close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఎక్కడికెళ్లాలి

నేడు ప్రపంచ శౌచాలయ దినం

ప్రజా మరుగుదొడ్లే లేని ప్రభుత్వ కార్యాలయాలు

బడుల్లో ఉన్నా అపరిశుభ్రత

న్యూస్‌టుడే, మానుకోట

మరుగుదొడ్డి ఆవశ్యకత ఎంతో ఉంది. అది ఇల్లు కానీ.. ప్రజలు ఎక్కువగా సంచరించే బహిరంగ ప్రాంతాల్లో కానీ.. ప్రభుత్వ కార్యాలయాల్లో .. విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో కానీ శౌచాలయాలు ఉండాల్సిందే. ఇవి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేసే మానవ వ్యర్థాలను బహిరంగంగా ఉంచకుండా చేస్తాయి. మీరు ఎవరైనా.. ఎక్కడ ఉన్నా మీకు శౌచాలయ సౌకర్యాన్ని కల్పించాల్సిందే. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ పేరిట ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తమ కార్యాలయాలను మరిచి వ్యవహరిస్తుండటంతో స్వచ్ఛమిషన్‌ లక్ష్యం నెరవేరకుంది. ఉమ్మడి జిల్లాలో ఈ దుస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను చైతన్యపరచాలని చెప్పే అధికార యంత్రాంగం కూడా తమ కార్యాలయాల వద్ద మరుగుదొడ్ల ఆవశ్యకతను గుర్తించాలి. నేడు ప్రపంచ శౌచాలయ దినం నేపథ్యంలో న్యూస్‌టుడే ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పరిశీలన చేసి ఇస్తున్న ప్రత్యేక కథనం.

దేశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన బాలురు రోడ్డు పక్కన ఒటికి ఇలా..

పంచాయతీలో కానరావు..

రాందాన్‌తండా(వర్ధన్నపేట రూరల్‌), న్యూస్‌టుడే: వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం రాందాన్‌తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. నిత్యం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వివిధ పనుల మీద గ్రామస్థులు వస్తుంటారు. మరుగుదొడ్లు లేక పోవడంతో మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.

రోడ్డు పక్కకు వెళ్లాల్సిందే..

చెన్నారావుపేట, న్యూస్‌టుడే: చెన్నారావుపేట మండల ప్రభుత్వ పాఠశాలల్లో మరుగు దొడ్లు సరిపడా లేవు. తిమ్మరాయినిపహాడ్‌తండా ప్రాథమిక పాఠశాలలో మరుగు దొడ్డి అసంపూర్తిగా ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలురు రోడ్డు పక్కకు వెళ్తున్నారు. ఎంపీడీవో, తహీసీల్దార్‌ కార్యాలయంలో ప్రజా మరుగు దొడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిరుపయోగంగా ఉంటున్నాయి..

కొత్తగూడ, న్యూస్‌టుడే: కొత్తగూడ మండలం తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయక పోవడంతో వివిధ పనుల నిమితం కార్యలయాలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ ప్రభుత్వ పాఠశాల ఈశ్వరగూడెంలో నిరుపయోగంగా, అసంపూర్తిగా మరుగుదొడ్లు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెకొంది.

అధికారులకేనా..

కురవి, న్యూస్‌టుడే: గ్రామాల్లో వందశాతం మరుగు దొడ్లు నిర్మించి ఓడీిఎఫ్‌గా ప్రకటించినప్పటికీ ప్రభుత్వ కార్యాలయంలోనే మరుగు దొడ్లు లేవు. కురవి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారుల కోసం మరుగు దొడ్డి నిర్మించారు కానీ ప్రజలకు లేవు. నిత్యం వందలాది మంది రైతులు, విద్యార్థులు వస్తుంటారు. మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది సైతం బయటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

అసంపూర్తి నిర్మాణంతో..

భూపాలపల్లి రూరల్‌, న్యూస్‌టుడే: భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్డి నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛభారత్‌ అమలు చేయాలన్న గ్రామపంచాయతీలోనే మరుగుదొడ్డి సరిగా లేదని గ్రామస్థులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా చాలా గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్లను నిర్మాంచాల్సి ఉంది.

