close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

అక్రమ వ్యాపారుల ముఠా అరెస్టు

110కిలోల గంజాయి, తుపాకి, రూ.1.10 లక్షల నగదు స్వాధీనం

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: గంజాయి, నకిలీ బంగారం, వజ్రాల పేరుతో తుపాకీతో బెదిరింపులకు గురిచేస్తూ వ్యాపారం చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు ములుగు ఏఎస్పీ సాయిచైతన్య పేర్కొన్నారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముగ్గురు ముఠా సభ్యుల అరెస్టును చూపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ములుగుకు చెందిన ఎండీ ఇబ్రహీం బాబా అలియాస్‌ అమీర్‌ఖాన్‌, అలియాస్‌ సతీష్‌ అన్న, నక్క రవిచందర్‌, ఖమ్మంకు చెందిన దొంతగాని వీరన్న(కోళ్లఫాం గుమస్తా), హన్మకొండకు చెందిన తిరుపతి ముఠాగా ఏర్పడి ములుగు జిల్లా వెంకటాపూర్‌ సమీపంలోని విద్యుత్తు ఉపకేంద్రం పక్కనే ఉన్న ఓ కోళ్లఫాంను అద్దెకు తీసుకున్నారు. ఈ కోళ్లఫాంలో గంజాయిని నిల్వ చేసి కిలో ప్యాకెట్ల రూపంలో మార్చి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనితో పాటు నకిలీ వజ్రాలు, బంగారం వ్యాపారం కూడా మొదలు పెట్టారు. కొనుగోలు దారుల నుంచి నగదు రాగానే తుపాకీ చూపించి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భారీ మొత్తంలో గంజాయిని కోళ్లఫాంలో నిల్వ చేసినట్లు ఉన్నతాధికారుల సమాచారం మేరకు వెంకటాపూర్‌ ఎస్‌ఐ నరహరి, సిబ్బందితో కలిసి కోళ్లఫాంను తనిఖీ చేశారు. 110కిలోల గంజాయి, రూ.1.10లక్షల నగదు, ఒక పిస్తోల్‌, ఒక కారు, 6సెల్‌ఫోన్లు, నాలుగు నకిలీ వజ్రాలు, రెండు నకిలీ బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. స్థానిక తహసీల్దార్‌ సమక్షంలో పంచనామ చేసి వాటిని స్వాధీన పర్చుకున్నారు. ముగ్గురుని అరెస్టు చేయగా.. తిరుపతి పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారిపై ఇప్పటికే 24పోలీసు స్టేషన్ల పరిధిలో కేసు నమోదైనట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. గంజాయి విలువ రూ.13లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సమావేశంలో ములుగు సీఐ దేవేందర్‌రెడ్డి, ఆర్‌ఐ స్వామి, స్థానిక ఎస్‌ఐ నరహరి, సిబ్బంది పాల్గొన్నారు.


దూరవిద్యలో ప్రవేశాలకు గడువు 27

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: చదువుకోవాలని ఆసక్తి ఉన్న, మధ్యలో చదువు మానేసిన జనగామ జిల్లాలోని అభ్యర్థులకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం హైదరాబాద్‌ ద్వారా దూరవిద్యలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమీపంలోని దూరవిద్య అధ్యయన కేంద్రాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి ప్రవేశాలు పొందాలన్నారు.


నేడు విద్యార్థుల చైతన్యయాత్రలు

దేవరుప్పుల, న్యూస్‌టుడే: వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్భంగా మంగళవారం పాఠశాల విద్యార్థులతో చైతన్య యాత్రలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. కార్యాలయం మండల విద్యాధికారులను ఆదేశిస్తూ గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల ప్రతినిధులు, యువజనుల సహకారం తీసుకొని చైతన్యయాత్రలు నిర్వహించాలని కోరింది.


