close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

జీతం ఆగింది.. ప్రత్యామ్నాయమే మిగిలింది

బతుకు బండి నడిచేందుకు ఆర్టీసీ కార్మికుల అవస్థలు

మామడ, న్యూస్‌టుడే

బస్సు చక్రం తిరిగితేనే బతుకు బండి నడిచే కుటుంబాలు ఆర్టీసీ కార్మికులవి. ఒక్క నెల వేతనం రాకుంటే అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఇంటిల్లిపాదీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బుతో ముడిపడి ఉన్న పనులన్నింటికీ బ్రేక్‌ పడుతుంది. 38 రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఎంతోమంది ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రణాళిక ప్రకారం నిరసన కార్యక్రమాలు చేపడుతూనే వీలు చూ(చే)సుకొని తాత్కాలికంగా ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారు పడే కష్టాలు చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేం.

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు: 440

అద్దె బస్సులు: 185

పని చేస్తున్న కార్మికులు: 2,657

ఖర్చుల కోసం క్షవరం చేస్తూ..

క్షవరం చేస్తున్న ఈ వ్యక్తి భైంసా డిపోలో కండక్టరుగా పని చేస్తున్న భోజన్న. ఈయన స్వగ్రామం భైంసా మండలం తిమ్మాపూర్‌. రెండు నెలలుగా వేతనం లేక చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఖర్చులకు డబ్బుల కోసం ఊళ్లో సోదరుని సెలూన్‌లో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు..‘పదేళ్లుగా కండక్టరుగా పనిచేస్తున్నాను.. కుమారుడు దివ్యాంగుడు..పిల్లల చదువుకు బాగా ఖర్చయ్యింది, రుణం కోసం ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు, వేతనం వస్తేనే సరిపోని పరస్థితి ఉంది. రెండు నెలలుగా జీతం రాకుంటే మాలాంటి వాళ్లకు పూటగడవడమే కష్టమవుతుంది. అందుకే కులవృత్తి చేస్తూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలి.

దుస్తుల దుకాణంలో డ్రైవరన్న..

దుస్తుల దుకాణంలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మామడకు చెందిన మౌలానా.. నిర్మల్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 19 సంవత్సరాలుగా బస్సు నడుపుతున్నా ఆయనకొచ్చే వేతనం అంతంత మాత్రమే. నెల జీతం ఎప్పటికప్పుటి ఖర్చులకే సరిపోతోందని.. ఇప్పుడు మరీ కష్టంగా మారిందంటున్నారు మౌలానా.. సోదరుని దుస్తుల దుకాణంలో సాయంగా పనిచేస్తున్నానని.. న్యాయమైన మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తే మేమంతా సంతోషిస్తామంటున్నారు ఈ డ్రైవరన్న..

కుట్టు మిషన్‌ కుడుతూ..

కుట్టు మిషన్‌పై పని చేస్తున్న ఈమె పేరు సవిత.. కండక్టరు వృత్తే ఆ కుటుంబానికి ఆధారం. ‘ఇతర ఉద్యోగులతో సమానంగా పని చేసే మాకు ఇచ్చే ప్రతిఫలంలో చాలా వ్యత్యాసం ఉంది..వృత్తిలో మేము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం..అయినా ప్రజా సేవకు ముందుకు సాగుతున్నాం.. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వేతనంలో మార్పు లేదు..ఇప్పటికే జీతం లేక రెండు నెలలైంది.. టైలరింగ్‌ చేస్తూ వస్తున్న డబ్బులే కుటుంబానికి ఆధారమవుతున్నాయి. మా కష్టాలను చూసైనా ప్రభుత్వం దయ చూపాలి’ అంటున్నారు సవిత..

బీడీలు చుడుతూ..

బీడీలు చుడుతున్న ఈమె నిర్మల్‌ డిపోలో కండక్టరుగా పనిచేసే అశ్విని. వృత్తిలో 11 సంవత్సరాల అనుభవముంది. ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణలో భాగస్వామ్యురాలవుతున్న ఈమెకు వేతనం రాకపోవడం ఇబ్బందిగా మారింది. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వీరికి జీతమే జీవితం. ‘మేమంతా చిరుద్యోగులం.. ఇంటిల్లిపాది కష్టపడితేనే మా బతుకులు గట్టెక్కుతాయి.. ఇప్పుడు వేతనం రాక ఇలా వీలైన పనులు చేసుకుంటున్నాం. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రమిస్తున్నాం..మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలి’ అని కోరుతున్నారు అశ్విని..

‘సమ్మె కాలం..వత్తులే ఆధారం’..

కార్తీక మాసంలో వత్తులకు గిరాకీ ఉంటుందని తాత్కాలికంగా ఉపాధి కోసం కష్టపడుతున్న నిర్మల్‌ ఆర్టీసీ డిపో సీనియర్‌ మహిళా కండక్టర్‌ సుజాత

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.