close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నీటి గల కల.. పక్షి విలవిల

నేలపట్టు కేంద్రానికి నీటి కష్టం

ప్రత్యామ్నాయంపై దృష్టి కరవు

ప్రమాదంలో జీవవైవిధ్యం

పక్షుల నుంచి రైతుల వరకు ప్రాణ సంకటం

పాలకుల చొరవ అవసరం

పక్షికి బతుకు లేకుండా పోతోంది.రైతుకు మెతుకు కరవవుతోంది. చుక్కనీటి కోసం గుక్కపట్టి బాధపడాల్సిన దుస్థితి ఏర్పడగా, ప్రత్యామ్నాయ మార్గాల్లో సమస్యకు పరిష్కారం చూపకపోవడం క్లిష్టతరం చేస్తోంది. రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోన్న నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రంలో ఈ వ్యథ నెలకొంది. ఫ్లెమింగో పండుగ నిర్వహణకు సన్నద్ధమవుతున్న వేళ పాలకులు చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది.

ఈనాడు, నెల్లూరు న్యూస్‌టుడే, దొరవారిసత్రం: దేశంలోనే నేలపట్టు పక్షుల కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన ఇక్కడి అటవీ ప్రాంతం, అనుబంధ నీటి నిల్వల్లో విరివిగా విదేశీ పక్షులు సేదతీరి సంతానోత్పత్తి చేయడం ఏళ్లుగా జరుగుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలంలో సుమారు 458.92 హెక్టార్లలో ఇది విస్తరించి ఉంది. 9 వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న కల్లూరు రిజర్వు ఫారెస్టులో కొంతభాగాన్ని నేలపట్టు కేంద్రానికి 1976లో కేటాయించారు. అప్పటి నుంచి వన్యప్రాణి విభాగం అధికారుల పర్యవేక్షణలో ఇది కొనసాగుతోంది. ఏటా 12 రకాల విదేశీ పక్షులు ఇక్కడికి వస్తున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ బర్మా, బంగ్లాదేశ్‌, నైజీరియా, సైబీరియా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి అక్టోబర్‌- నవంబర్‌ మాసాల్లో వలస వస్తాయి. మార్చి చివరి వరకు ఉండి అనంతరం పిల్లలతో సహా తల్లిపక్షులు తమ స్వస్థలాలకు ఎగిరిపోతాయి. ఇంతటి కీలకమైన ఈ పక్షిస్థావరంలో నీటి సమస్య వెంటాడుతోంది.

ఇదీ పరిస్థితి!.. నేలపట్టు సంరక్షణ కేంద్రం నేలపట్టు పెద్దచెరువు, రెడ్డిగుంట చెరువుల పరిధిలో విస్తరించి ఉంది. ఇవి రెండూ కేవలం వర్షాధారంపైనే ఉన్నాయి. ఎగువ భాగంలోని అటవీ ప్రాంతంలో పడిన వర్షపు నీరంతా వీటిలోకి చేరుతుంది. ఇక్కడ పక్షుల అవసరాలు తీర్చుతూ కింది భాగంలోని రైతులను ఆదుకుంటున్నాయి. సుమారు 300 ఎకరాల్లో పంట సాగవుతుండగా 100 మందికి పైగా రైతులు ఆధారపడ్డారు. అయితే, ఈ చెరువులకు ప్రత్యామ్నాయంగా నీటి వసతి లేకపోవడం ఇబ్బందిగా మారింది. వర్షాభావ పరిస్థితుల్లో చెరువుకు నీరు అందడం లేదు. జనవరి చివరికల్లా నీరు తగ్గిపోతుండగా రైతులకు ఆఖరు తడులకు నీరందడం లేదు. పక్షులు పొదిగి పిల్లలను ఏర్పరచుకోగా.. ఆ పిల్లలు ఈత, వేట నేర్చుకోవడానికి తగిన నీరు ఉండటం లేదు. చెరువులకు ప్రత్యామ్నాయంగా 14ఆర్‌ తెలుగుగంగ మేజర్‌కాల్వ నుంచి ఉప కాల్వను గతంలోనే ఏర్పాటు చేశారు. అయితే, ఆ కాల్వలో నీటిపారుదల లేకపోవడంతో కేంద్రానికి సమస్యగా మారింది. నెలబల్లి వద్ద వివాదం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పాలకులు స్పందించాలి.. ఏటా రాష్ట్రస్థాయిలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ పేరుతో అట్టహాసంగా నిర్వహిస్తోన్న అధికారులు.. ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం చూపడం లేదు.ముందు జాగ్రత్త చర్యగా చెరువుకు గంగ నీటిని అందించడంతో పాటు మరో ప్రత్యామ్నాయ మార్గాన్నీ కనుగొనాల్సి ఉంది. ఈ ఏడాది కేంద్రానికి పక్షులు విరివిగా వచ్చాయి. సందడి వాతావరణం నెలకొంది.

పరిష్కారానికి కృషి

నేలపట్టు కేంద్రంలో నీటి సమస్యపై ఇప్పటికే దృష్టి పెట్టాం. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. విదేశీ పక్షులు, స్థానిక రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లా. గంగ నీటిని ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్‌ అట్టహాసంగా జరిపేందుకు చొరవ చూపిస్తున్నాం. - కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే, సూళ్లూరుపేట

నేలపట్టు చెరువు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.