close

శనివారం, డిసెంబర్ 14, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ఎదురుచూపులకు పరిష్కారం 

16న స్పందనపై ఒంగోలులో శిక్షణ
ఇన్‌ఛార్జి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌
ఆందోళనలు, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

బాధితుల సమస్యలు తెలుసుకొంటున్న జిల్లా అధికారులు 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : ప్రజల నుంచి అందే స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ఆయన పర్యవేక్షణలో జరిగింది. పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చారు. కొందరు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. ఇంకొందరు వినతులు సమర్పించారు. వీడియోకాన్ఫరెన్స్‌ హాలు నుంచి ఇన్‌ఛార్జి కలెక్టర్‌తోపాటు డీఆర్వోలు వినతులు స్వీకరించారు. 


అలాగే జేసీ-2 కమలకుమారి, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌ సదా భార్గవి, నుడా వీసీ బాపిరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ సుధా భారతి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 33,773 అర్జీలకుగాను 29,708 అర్జీలు పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 4,065 అర్జీలపట్ల శ్రద్ధ వహించి పరిష్కరించాలన్నారు. ఈ నెల 16వ తేదీన ఒంగోలులో రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


ప్రబలుతున్న విష జ్వరాలు 
జిల్లాలో డెంగీ, విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి చీదెళ్ల కిషన్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం అత్యంత దారుణంగా ఉందని, దోమలు విజృంభిస్తున్నాయని, ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారాలు పేరుకుపోతుండటంతో దోమలు పెరిగి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయన్నారు. డెంగీ, విష జ్వరాల బాధితులు పెరుగుతున్నారన్నారు. గ్రామాలు కూడా పడకేశాయన్నారు. అధికారులు స్పందించి, తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యువత నాయకులు పాల్గొన్నారు. 


చక్కెర కర్మాగారం ప్రారంభించాలి
పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని చక్కెర కర్మాగారం మూసివేయడం వల్ల అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారని భాజపా నాయకులు మిడతల రమేష్‌ తెలిపారు. ఆ కర్మాగారం కార్మికులతో ఆయన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు విన్నవించారు. కొద్ది నెలలుగా కార్మికులకు యాజమాన్యం వేతనాలు కూడా ఇవ్వకుండా వెళ్లారని ఆరోపించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. 


వ్యభిచార గృహాలపై చర్యలేవి?
నెల్లూరు నగరంలో వ్యభిచార గృహాలపై జిల్లా అధికారులు, పోలీసు అధికారులు దృష్టిపెట్టి సమూలంగా లేకుండా చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఇటీవల నెల్లూరు నగరంలో షార్ట్‌ఫిల్మ్, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ కొందరు యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపి జీవితాలను నాశనం చేస్తున్నారని, దీని వెనుక కొన్ని రాజకీయ, పోలీసు, మీడియా శక్తులు ఉన్నాయని, వారెవరో విచారించి, తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఐద్వా నేతలు మస్తాన్‌బీ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా, డీవైఎఫ్‌ఐ నాయకులు ఫయాజ్, ప్రసాద్, శివకుమారి, శ్రీనివాసులు, ప్రియాంక, షాహీనా, ప్యారీజాన్, కామాక్షి పాల్గొన్నారు. 


వీవోఏలను తొలగించడం దారుణం
గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీవోఏలను తొలగించడం దారుణమని, ఈ విషయం జిల్లా అధికారయంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు డిమాండ్‌ చేశారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనేక ఏళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీవోఏలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచించాలని వారు కోరారు. అంతకుముందు కలెక్టరేట్‌ ముందు ఆందోళన నిర్వహించారు. 


తెలుగు మాధ్యమం ఉండేలా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంతోపాటు తెలుగు మాధ్యమం సైతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు డిమాండ్‌ చేశారు. మాతృభాషలో బోధన లేకపోతే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం తగ్గుతుందని వారు పేర్కొన్నారు. ఈమేరకు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు విన్నవించారు. ప్రభుత్వం రెండు మాధ్యమాల్లో బోధన చేపట్టడంవల్ల మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. 


మహనీయుల చిత్రాలను తొలగించారు
ఇందుకూరుపేట మండలం పొన్నూరు గ్రామంలోని పాఠశాల భవనంపై ఉన్న మహనీయుల చిత్రాలను తొలగించారని గ్రామస్థులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా ఏర్పాటు చేసిన చిత్రాలను తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు అధికారులకు విన్నవించారు. 


పింఛను రూ. 7,500 ఇవ్వాలి
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కనీస పింఛను రూ. 7,500 ఇవ్వాలని అఖిల భారత పింఛనుదారుల సంఘర్షణ సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌ స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించి, అనంతరం ఆందోళన నిర్వహించారు. 


అర్జీ సమర్పిస్తున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

బస్సులను పునరుద్ధరించండి
సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో సమస్యల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి హాజరై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని శ్రీహరికోట-వేనాడు రహదారి మరమ్మతు చేయకపోవడంతో ఇటీవల బస్సు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దీంతో నిలిచిన ఆర్టీసీ బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను డిమాండ్‌ ఏశారు. నియోజకవర్గ పరిధిలో నీటి సమస్య అధికంగా ఉందని, స్వర్ణముఖి నదికి నీటిని విడుదల చేయాలన్నారు. అసైన్‌మెంట్‌ భూములు సాగు చేసుకుంటున్న పలువురు రైతులకు రైతు భరోసా పథకం అందలేదని, ఆయా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.