ప్రకృతి చిత్ర విచిత్రాలతో పొత్తం
నేడు హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ
న్యూస్‌టుడే, మానుకోట

నేటి నుంచి పుస్తక ప్రియులకు అందుబాటులోకి..
ఆయన ప్రకృతిని ఆరాధిస్తాడు.. అడవి అందాలను చూసి ఆనందిస్తాడు.. ప్రకృతిలో వైవిధ్య జీవ, జంతు, జల సంపదను చూసి పరవశిస్తాడు.. అంతేకాదు.. పచ్చాని చెట్టు నుంచి మొదలుకుని బండరాయి గొప్పదనాన్ని తన పాటల్లో ప్రతిధ్వనింపజేస్తాడు. ఇప్పుడు.. ప్రకృతి మాత సృష్టించిన అద్భుత ప్రపంచంలోని చెట్టు చేమలను, కొండలను, పర్వతాలను, జీవ ప్రాణుల విశిష్టతను.. వాటిలోని ప్రేమానురాగాలను, అనిర్వచనీయమైన నైపుణ్యాలను, ప్రకృతితో వాటికున్న బలీయమైన సానుకూలమైన అనుబంధాలను అత్యద్భుతంగా వర్ణించడమే కాకుండా వాటి నుంచి మనుషులు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని హితం చెబుతూ ‘అవని’ పేరిట పుస్తకాన్ని రాశారు. ఆయనే మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రాష్ట్ర సాహిత్య పురస్కార గ్రహీత.. గొడిశాల జయరాజ్. బహు పాత్రధారి అయిన జయరాజ్ తాజాగా ‘అవని’కి జేజేలు పలుకుతూ రాసిన పుస్తకం మన మనసుల్ని ఆలోచింపజేస్తుంది. నేడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రముఖుల ప్రశంసలు
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్ శ్రీరామ్ సుందర్ ఈ పుస్తకాన్ని ఓ మహాద్భుతంగా కీర్తించారు. ఆల్ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ ఉపాధ్యక్షుడు టి.రమేశ్.. ‘ప్రకృతి తన ప్రేమను తెలియబరిచే ఉదాహరణలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.. జయరాజు కలం ప్రపంచానికి అందించిన ఓ అమూల్యమైన గ్రంథమిది.. రచయితను ఈ పుస్తకం సాహితీ శిఖరాలపై కూర్చోబెడుతుంది..’ అని ప్రస్తుతించారు. ప్రకృతిలోని, మానవ జీవితంలోని 122 అంశాలను ఆయన స్పృశించారు. ప్రకృతి తత్వం అందరికీ అర్థమయ్యేలా వర్ణించారు. జయరాజు ఈ అవని పుస్తకాన్ని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు, జిల్లా అటవీ శాఖాధికారి కిష్టాగౌడ్కు సోమవారం అందజేశారు.

ప్రతి పేజీ చదివించేలా..
ఎన్నెన్నో వర్ణనలు.. అనుభూతులు
* ‘చనుబాలు’ అంశంలో.. ‘ఇలా జీవితం చనుబాలతో మొదలై సమస్త రుచులను అందిస్తూ ఏఏ దశల్లో ఎలా ఉండాలో నేర్పిన ప్రకృతి మాత విజ్ఞతకు జేజేలు’ ● ‘మాతృత్వం’లో..ప్రకృతి జీవన పయనమంతా అమ్మ చేతి చలువతోనే జరుగుతుంది.. అమ్మపై ఎన్ని సంకెళ్లు వేసినా ఆ అమ్మతనం మాత్రం అమ్మకే సొంతం.
* ‘ఇప్పపూలు’లో ‘ఆకాశం నుంచి సుగంధాలు వెదజల్లినట్లు ఇప్పచెట్టు కింద ఇప్పపూలు రాలుతున్నాయి..’ ● ఆరుద్ర పురుగు గురించి.. ‘పుడమి శరీరంపై ఆరుద్రలు ఎర్రని పుట్టు మచ్చలు’..
* ‘కలువలు’లో.. ‘దుర్వాసన నుంచి సువాసనలు తెస్తున్న ఈ పరిమళాలను ఏమని పూజించాలి. నింగి నేల మధ్య ఈ కలువలు నిండు చందమామను పోలి ఉంటాయి..’
* ●‘వడ్లపిట్ట’లో ‘చెట్ల ఎండిన చెదళ్ల మధ్య నుంచి పురుగుల్ని తిని చెట్టుకు రక్షణనిస్తుంది. చెట్టుకే రంధ్రం చేసి గూడు కడుతుంది.. ముక్కును ఆయుధంగా మలుచుకుని జీవిస్తుంది..’
* గిరిజనుల గురించి.. చెట్టు నుంచి ఆకును తెంచినపుడు కారుతున్న తెల్లని పాల వంటి మనుషులు వీళ్లు..’
* ‘నిద్ర’ ఎంత అవసరమో చెబుతూ.. ‘ ఈ రాత్రి పోయిన నిదురే రేపటి పనికి పెట్టుబడి..’
* ‘చేదు’ గురించి..‘దు:ఖం తర్వాత సుఖం, ఆకలి తర్వాత అన్నం ఎంత మధురంగా ఉంటుందో చేదు తర్వాత తియ్యదనమూ అంత మధురంగా ఉంటుంది.
నా ఆకాంక్ష ఇదే...
-జయరాజ్

ఎంతో అందమైన..మనలకు మేలును కలిగించే ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతితత్వాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకుని దానికి మిత్రుడిగా వ్యవహరించాలి. రక్షించుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయం. ఆదర్శం కావాలి. ప్లాస్టిక్ జీవితానికి మనం పుల్‌స్టాప్ పెట్టాలి.