close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ఇల్లు పూర్తి .. నిధులే అసంతృప్తి

పక్కా గృహాలకు ‘నరేగా’ గండం

మస్టర్‌ల నమోదులో తీవ్ర జాప్యం

బిల్లుల చెల్లింపులో అలసత్వం

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

న్యూస్‌టుడే, పెళ్లకూరు

పెళ్లకూరు మండలంలో ఎన్టీఆర్‌ పక్కా గృహనిర్మాణం కింద 383 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి లబ్ధిదారునికి 90 రోజుల పనిదినాల కింద రూ.18,700 చెల్లించాల్సి ఉంది. ఇలా పనిచేసిన తర్వాత వారికి మస్టర్‌ల నమోదు చేపట్టాల్సి ఉంది. మస్టర్‌ వేసిన తర్వాత చెల్లింపులు ఉంటాయి. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా ఇంకా చాలా మందికి ఉపాధి నగదు ఇవ్వలేదు. ఇలా 48 ఇళ్లు పూర్తి కాగా వీరికి రూ.8.97 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఇచ్చింది కేవలం రూ. 1.82 లక్షలు మాత్రమే.

 

చిట్టమూరు మండలంలో ఇదే పరిస్థితి. 413 ఇళ్లకు గాను 229 పూర్తి చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.3.71 లక్షలు మాత్రమే వారి ఖాతాల్లో వేశారు.

 

కలువాయి మండలంలో 398 ఇళ్లకు గాను ఈ ఏడాది రూ. 41.62 లక్షలు చెల్లించాలని అంచనా వేశారు. ఇప్పటి వరకు 154 ఇళ్లు పూర్తి కాగా సుమారు రూ. 28.79 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఉపాధి పని దినాల మస్టర్‌లు నమోదు చేయకపోవడంతో బిల్లుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రూ.4.88 లక్షలు మాత్రమే వారి ఖాతాల్లో జమ చేశారు.

 

పొదలకూరు మండలంలో 589 పక్కా ఇళ్లకు గాను రూ. 61.51 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 210 ఇళ్లు పూర్తి చేశారు. ఇంకా రూ.39.27 లక్షల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. దీనిని ఉపాధి పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వేసింది నామమాత్రమే.

గ్రామీణ గృహ నిర్మాణానికి ఈ ఏడాది నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులు గండంగా మారాయి. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ వాటాతో పాటు జాతీయ ఉపాధి హామీ ద్వారా 90 రోజుల పనిదినాలకు గాను రూ. 18,700 ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే లబ్ధిదారుని జాబ్‌కార్డు ఆధారంగా ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ మూడేళ్లుగా లబ్ధిదారులు నరేగా నిధులు రాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లు ఒకవైపు వివిధ దశల్లో ఉండగా మరోవైపు పూర్తయిన వాటికీ బిల్లులు సంపూర్ణంగా ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులే మిగిలాయి.

 

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 13,500 ఇళ్లు మంజూరు కాగా వీరికి ఉపాధి కింద రూ. 12.74 కోట్లు ఇవ్వాలని అంచనాలు వేశారు. ఇందులో పూర్తయిన ఇళ్లు 5,591 ఉండగా వీరికి వాస్తవానికి రూ. 10.45 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇచ్చింది మాత్రం 2.47 కోట్లు మాత్రమే. ఇంకా రూ.7.98 కోట్ల మేర బకాయిలున్నాయి. ఇందులో ఎక్కువగా మస్టర్‌లు నమోదు కాకపోవడమే ప్రధాన కారణంగా ఉంది. వీటిని మండల పరిషత్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌లు నమోదు చేయాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో ఫీల్డ్‌ సహాయకులు వివరాలు తీసుకుని లబ్ధిదారుల మస్టర్‌ వేసి వాటిని ఉపాధి కార్యాలయంలో అందజేయాల్సి ఉంది. ఇలా క్షేత్ర సహాయకులు, మండల స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా లబ్ధిదారులకు బిల్లుల సమస్యగా మారుతోంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే బిల్లుల చెల్లింపులు వేగిరం అయ్యే అవకాశముంది. ● మూడేళ్ల పాటు ఇళ్లు చురుగ్గా సాగాయి. లబ్ధిదారులు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణం పేరిట సాయం ఇచ్చే పరిస్థితి ఉంది. యూనిట్‌ విలువలో ఉపాధి భాగస్వామ్యం రూ.18,700లు కాగా జాబ్‌కార్డు ఉన్న వారంతా ఇందుకు అర్హులు.అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇందులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణం భారమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి బకాయిలు గుదిబండగా మారాయి. ఇళ్లు పూర్తి చేసుకున్న వారు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారు. సామగ్రి తీసుకుకొచ్చిన వారికి తిరిగి చెల్లించలేని పరిస్థితి చాలా చోట్ల ఉంది.

అసంపూర్తిగా ఉన్న పక్కా ఇల్లు​​​​​​​

జాప్యానికి తావు లేదు

- జ్యోతిబసు, పథ సంచాలకుడు, డ్వామా

గృహ నిర్మాణ శాఖ నుంచి కూలీల వివరాలు అందిన వెంటనే మంజూరు చేస్తున్నాం. మస్టర్‌ల నమోదులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ల దగ్గర జాప్యం జరిగే పరిస్థితి ఉంటే పరిశీలిస్తాం. 90 రోజుల పనిదినాల భత్యం గృహనిర్మాణ శాఖ నుంచి ఇళ్ల నిర్మాణ దశల వారీగా వివరాలు అందించిన వెంటనే చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. జాప్యానికి తావు లేకుండా చేస్తాం.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.