close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ఎస్పీకి సమస్యల సవాల్‌

ఆకతాయిల చేష్టలు.. గొలుసు దొంగల భయం 
చీకటి పడితే మద్యంప్రియుల ఆగడాలు
పట్టపగలు దోపిడీలు రాత్రయితే దొంగతనాలు
ఫిర్యాదులు పట్టించుకోని పోలీసులు
పెరిగిన సివిల్‌ కేసుల ‘పంచాయితీ’
నేడు కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ
న్యూస్‌టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు)

ఒక వైపు పేట్రేగుతున్న దొంగలు.. మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ దూకుడు.. జాతీయస్థాయి నిందితులను జైలుకు తరలిస్తుంటే.. పాత నేరస్థులు చెలరేగిపోతున్నారు.. తాళం వేసిన ఇంటికి కన్నాలు వేస్తున్నారు.. చైన్‌ స్నాచర్స్‌ భయంతో మహిళలు రోడ్డుపై నడవాలంటేనే ఆందోళనచెందుతున్న  పరిస్థితి నెలకొంది.. పట్టపగలే దోపిడీలు.. పోలీసు స్టేషన్లలో న్యాయం జరగడం లేదు.. స్పందన అంతంతమాత్రమే.. క్షేత్రస్థాయిలో పెరిగిన రౌడీయిజం.. ఇసుక అక్రమ రవాణా.. పోలీసు స్టేషన్లలో సివిల్‌ పంచాయితీలు.. నగరంలో పరిష్కారం కాని ట్రాఫిక్‌ సమస్యలు వెరసీ.. జిల్లా నూతన ఎస్పీకి సవాల్‌గా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి నుంచి ఉన్న సమస్యలు పరిష్కరిస్తారని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని బదిలీ చేసిన క్రమంలో ఆయన స్థానంలో మంగళగిరిలో ఏఐజీ అడ్మిన్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ భూషణ్‌ను జిల్లా ఎస్పీగా నియమించారు. శనివారం రాత్రి నెల్లూరుకు చేరుకున్న ఈయన.. ఆదివారం ఉదయం జిల్లాకు 43వ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’  కథనం.


స్పందనకు వచ్చే అర్జీలే నిదర్శనం.. జిల్లాలో 22 సర్కిళ్ల పరిధిలో 64 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. నెల్లూరు నగరంలో 9 స్టేషన్లు, సోమశిల, కండలేరు, శ్రీహరికోటలో మూడు ప్రత్యేక స్టేషన్లు, ఇస్కపల్లి, దుగరాజపట్నం, శ్రీహరికోటల్లో మూడు మెరైన్‌ పోలీసు స్టేషన్లు, కృష్ణపట్నం పోర్టులో ఒకటి, గూడూరు, కావలిలో వన్‌ టౌన్, టూ టౌన్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌కు ఒకరు, ఇద్దరు ఎస్సైలతో పాటు సీఐలు ఉన్నారు. ఇంతటి వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే విజ్ఞప్తుల దినోత్సవాల్లో ప్రజలు బారులు తీరుతుంటారు. జిల్లా నలుమూలల నుంచి వస్తుంటారు. స్థానికంగా తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు అర్థమవుతోంది. దాదాపు ప్రతి స్టేషన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. 


పలుకుబడి ఉంటే ‘ఎస్‌’ సార్‌.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పోలీస్‌ స్టేషన్లలో న్యాయం జరగడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న వారికే పోలీసులు ‘ఎస్‌’ సార్‌.. అంటున్నారు. సామాన్యులకు మాత్రం స్టేషన్లలో చుక్కలు చూపిస్తున్నారు. గ్రామాల్లో ఎస్సైలే కీలక పాత్ర పోషిస్తున్నారు. సంబంధం లేని వారిని కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 


అమలుకాని వారానికో కౌన్సెలింగ్‌.. రౌడీ షీటర్లు పేట్రేగిపోతున్నారు. ప్రతి వారం కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచీ అధికారులు తమకేమి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.


ట్రాఫిక్‌ పద్మవ్యూహం 
ఏళ్ల నుంచి జిల్లా కేంద్రమైన నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కావడం లేదు. రోడ్లపై నడవాలంటేనే పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. ఆత్మకూరు బస్టాండు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ఇదే పరిస్థితి. ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపై ప్రయాణించాలంటేనే హడలిపోతున్నారు. సరైన నిబంధనలు అమలు కాకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోజుకో నిబంధనతో నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే రోడ్డు అంతంతమాత్రంగా ఉంటే సెంటర్‌ పార్కింగ్‌ అంటూ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. అలా అని, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతోందా అంటే అదీ లేదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్‌ చేయడం, వన్‌వేలు ఏర్పాటు చేయకపోవడం, మామూళ్ల మత్తులో అధికారులు ఉండటంతో సమస్య జఠిలమవుతోంది. నూతన జిల్లా ఎస్పీ ట్రాఫిక్‌పై దృష్టి పెడితే బాగుంటుందని నగర ప్రజలు కోరుతున్నారు.

 

వారంలో 15 దొంగతనాలు
జిల్లాలో పోలీసు నిఘా నిద్దరోతోంది. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన కొన్ని విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో జిల్లాలో నేరాలు పెరిగాయి. నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత వారం రోజుల నుంచి 15కిపైగా దొంగతనాలు జరిగాయంటే చోరీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది. మున్సిపాలిటీ ఉద్యోగులు అంటూ ఒకటికి మూడు సార్లు దోపిడీలకు పాల్పడ్డారు. అయినా, ఎలాంటి చర్యలు లేదు. నడిరోడ్డుపై మహిళ నడిచి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ వీధి నుంచి ఏ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దొంగతనం చేస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. పాత నేరస్థులే దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమే దీనికి కారణం.  

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.