close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

మూడేళ్లుగా మునుగుతూనే ఉన్నాయ్‌

అధికారుల సమన్వయలోపం.. అన్నదాతలకు శాపం

రూ.3 కోట్ల నష్టం

భైంసా, న్యూస్‌టుడే

బీడు భూములకు నీరందించే సదుద్దేశంతో నిర్మించిన రంగారావు జలాశయం రైతులపాలిట శాపంగా మారింది. అధికారుల ముందు చూపు కొరవడి సాగుభూములు ముంపునకు గురవుతున్నాయి. రైతులను లాభం చేకూర్చే మాట అటుంచితే మూడేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. జలాశయం పూర్తయినా దిగువన ఆయకట్టుదారులకు నిరాశే మిగిలింది. దీనికి తోడు ఎగువ ప్రాంతంలో పంట భూముల్లో ఎదురునీరు చేరి పంటలు మూడేళ్లుగా నీట మునగడంతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. వారి ఆవేదనపై ‘న్యూస్‌టుడే’ కథనం.

సోయా పంట చేలోకి చేరిన వొెనకతట్టు నీరు

భైంసా మండలంలో వాడి-కోతల్‌గాం శివారులో చిన్నసుద్దవాగుపై నిర్మించిన రంగారావు పల్సికర్‌ జలాశయంలో సుమారు 150 నుంచి 200 ఎకరాల పంట భూములు ముంపునకు గురవుతున్నాయి. జలాశయం నిర్మాణంలో నీటి పారుదల, రెవెన్యూ అధికారుల తప్పిదాలే అందుకు కారణమని తెలుస్తోంది. జలాశయ నిర్మాణంకోసం ఎంతభూమి అవసరమో అధికారులు నిర్దిష్టంగా గుర్తించలేదు. అప్పట్లో జలాశయం, కాలువల నిర్మాణం కోసం 562 ఎకరాల భూమిని సేకరించారు. అందుకు నష్టపరిహారం అందించారు. నీటి పారుదల అధికారులు జలాశయంలో నీటి ఉనికి, ఎగువ ప్రాంతంలో ఎంతవరకు నీరు విస్తరిస్తుందని గుర్తించడంలో విఫలమయ్యారు. అప్పట్లోనే స్థానికులు జలాశయం నిర్మాణంతో తమ వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని, సమగ్రంగా రీ సర్వే చేయాలని కోరారు. అధికారులు వారి మాటలు పెడచెవిన పెట్టి 2017 ఏప్రిల్‌ నాటికి నిర్మాణం పూర్తి చేశారు. మొదటి సంవత్సరం కురిసిన వర్షాలకు రైతులు చెప్పినట్లుగానే అధికారుల అవగాహనలేమి బయట పడింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు అలుగుకు గండికొట్టి నీటిని దిగువకు వదిలేసి చేతులు దులుపుకొన్నారు. అయినా రైతుల పంట చేలలో నీరు చేరి దాదాపు 200 ఎకరాలు ముంపునకు గురవుతూనే ఉంది.

రంగారావు జలాశయంలో నిండిన నీరు

నష్టపోతున్న రైతులు: ప్రతిసారి పంటల సాగుకు పూనుకుంటున్న రైతులు ఎదురునీటితో నష్టపోతున్నారు. ప్రధానంగా ఇక్కడి రైతులు సోయా, పత్తి పంటలు వేస్తున్నారు. సోయా సాగుకు ఎకరా రూ.11వేల నుంచి రూ.20 వేలు, పత్తికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్లుబడి రూపంలో వెచ్చిస్తున్నారు. ఆ పంటలు దిగుబడులు వస్తే ఖర్చులు పోను రూ.25వేల నుంచి రూ.40వేల చేతికి వస్తాయి. కాని మూడేళ్లుగా వారు పెట్టుబడులతోపాటు దిగుబడులను సైతం నష్టపోతున్నారు.. కాని వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు.

అలుగుకు గండి కొట్టి దిగువకు వదులుతున్న నీరు

రీ సర్వే చేసినా ఫలితం దక్కలేదు

రీ సర్వే చేసిన నీటి పారుదల శాఖ అధికారులు ముంపు ప్రాంతాన్ని గుర్తించగా, ఆ ప్రాంతం ఎన్ని ఎకరాలు ఉంటుందో రెవెన్యూ అధికారులు ఇప్పటికీ లెక్కలు తేల్చలేదు. నివేదిక రూపొందించలేదు. ముంపు భూముల, గ్రామాల పునరావాసంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత రాకపోవడంతో బాధిత రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు.

ఆయకట్టు రైతులకు అడియాసే..

ప్రాజెక్టు కింద భైంసా మండలంలోని 4,600 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. శాసనసభ్యుడు జి.విఠల్‌రెడ్డి కృషితో ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.25 కోట్లు నిధులు కేటాయించి ప్రాజెక్టునైతే పూర్తి చేయగలిగింది.. కాని ఎగువ ప్రాంతంలోని గుండేగాం రైతుల పంట భూములు నీట మునగడంతో తప్పును తెలుసుకున్న అధికారులు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచకుండా అలుగుకు గండి కొట్టి విలువైన నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ఆయకట్టు రైతులకు కూడా ఫలితం దక్కడం లేదు.

మూడేళ్లుగా నష్టపోతున్నాం..

- రావుసాహేబ్‌, రైతు, గుండేగాం

గుండేగాం శివారు సర్వేనంబరు 89లో నాకు మూడెకరాలు, మాకుటుంబ సభ్యులకు ఆరెకరాల పంట భూములున్నాయి. జలాశయం ఎదురునీటితో మొత్తం ముంపునకు గురవుతోంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సర్వే చేసిన అధికారులు భూమి మునగదని చెప్పారు. ఇప్పుడు ముంపునకు గురవుతోంది. నష్టాలకు ఎవరు బాధ్యులు. మూడేళ్లుగా పెట్టబడులు, దిగుబడుల రూపంలో సంవత్సరానికి రూ.3.5 లక్షలు నష్టపోతున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.