నేటి నుంచి కళాశాల కౌన్సిలర్లకు శిక్షణ

దేవరుప్పుల, న్యూస్‌టుడే: పరీక్షలలో జయాపజయాలతో సంబంధం లేకుండా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రతి కళాశాలలో కౌన్సిలర్‌ నియామకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ కళాశాలకు హాజరుకావడం, విద్యేతర కార్యక్రమాలలో పాల్గొంటే నిలువరించడం, పరీక్షలలో వచ్చే మార్కులను ఎప్పటికప్పుడు మదింపు చేయడం, అవసరమైతే అధ్యాపకులతో మాట్లాడి చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థిని మానసికంగా సిద్ధం చేయడం వీరి విధి. జిల్లాలోని ఏడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వీరి నియామకం పూర్తయింది. సంగీత గోయల్‌ (బాలికల కళాశాల జనగామ), ఆశాశర్మ (ధర్మకంచ, జనగామ), ఈ.ధనుంజయ (స్టేషన్‌ఘన్‌పూర్‌), ఏ.వేంకటేశ్వర్లు (నర్మెట్ట), కె.స్రవంతి (దేవరుప్పుల), కె.కిషన్‌రావు (కొడకండ్ల), పి.నరేందర్‌రావు (జఫర్‌గడ్‌)లను గుర్తించామని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మంగళవారం నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగే శిక్షణకు వీరిని పంపిస్తున్నామని చెప్పారు. గురువారం నుంచి వీరు విధులు నిర్వర్తిస్తారన్నారు.


సైన్స్‌ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోండి

ములుగు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్‌, గణిత, పర్యావరణ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. మొత్తం 250 ప్రదర్శనలకు గాను 250 మంది విద్యార్థులు, 250 మంది గైడ్‌ టీచర్లు తమ ప్రదర్శనలను ప్రదర్శిస్తారని స్పష్టం చేశారు. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.


ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల

ఈనాడు, వరంగల్‌: జిల్లాల్లోని వివిధ అభివృద్ధి పనులకు ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ (ఎస్‌డీఎఫ్‌) కింద సోమవారం నిధులను విడుదల చేస్తూ ప్రణాళిక విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జనగామ జిల్లాకు రూ. 29.24 లక్షలు మంజూరయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికిగానూ మిగిలిపోయిన పలు పనులకు ఈ నిధులను కేటాయించాలని పేర్కొంది. ఇక వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ. 24.85 లక్షలు వచ్చాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రతిపాదనల మేరకు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలో వివిధ పనులు చేపట్టేందుకు ఈ నిధులు విడుదలయ్యాయి. పరకాల మండలం ముస్త్యాలపల్లి గ్రామంలోని ఎస్సీ వాడలో సామాజిక భవనం నిర్మాణానికి రూ. 4.95 లక్షలు, ఇదే గ్రామంలో మరో రహదారి నిర్మాణానికి రూ. 4.95 లక్షలు ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద విడుదలయ్యాయి. కాగా జనరల్‌ ఫండ్‌ కింద పెద్దపెండ్యాలలో సామాజిక భవనం నిర్మాణానికి రూ. 4.95 లక్షలు మంజూరయ్యాయి. ఇదే గ్రామంలో మరో రహదారి నిర్మాణానికి రూ. 4.95 లక్షలు, ధర్మసాగర్‌ మండలంలోని మరికొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు గానూ మొత్తంగా రూ. 24.85 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకుగానూ రూ. 20.19 లక్షలు మంజూరయ్యాయి.


ప్రజావాణిలో వినతులు సమర్పించిన గిరిజనులు

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయించి తొందరగా పోస్టింగులు ఇప్పించాలని కోరుతూ టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ అభ్యర్థులు సోమవారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని పలు మండలాల నుంచి వచ్చిన గిరిజనులు వినతులు సమర్పించారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, డీటీడీవో ఎర్రయ్య, ఏఏవో సంతోష్‌, మేనేజర్‌ లాల్‌, పీహెచ్‌వో సంజీవరావు, డీఈ మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.


వారంలో ఫిర్యాదులు పరిష్కరించండి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజలు, వృద్ధుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులు చేయడానికి గల కారణాలను ప్రజల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు తెలిపారు. ఏ వారానికి సంబంధించినవి ఆ వారంలోపే పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజావాణికి 75 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. భూ సమస్యలు, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు, మరుగుదొడ్ల అవకతవకలు, పింఛన్లు, తదితర సమస్యలవి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మాలతీ, ఏవో విశ్వప్రసాద్‌, సంబంధిత జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.