close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

పట్టుతప్పి పగూళ్లు!

మల్బరీ సాగులో రైతులకు కష్టం 
మార్కెటింగ్‌ సౌకర్యం లేక అవస్థలు
ప్రయాణంలోనే పగిలిపోతున్న కకూన్లతో భారీ నష్టం

ఈనాడు, నెల్లూరు

ప్రకృతి కన్నెర్రజేసింది. తీవ్ర వర్షాభావంతో పంటలు పెట్టలేని విధంగా పరిస్థితి కల్పించింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన రైతులకు పట్టుసాగే దిక్కైంది. ప్రతికూల పరిస్థితిని అధిగమిస్తూ మంచి దిగుబడులు సాధించేలా అవకాశం ఏర్పడింది. మార్కెటింగ్‌ సౌకర్యాల్లో ఇబ్బందులకారణంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుండగా చివరకు గిట్టుబాటు ధర దక్కకపోవడం చిక్కుల్లో పడేస్తోంది. జిల్లాలోని పట్టు సాగు చేస్తోన్న రైతులకు ఈ సమస్య ఏర్పడింది.   జిల్లా వరిసాగుకు పెట్టింది పేరు. వేలాది మంది రైతులు దీనిపైనే ఆధారపడగా.. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. ఆ క్రమంలోనే మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, కావలి తదితర చోట్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఉన్న నీటిని ఉపయోగించుకుని పట్టుసాగు చేపట్టారు. దీనికి ప్రభుత్వం సైతం ఉపాధిహామీ పథకం ద్వారా భరోసా కల్పించడంతో రైతులకు వరంగా మారింది. మల్బరీ బుష్‌ ప్లాంటేషన్, సిల్క్‌ వార్మ్‌ రీరింగ్‌ షెడ్స్‌ నిర్మాణం తదితరాలకు అవకాశమిచ్చారు. ప్రస్తుతం మార్కెటింగ్‌ సౌకర్యాలు, ధరలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.


ఇదీ పరిస్థితి!
జిల్లాలో మల్బరీ, వైల్డ్‌ టసార్‌ పట్టు రకాలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మర్రిపాడు, కలిగిరి, రాపూరు పరిధిలోని మూడు క్లస్టర్ల ద్వారా పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతోంది. ఒక్కో క్లస్టర్‌లో 3 నుంచి 4 మండలాలు ఉండగా.. టసార్‌ సిల్క్‌ పరంగా ఒక్క తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోనే 2 వేల హెక్టార్లలో ఉత్పత్తి చేస్తున్నారు. కంపా నిధులతో 500 నుంచి 600 మందికి ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. జిల్లాలో పట్టు రైతులు ఉత్పత్తి చేసే కకూన్లను స్థానికంగా అమ్ముకునే అవకాశం లేదు. అనంతపురం జిల్లాలోని హిందూపురం మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కర్ణాటకకు తీసుకెళుతుండటం ప్రస్తావనార్హం. ఈ క్రమంలో రవాణా జరిగే వేళ పట్టుగూళ్లు దెబ్బతిని పగిలిపోతున్నాయి. వాటిని వ్యాపారులు నాసిరకం సరకు కింద చూపి కొనుగోలు చేయడం లేదు. తీసుకున్నా అరకొర ధరకే అడుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు.  

నా పేరు చంద్ర నరసింహారావు. మాది అనంతసాగరం మండలం సంజీవనగరం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పట్టుసాగు వైపు మళ్లా. ఆరంభం నుంచే నాకు కష్టాలు ఎదురవుతున్నాయి. అధిగమించి దిగుబడి సాధిస్తుండగా అందుకు తగ్గట్లు మార్కెటింగ్‌ సౌకర్యాలు లేవు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు సరకుతో సహా పరుగు పెట్టాల్సి వస్తోంది. ధర సైతం అంతంతమాత్రంగా ఉండటంతో దిక్కుతోచడం లేదు. 

నా పేరు మద్దినేని వేణుగోపాల్‌రావు. కలిగిరి మండలం మాది కొత్తూరు. పట్టు విక్రయాలకు మార్కెటింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది. పండించిన పంటను అమ్ముకోవాలంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. రవాణాలో గూళ్లు పగిలిపోతుండటంతో నష్టం వాటిల్లుతోంది.

నా పేరు సుబ్బారావు. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మా స్వగ్రామం. నేను ఏడాదిగా పట్టుసాగు చేపట్టా. భూగర్భజలాలు అడుగంటడంతో చేసేది లేక దీని వైపు మొగ్గుచూపా. అయితే సమస్యలను అధిగమించి మార్కెట్‌కు గూళ్లను తరలిద్దామంటే దానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికంగా విక్రయించే అవకాశాలు లేకపోవడం, చిత్తూరు, అనంతపురం, కర్ణాటక వెళ్లాల్సి రావడంతో చాలా అవస్థగా ఉంటోంది. గూళ్లూ అంత దూరం రవాణా కావాల్సి రావడంతో పగిలిపోతున్నాయి. గతంలో రూ.600 కిలో ఉండగా ప్రస్తుతం రూ.300 పలకడమే గగనమైంది. ప్రభుత్వం స్థానికంగానే మార్కెటింగ్‌ కల్పించాలి.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.