏదైనా వాహనం కొనుగోలు చేయాలంటే రోజుల తరబడి తిరగాల్సిందే.. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలోనే ఒకే వేదికపై వివిధ మోడళ్లు ఎంపిక చేసుకునే చక్కని అవకాశాన్ని ‘ఈనాడు’ కల్పించింది. యువత మనసు దోచే అత్యధిక సీసీ బైకులు, పిల్లల నుంచి పెద్దల వరకు గేర్లు వేయకుండా నడిపే ద్విచక్ర వాహనాలు.. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న కార్లు.. కమర్షియల్‌ వాహనాలు.. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరి జిల్లావాసులను ఆకట్టుకుంటున్నాయి. ఆటో మొబైల్‌రంగంలో వస్తున్న సరికొత్త వాహనశ్రేణి జిల్లా వాసులకు పరిచయం చేసేందుకు తమకు నచ్చిన వాహనాలకు ఎంపిక చేసుకునేందుకు వేదికగా నిలిచింది. ఈనాడు ఆటోషో.. హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో శనివారం ‘ఈనాడు’ ఆటోషోను వరంగల్‌ గ్రామీణ జిల్లా ఆర్టీఓ మహబూబ్‌ హుస్సేన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

* వరంగల్‌ గ్రామీణ జిల్లా ఆర్టీవో మహబూబ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. అన్ని కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు, కార్లు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లావాసులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఈనాడు వరంగల్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి కుసుమంచి సూర్యప్రకాశ్‌ రాజు మాట్లాడుతూ.. ఆటోషో ఏర్పాటుకు సహకరించిన వాహన డీలర్లు, కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న వాహనాలను పరిచయం చేసేందుకు ‘ఈనాడు’ దినపత్రికలో ప్రతి శుక్రవారం ‘రయ్‌ రయ్‌’ పేరుతో ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నామని చెప్పారు. సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ములుగు ఇన్‌ఛార్జి డీటీవో కంచె వేణు మాట్లాడుతూ.. జిల్లాలో 12 ఏళ్ల నుంచి ‘ఈనాడు’ సంస్థ ఆటోషో ఏర్పాటు చేస్తుందన్నారు. ఇలాంటి వేదికలు వరంగల్‌ నగరానికే తలమానికంగా నిలుస్తాయన్నారు. తక్కువ సమయంలో కుటుంబ సమేతంగా వచ్చి వాహనాలను ఎంపిక చేసుకునే సదవకాశం అన్నారు. ఆదర్శ గ్రూప్స్‌ డైరెక్టర్‌ విజయ్‌, ఆదర్శ ఆటోమొబైల్స్‌ సీజీఎం శ్రీకాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ.. వాహనాల కొనుగోలు పెరిగిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఆటోషోను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. అనంతరం పలు కంపెనీల నూతన కార్లు, ద్విచక్ర వాహనాలు అతిథులు ఆవిష్కరించారు. రోజంతా సందర్శకులతో ఆటోషో కిటకిటలాడింది. కార్లు, బైకులు చూసి మంత్రముగ్ధులై అక్కడికక్కడే కొనుగోలు చేశారు. మరి కొంతమంది ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా బంగారు నాణెలు, క్యాష్‌బ్యాక్‌, లక్కీడ్రా కూపన్ల ద్వారా బహుమతులు ప్రకటించారు. తక్షణమే వాహనం బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీ ప్రకటిస్తున్నారు. ఈసారి పాత కార్ల అమ్మకాలను అందుబాటులో ఉంచారు. పాత వాహనాలతో ఎక్స్ఛేంజ్‌ సదుపాయం కూడా కల్పించారు. పలు బ్యాంకు సంస్థలు రుణ వితరణకు ముందుకు వచ్చాయి. ఆటో షోకు ప్రధాన స్పాన్సర్‌గా ఆదర్శ ఆటోమోటివ్స్‌ మారుతి, ఈటీవీ తెలంగాణ మీడియా పార్ట్‌నర్‌గా, రేడియో పార్ట్‌నర్‌గా ఈఎఫ్‌ఎం వ్యవహరించాయి. స్టాళ్ల వద్ద వాహనాల వివరాలను వెల్లడిస్తూ ఈఎఫ్‌ఎం జాకీలు సందడి చేశారు.

ఆకర్షణగా అత్యాధునిక వాహనాలు..

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థలకు చెందిన కార్లు ప్రదర్శన అమ్మకాలలో ఉంచారు. చూడముచ్చటైన రంగులు, పలు డిజైన్లతో రూపొందించిన వాహనాలు కనువిందు చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ వర్షెన్లతోపాటు ఎలక్ట్రిక్‌ బైకులు అత్యధిక మైలేజీ అందించడంతోపాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ అనుభూతి కల్పించేలా రూపొందించిన కార్లు సందర్శకుల మనసు దోచుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు యువతను కట్టిపడేస్తున్నాయి.

పెద్ద కారు తీసుకుంటున్నాం - వెల్దండి రజని, ఎక్సైజ్‌ కాలనీ, సుబేదారి

మా తమ్ముడు అమెరికా నుంచి ఇటీవలే హన్మకొండకు వచ్చారు. ‘ఈనాడు’ ఆటోషో ఏర్పాటు చేశారని తెలిసి ఇక్కడకు వచ్చాం. ఏడుగురు ప్రయాణించే పెద్ద కారు తీసుకుంటున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.