ప్రజా మరుగుదొడ్లు లేక అవస్థలు

నెక్కొండ, న్యూస్‌టుడే: పలు ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోగా, ఉన్న బడుల్లో నిరుపయోగంగా మారాయి. మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా కోరుతున్నా, అధికారులు, పాలకులు స్పందించడం లేదు.

కంపుకొడుతున్నాయి..


కలెక్టరేట్లలోనూ తిప్పలే..!

రూరల్‌ కలెక్టరేట్‌లో..

అర్బన్‌ కలెక్టరేట్‌, రూరల్‌ కలెక్టరేట్‌, మహబూబాబాద్‌, ములుగు, జనగామ అర్బన్‌, భూపాలపల్లి రూరల్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌ అంటే జిల్లా పాలనకు ఆయువు పట్టు. జిల్లా ప్రజలు తమ బాధలు విన్నవించుకోవడానికి కలెక్టర్‌ కార్యాలయాలకు వస్తుంటారు. అనునిత్యం ప్రజలు వచ్చే వీటి వద్దే ప్రజలకు సరైన వసతులు లేవు. తమ జిల్లాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తున్న కలెక్టర్లు తమ కార్యాలాయాల్లో పరిస్థితులను గమనించడం లేదు. రూరల్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ప్రతీ రోజు దాదాపు 100 నుంచి 150 మంది వివిధ పనుల పై వస్తుంటారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 500 మంది వరకు వస్తుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన మరుగుదొడ్లు లేకపోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు చాలినన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రూరల్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సైతం మరుగుదొడ్లు లేవు. అధికారుల కోసం ఏర్పాటు చేసిన ఒక్క మరుగుదొడ్డి సైతం శిధిలావస్థకు చేరింది. జిల్లా పరిషత్‌ కార్యాలయానికి 15 మండలాల నుంచి ప్రజలు వస్తుంటారు. అత్యవసర సమయంలో సైతం కిలోమీటర్ల మేర పరుగుపెట్టాల్సి వస్తుంది. ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ఆర్డీవో కార్యాలయం, తహసీల్దారు కార్యాలయం కూడా ఉన్నాయి. చుట్టు పక్కల కూడా ఎక్కడా పబ్లిక్‌ టాయిలెట్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంధులు పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి రోజు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చే మహిళలు టాయిలెట్ల సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనగామ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని కింది అంతస్తు, పై అంతస్తులో మరుగుదొడ్ల సౌకర్యం బాగానే ఉంది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి సమయంలో ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో మల మూత్ర విసర్జనకు వెళ్లాలంటే నిరీక్షించాల్సి వస్తోందని మరొకటి నిర్మించాల్సిన అవసరం ఉందంటున్నారు. భూపాలపలి కలెక్టర్‌ కార్యాలయంలో మరుగుదొడ్లు ఉన్నా తగినన్ని లేవు. ప్రజావసరాలకు తగ్గట్లు నిర్మించాలి. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌కు సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను వివరించేందుకు వచ్చి పోతుంటారు. ఒక్కొక్కరు మూడు నాలుగు గంటల సమయం ఉంటారు. వారు ఒకటికీ, రెండుకు పోవాలంటే పబ్లిక్‌ టాయిలెట్‌ సౌకర్యం ఉందో లేదో తెలియక ఉక్కబట్టుకొని ఉంటున్నారు. అత్యవసరమైన వారు ఆరుబయట ఉన్న ఖాళీ ప్రదేశంలోకి పరుగులెత్తుతున్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం పక్కనే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నా వాటిని ప్రజల కోసమని గుర్తించేందుకు కనీసం సూచికలులేవు. జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయంలో ఉన్న మరుగుదొడ్డిని సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులకు ఉన్న వాటినే ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. కొత్త భవనం నిర్మితమయ్యే వరకు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ములుగు కలెక్టర్‌ కార్యాలయం

మహబూబాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో..


అపరిశుభ్రంగా..

నర్మెట్టలోని ఉన్నత పాఠశాల మరుగుదొడ్లులో నీరు లేకనిరుపయోగంగా ఇలా..

నర్మెట్ట, న్యూస్‌టుడే: నర్మెట్ట మండలంలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటికి నీటి సౌకర్యం లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. తహసీీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో పబ్లిక్‌ మరుగుదొడ్లు లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్‌లో మరుగుదొడ్లు లేక బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. 17 గ్రామ పంచాయతీలు ఉండగా నర్మెట్ట, వెల్దండలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నా.. వాటికి నీటి సౌకర్యం లేక ఉపయోగించడం లేదు.


