close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

అటు ఆశీస్సులు.. ఇటు హెచ్చరికలు!

మస్తాన్‌రావును పార్టీలోకి ఆహ్వానించిన సీఎం

కట్టుబడి పనిచేస్తానన్న బీద

ఆనం వ్యాఖ్యలపై అధినేత సీరియస్‌

పార్టీ నేతలు గీత దాటొద్దన్న విజయసాయిరెడ్డి

ఈనాడు, నెల్లూరు

మస్తాన్‌రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి..

చిత్రంలో మంత్రి అనిల్‌కుమార్, విజయసాయిరెడ్డి,

కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు 

అధినేత ఆయనకు ఆశీస్సులు అందించారు. ఈయనకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకేరోజు ఒకేపార్టీలో రెండు భిన్న పరిణామాలు చోటుచేసుకోవడం కీలకం. అమరావతి ఇందుకు వేదికగా మారింది. రాజధాని సాక్షిగా సింహపురి రాజకీయం మలుపు తిరిగింది. బీద, ఆనం పరిణామాలపై వైకాపా అధిష్ఠానం స్పందన చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సీనియర్‌ నాయకుడు బీద మస్తాన్‌రావు శుక్రవారం సాయంత్రం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ మేరకు లేఖను తెదేపా అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్‌లో పంపించడం విదితమే. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన వైకాపాలో చేరారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో ఆయన వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి బీద, ఆయన సన్నిహితులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీద మీడియాతో మాట్లాడుతూ పార్టీకి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. యువ నాయకత్వంలో పనిచేయడం ఆనందాన్నిస్తోందని చెప్పారు. మొత్తంగా మస్తాన్‌రావు పార్టీ మార్పుతో చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

 

‘ఆనం’పై గరం

వైకాపా సీనియర్‌ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సంబంధించి శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌ అయింది. నెల్లూరు నగరం మాఫియాకు అడ్డాగా మారిందంటూ వెంకటగిరిలో విలేకరులతో మాట్లాడిన నేపథ్యంలో శనివారం అధిష్ఠానం పెద్దల వద్ద తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. వైకాపా అధినేత సీరియస్‌ అయినట్లు తెలుస్తుండగా.. బీద చేరిక అనంతరం విజయసాయిరెడ్డి విలేకరుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడం కీలకంగా మారింది. గతంలో జరిగిన ఐఏబీ సమావేశంలో వర్గపోరు బయటపడగా.. ప్రస్తుత మాటలతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తంగా రాజధానిలో సింహపురికి సంబంధించి ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.