close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

ఏజెన్సీలో ఆగ్రహజ్వాలలు

కులానికో న్యాయమా అంటూ నిరసన

దళిత మహిళ అత్యాచార నిందితులకు బహిరంగ ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌

మూడు గంటల పాటు రహదారిపై బైఠాయింపు

మాట్లాడుతున్న డీఎస్పీ సత్యనారాయణ

జైనూరు, న్యూస్‌టుడే : అదే ఆగ్రహం.. అదే ఆక్రోశం.. పచ్చని మన్యంలో అలజడి సృష్టించిన దళిత మహిళ హత్యాచారంపై శనివారం కుమురం భీం జిల్లాలోని వివిధ మండలాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ‘దిశ’ తరహాలోనే నిరుపేద దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జైనూరు, సిర్పూరు(యు), లింగాపూర్‌ మండలాల ప్రజలు జైనూరు మండల కేంద్రంలో తుడుందెబ్బ, వర్తకులు, ఉపాధ్యాయ, కర్షక సంఘాలతో పాటు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమోన్నత పాఠశాల బాలికలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని మానవ మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలని నినదించారు. హైదరాబాద్‌ రాజధాని శివారులో యువ వైద్యురాలు దిశపై అత్యాచారం.. హత్యకు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.. దిశపై జరిగిన దారుణమైన సంఘటనకు మూడు రోజుల ముందు కుమురం భీం జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామంలో అత్యాచారం చేసి ..పశు వాంఛను తీర్చుకోవడమే గాక అతికిరాతకంగా హత్య చేసిన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. కిరాతకులను ప్రజల సమక్షంలో తీసుకొచ్చి బహిరంగానే ఉరితీయాలని నినాదాలు చేశారు. వాణిజ్యసముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి జిల్లా కేంద్రం వైపు వెళ్లే ప్రధాన రాహదారిలో భారీ ర్యాలీ నిర్వహించి కుమురం భీం చౌరస్తాలో బైఠాయించారు. అగ్రవర్ణాలకో న్యాయం దళితులకు ఓ న్యాయమా అంటూ దళిత సంఘాలు గర్జించాయి. ఎస్పీ మల్లారెడ్డి వచ్చే వరకు రాస్తారోకో విరమించేదిలేదని ఆందోళనకారులు భీష్మించుకు కూర్చున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహం 12 గంటల వరకు రహదారి దిగ్బంధం చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఆందోళనకారులనుద్దేశించి డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడారు. లింగాపూర్‌ మండలంలోని ఎల్లాపటార్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు వేసి సత్వరమే న్యాయం జరిగేలా చూస్తాం. ఇప్పటికే బలమైన ఆధారాలను సేకరించాం. కిరాతకులకు ఉరిశిక్షపడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ సత్యనారాయణ, సీఐ సురేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల రాష్ట్ర నాయకులు జాడి రవీందర్‌, నర్సింగ్‌మోరే, శివానంద్‌, జిల్లా గ్రంథాయ సంస్థ ఛైర్మన్‌ కనక యాదవ్‌రావు, రాష్ట్రహజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, మండల ఉపాధ్యక్షుడు చిర్లె లక్ష్మణ్‌, అంగన్‌వాడీ టీచర్ల యూనియన్‌ సంఘం జిల్లా నాయకురాలు రాజమణి, కమల, లీలాబాయి, పెంటుబాయి, తుడుందెబ్బ నాయకులు ఆడ అమృత్‌రావు, కనక గంగారాం, ఆజ్జులాల, హైమద్‌ఖాన్‌, భాజపా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కుమ్ర వందన, భాజపా మండల అధ్యక్షుడు సుబోత్‌కాంత్‌, వర్తక సంఘాల నాయకులు ముత్యపువార్‌ రమేశ్‌, ఏక్బాల్‌, కోటగిరి శ్రీనివాస్‌, విశ్వనాథ్‌, గజానంద్‌, మున్నా, విజయ్‌, పద్మాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న కళాశాల విద్యార్థులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.