దుర్గంధంగా ..

బాలికల కోసం నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు

న్యూశాయంపేట, న్యూస్‌టుడే: నగరంలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయినులకు చెప్పుకోలేని తిప్పలు తప్పడం లేదు. ఉన్నతాధికారులకు అనేక మారు విన్నవించినా ఉన్నతాధికారులు చొరవచూపడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలికలకు 5, బాలురకు 3 నిర్మించాల్సి ఉండగా రెండు, ఒకటి, మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాటిలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.


నీటి సౌకర్యం లేక..

దేశాయిపేట ప్రభుత్వ పాఠశాల

కొత్తవాడ, పోచమ్మమైదాన్‌, దేశాయిపేట, న్యూస్‌టుడే: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవాడలోని గిర్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సుమారు 480 మంది బాలబాలికలు చదువుకుంటుండగా బాలురు ఒకటికి, రెండుకు బయటకు వెళ్తున్నారు. ఇక బాలికలు, మహిళా ఉపాధ్యాయులు పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని తెలిసిన వారి మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. మాసూంఅలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేవు. దేశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మరగుదొడ్లు ఉన్న వాటికి తలుపులు లేవు. బాలురు సమీపంలోని రోడ్డు వైపు వెళ్తున్నారు.


ఆరుబయటకే..

జనగామలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిరూపయోగంగా మరుగుదొడ్లు

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విరామం సమయంలో బాలురు ఆరుబయటనే మూత్ర విసర్జన చేస్తున్నారు. బాలికలు మాత్రం శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించుకుంటున్నారు. కొద్దికాలం కిందట ‘గెయిల్‌’ సహకారంతో నిర్మించిన మరుగుదొడ్లు పరిమాణంలో చిన్నవిగా ఉండటంతో విద్యార్థులకు ఉపయోగకరంగా లేక నిరుపయోగంగా ఉన్నాయి.


సందర్శకుల అవస్థలు

జనగామ తహసీల్దార్‌ కార్యాలయం

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: జనగామ తహసీల్దార్‌ కార్యాలయంలో కనీస వసతులైన ప్రజా మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు మచ్చుకైనా లేవు. రైతులు, ప్రజలు భూ సమస్యల పరిష్కారం నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో విచక్షణ రహితంగా మూత్ర విసర్జన చేస్తున్నారు.


మౌలిక వసతులు నామమాత్రం

తహసీల్దార్‌ కార్యాలయంలో తిప్పలే

డోర్నకల్‌-న్యూస్‌టుడే మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలో ఐదు ఉన్నత, ఒక కస్తూర్బా, ఒక మోడల్‌, ఏడు ప్రభుత్వ ప్రాథమికోన్నత, 43 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా వీటిల్లో 7953 మంది విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు సరిపడే విధంగా ఎక్కడా లేవు. డోర్నకల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌, మేనేజర్‌, మండల పరిషత్తు ప్రత్యేక అధికారి ఛాంబర్లకు అటాచ్డ్‌ మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నాయి. మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సిబ్బందికి సైతం ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. సమావేశాలప్పుడు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చే ఆశా కార్యకర్తలు, మెప్మా ఉద్యోగులు, ఇతర మహిళల ఇబ్బందులు మాటలకు అందనివి. తహసీల్దార్‌ కార్యాలయంలోనూ రెండు మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నా వీటిని అధికారులు వినియోగిస్తున్నారు. సిబ్బందిది దిక్కుతోచని పరిస్థితే. మహిళా ఉద్యోగుల అవస్థ మరీ దారుణం. ప్రజలు పరిసర ప్రదేశాలను బహిర్భూమిగా ఉపయోగించుకోవాల్సిన రావడం అనివార్యం అవుతుంది.


