close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

సిద్ధమవుతున్న ‘డైస్‌’ కేంద్రం

పూర్తయిన నిర్మాణం

పరికరాలు రావడమే ఆలస్యం

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

 

నూతనంగా నిర్మించిన డైస్‌ కేంద్రం

లోపలకు అడుగుపెట్టగానే ఆకట్టుకునే రంగురంగుల బొమ్మలుంటాయి. పిల్లలకు నేర్పించే అక్షరాలుంటాయి. అలాగని అది ఏ పాఠశాలో, శిక్షణ కేంద్రమో కాదు. అచ్చంగా ఆసుపత్రి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. శిశువుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంక్షేమాసుపత్రిలో నూతనంగా నిర్మించిన ‘డైస్‌’ కేంద్ర రూపమిది. ఇప్పటికే నిర్మాణపనులు దాదాపుగా పూర్తయ్యాయి. అవసరమైన వైద్య పరికరాలు రావడమే తరువాయి. పూర్తిస్థాయిలో ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఆకట్టుకునే, ఆరోగ్యాన్ని పంచే ఆసుపత్రి జిల్లావాసులకు చేరువవుతుంది.

గోడలపై వేసిన అందమైన బొమ్మలు

ప్రసవం అనంతరం అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని వైద్యులు పరీక్షిస్తున్నారు. అయితే అంతర్గతంగా ఏవైనా లోపాలున్నాయా, వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆ స్థాయిలో సౌకర్యాలూ అందుబాటులో లేవు. ఫలితంగా వ్యాధులు ముదిరి కొంతమంది పిల్లలు చిన్నతనంలోనే పెద్దపెద్ద రోగాలబారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం ఆసుపత్రుల వెంట తిరిగి తల్లిదండ్రులు ఆర్థికంగానూ చితికిపోతున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుగానే వ్యాధుల నిర్ధరణ చేపట్టడమొక్కటే మార్గం. ఇందుకోసమే జిల్లాకేంద్రంలో ‘డైస్‌’ (డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌) కేంద్రం ఏర్పాటవుతోంది.

అక్షరాలు నేర్పేందుకు వీలుగా..

ఆకట్టుకునేలా..

ఆసుపత్రి అనగానే మందులు, మంచాలు.. ఇలాంటి హడావిడి ఉండటం సహజం. ఇలాంటి వాతావరణంలో పిల్లలు భయాందోళనకు గురవుతుంటారు. అందుకే, పిల్లలు భయపడకుండా, వారిని ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోడలన్నీ అందమైన బొమ్మలతో నిండిపోయాయి. పలురకాల సందేశాలు, విజ్ఞాన సమాచారం అందించేలా బొమ్మలను చిత్రీకరించారు. ఆసుపత్రిలా కాకుండా ఒక పాఠశాలలా ఆసుపత్రిని తీర్చిదిద్దారు.

వ్యాయామం ప్రాముఖ్యతను తెలిపేలా ఉన్న బొమ్మలు

ప్రయోజనం ఏంటంటే..

ప్రస్తుతం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్‌ నియోనాటికల్‌ కేర్‌ యూనిట్‌) అందుబాటులో ఉంది. ఇక్కడ నవజాత శిశువులకు అవసరమైన వైద్యసాయం లభిస్తోంది. అయితే, ఒక్కో శిశువుకు ఒక్కోరకమైన సమస్య ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది పిల్లలకు పుట్టిన సమయంలోనే గుండెలో రంధ్రం ఉండటం, సరిగా ఎదగకపోవడం, ఉండాల్సిన వైపు కాకుండా మరో వైపుండటం, మెదడు పూర్తిగా ఎదగకపోవడం వంటి సమస్యలుంటాయి. ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. లేకపోతే భవిష్యత్తులో పలు వైకల్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. డైస్‌ కేంద్రం అందుబాటులోకి వస్తే పిల్లల వైద్యులు, ఫిజియోథెరపిస్ట్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌లు నియమితులవుతారు. వీరంతా ఎల్లవేళలా అందుబాటులో ఉండటం వల్ల పిల్లలకు అవసరమైన అన్నిరకాల వైద్యసేవలు సకాలంలో అందుతాయి. అందుకే సుమారు రూ. 85 లక్షల కేంద్ర నిధులతో ఈ కేంద్రాన్ని స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి భవనం పైభాగంలో నిర్మించారు.

ఏమేం చేస్తారంటే..

డైస్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చాక ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడం చేస్తారు. చిన్నపిల్లల వైద్యులు, వివిధ విభాగాల నిపుణులు, వైద్యసిబ్బంది సుమారు 15 నుంచి 20 వరకు అందుబాటులోకి వస్తారు. మాటలు సరిగా మాట్లాడలేనివారికి స్పీచ్‌ థెరపీ, అంగవైకల్యం ఉన్నవారికి ఫిజియోథెరపీ చికత్స అందిస్తారు. మాటలు మాట్లాడలేనివారికి, చెవిటివారికి, మానసిక వికలాంగులకు అవసరమైన వైద్యసాయం లభిస్తుంది. మానసిక నిపుణులు సైతం అందుబాటుల ఉండటం వల్ల మనోవైకల్యాన్ని తగ్గించవచ్ఛు పైపెచ్చు ఇవన్నీ ఉచితంగా లభించే సేవలు కావటం వల్ల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.