close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

వ్యాయామమే ఆరోగ్యం.. ఆనందం

పాఠశాలల్లో ముగిసిన ఫిట్‌ ఇండియా వారోత్సవాలు

విద్యార్థులకు యోగా, కరాటేపై అవగాహన

న్యూస్‌టుడే, కలిగిరి

కలిగిరిలోని కస్తూర్బా విద్యాలయంలో యోగా

విద్యార్థులను శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం దిశగా తీసుకెళ్లేందుకు పాఠశాలల్లో నిర్వహించిన ఫిట్‌ఇండియా వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. శారీరక దృఢత్వం...మానసిక వికాసం లక్ష్యంగా వారం రోజుల పాటు నిత్యం యోగా, వివిధ వ్యాయామాలు చేయించారు.

 

దేశానికి సంపద బాలలు. భావిభారత పౌరులంతా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లల భవిష్యత్తే దేశాభివృద్ధిగా మోదీ సర్కారు భావించి ఫిట్‌ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థి దశ నుంచే వ్యాయామం అలవడితే నిత్య ఆరోగ్యంతో ఉంటారు. ఇది సమాజానికీ మంచిది. ఈ నేపథ్యంలోనే ఈ నెల రెండో తేదీన ప్రారంభమైన ఫిట్‌ ఇండియా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. యోగాసనాలు వేయించి వాటి వల్ల కలిగే ఉపయోగాలు, ఏఏ ఆసనాలను ఏ విధంగా వేయాలో వివరించారు. శారీరక దారుఢ్యం, పోషణపై అవగాహన కల్పించారు. మానసికంగాను బలంగా ఉండేందుకు దోహదం చేసే ధ్యానం, ఆసనాలు వేయించారు. నృత్యం, ఏరోబిక్స్‌, యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌, కబడ్డీ, ఖోఖో, రోప్‌ స్కిప్పింగ్‌ వంటి ఆటలపైనా అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలకు ముందుగానే వివరించారు. షెడ్యూలు మేరకు ఆయా రోజుల్లో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, ఫొటోలతో సహా ఉన్నతాధికారులకు పాఠశాలల నుంచి నివేదికను వ్యాయామ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అందజేశారు.

 

ఎన్నో ఉపయోగాలు

శారీరక ఆరోగ్యంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం వ్యాయామంతో సాధ్యమవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా వ్యాయామం తప్పక అవసరం. గుండెజబ్బులు, అధిక రక్తపోటు, నిద్రలేమి, మానసిక రోగాలు రాకుండా శారీరక వ్యాయామం ఉపయోగపడుతుంది. పాఠశాల స్థాయి నుంచి వీటిపై విద్యార్థులు దృష్టి సారించేలా ప్రత్యేక శిక్షణ తరుగతులు ఉపయోగపడతాయి. చిన్నపాటి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు వారం రోజుల్లో తెలియజేశారు. నేర్చుకున్న అంశాలను ప్రతిరోజూ సాధన చేయాలని, దినచర్యలో నిత్య వ్యాయామం భాగంగా ఉండాలని సూచించారు. ఆత్మరక్షణకు ఉపయోగపడే మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటేలపై కూడా పట్టు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

- ఎం.తిరుపాలురెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు, తెల్లపాడు

వ్యాయామం, మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు, వ్యాయామం అవసరమవుతాయి. స్నేహభావం పెంచుకోవచ్ఛు వారోత్సవాల్లోనే కాకుండా ఈ అంశాలపై ఎల్లప్పుడూ విద్యార్థులచే సాధన చేయిస్తాం.

 

అలసట దూరం

-సీహెచ్‌.పద్మాక్షి, విద్యార్థిని కలిగిరి

ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా వ్యాయామం, యోగా నేర్పించారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా అలసట, ఒత్తిడికి దూరంగా ఉంటున్నాం.

 

చదువులో చురుగ్గా

- టి.హనూక్‌, పదోతరగతి

వ్యాయామం చేసే విధానాలతో పాటు తినాల్సిన ఆహారం తదితరవాటిపై వ్యాయామ ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యమే కాకుండా చదువులో చురుగ్గా ఉంటాం. ఫిట్‌ఇండియాలో నేర్చుకున్న అంశాలను నిత్యం సాధన చేస్తున్నా.

 

ప్రతిరోజూ సాధన చేస్తాం

- సీహెచ్‌.భావన, విద్యార్థిని

మాకు పాఠశాలలో వివిధ ఆసనాలు నేర్పించారు. ముఖ్యంగా బాలికలకు కరాటే, మార్షల్‌ఆర్ట్స్‌లో కొన్ని మెలకువలు తెలిపారు. యోగా, వ్యాయామంతో నూతనోత్సాహం, శారీరక ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని గ్రహించాను.

 

కరాటే నేర్చుకుంటున్న చిన్నారులు

 

తెల్లపాడులో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.