ఇబ్బందులు పడుతున్న బాలికలు

ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బారులు తీరిన బాలికలు

గీసుకొండ, న్యూస్‌టుడే: గీసుకొండ మండలంలో 35 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొత్తం 3193 మంది చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధర్మారం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 420 మంది విద్యార్థులు ఉండగా బాలికలకు రెండు మరుగుదొడ్లు, ఆరు మూత్రశాలలు మాత్రమే ఉన్నాయి. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. బాల బాలికలు మూత్రశాలలు, మరుగుదొడ్ల వద్ద ప్రతి రోజు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బాలురు రైల్వే లైన్‌ దాటి అవసరాన్ని తీర్చుకుంటున్నారు. కొందరు బాలురు చెప్పకుండా ఇంటికి వెళుతున్నారని ఉపాధ్యాయులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. రూ. 80 లక్షలు వెచ్చించి మూడంతస్తులతో అందమైన పాఠశాల నిర్మించినా ఆ భవనంలో ఒక్క మూత్రశాల, మరుగు దొడ్డిని నిర్మించకపోవడం గమనార్హం.


విద్యార్థుల ఇబ్బందులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 368 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో విద్యార్థినులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. మరొకటి మహిళా ఉపాధ్యాయులకు కేటాయించగా ఎప్పుడూ తాళం వేసి ఉంచుతారు. విద్యార్థులకు మాత్రం ఒక్కటి కూడా లేక ఆరుబయటకు వెళ్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగు మరుగుదొడ్లు ఉన్నా తాళం వేసి ఉండటంతో విద్యార్థులు ఉపయోగించుకోలేక పోతున్నారు. తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు.


ఇలాగైతే ఎలా..!

పాలకుర్తి, న్యూస్‌టుడే: పాలకుర్తి మండలంలో 71 పాఠశాలలుండగా వాటిలో సుమారు 25 బడుల్లో మల, మూత్రశాలలు లేవు. విద్యార్థులు బహిరంగ ప్రదేశాలనే ఆశ్రయిస్తున్నారు. బడుల్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి అనువుగా స్థలం, వసతులున్నా ఏర్పాటుపై పాలకులు, అధికారులు ఆసక్తి చూడపం లేదు. కొన్నిచోట్ల నీటివసతి సమస్యగా ఉంది. ఎంపీడీవో కార్యాలయంలో మరుగుదొడ్లు ఉన్నా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తుంది. తహసీల్దార్‌ కార్యాలయంలో మాత్రం అధికారులకు ఉండగా సిబ్బంది, ప్రజలకు మాత్రం అందుబాటులో లేవు. దీంతో వారు నిత్యం బహిరంగ ప్రదేశాల్లోనే పని కానిచ్చేస్తున్నారు. పాలకుర్తి పట్టణంలో రాజీవ్‌చౌరస్తాలో ఓ ప్రైవేట్‌ మల, మూత్రశాల ఉండగా గుడివాడచౌరస్తాలో మరొకటి అవసరం ఉంది.


ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో మొత్తం 267 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు విద్యార్ధులకు కనీస నీటివసతులు , సరైన ముత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అవస్థలతో అరకొరగా చదువును సాగిస్తున్నారు. ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సరైన ముత్రశాలలు లేవు. రెవెన్యు సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.


‘పురపాలిక’లో నిర్వహణ లోపం

పరకాల, న్యూస్‌టుడే: పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో పురుషులకు ఏర్పాటుచేసిన మరుగుదొడ్డి తలుపు దెబ్బతింది. కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపి వంద మంది పని చేస్తున్నారు. వీరితోపాటు చుట్టుపక్కల ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, పనిచేసే కార్మికులు పురపాలక సంఘంలోని మూత్రశాలలు, మరుగుదొడ్డిని వినియోగిస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఉండగా నిర్వహణ లోపం వల్ల కంపు కొడుతోంది.


కంపుకొడుతున్నాయి

కేసముద్రం, న్యూస్‌టుడే: కేసముద్రం మండలంలో 87 ప్రభుత్వ పాఠశాలల్లో 5646 మంది విద్యార్థులు చదువుతున్నారు.238 మరుగుదొడ్లు ఉండగా 39 పాఠశాలల్లో మురుగుదొడ్లు చిన్న చిన్న మరమ్మతుల కారణంగా నిరుపయోగంగా ఉన్నాయి. సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడుశుభ్రం చేయకపోవడంతో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. వాటి వైపు వెళ్లడానికి విద్యార్థులు సాహసించడం లేదు.. విద్యార్థినుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.