close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

అన్నదాతకు తప్పని అప్పుల ఉరి

ఏటా సగటున 80 మంది బలవన్మరణం

సాగు నష్టాలే కారణం

మరింత భరోసా అవసరం

ప్రభుత్వ పథకాలు చేరువ కావాలి

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో ఆశించిన దిగుబడులు రాక.. వచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధర లభించక.. ఆశలన్నీ కళ్ల ముందే కరిగి పోతే.. వాటిని తట్టుకొని నిలబడే ఆత్మస్థైర్యం లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భార్యను, కన్నవారిని విడిచి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి పోతున్నారు. 2016 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక మేరకు రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పంటల సాగు తీరు, అన్నదాతల బలవన్మరణాలు, ఇందుకు దారి తీస్తున్న పరిస్థితులపై కథనం.

ఏటా ప్రకృతి రైతులతో దోబూచులాడుతోంది. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి ఏదో రకంగా రైతులు పంటలను నష్టపోతూనే ఉన్నారు. కాలం కలసి రాకపోదా.. అనే ఆశతో ఏటా అప్పులు చేసైనా, పంటలు సాగు చేస్తే.. దిగుబడి రాక, ధరలు లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాధారణ సాగు 5.50 లక్షల హెక్టార్లు కాగా, ప్రతి ఏటా ఆరు లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగు చేస్తారు. ప్రధానంగా పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతోంది. పత్తి 3.50 లక్షల హెక్టార్లు కాగా, అ తరువాత సోయా సాగు చేస్తారు. అయితే పత్తి పంట సాగు దళారులు, వ్యాపారుల గుప్పిట్లో ఉంటుంది. సాగు అవసరమయ్యే పెట్టుబడుల సమకూర్చడం మొదలుకొని, పంట ఉత్పత్తుల అమ్మకాల వరకు వారి ప్రమేయం ఉంటుంది. ఎక్కువ దిగుబడులు సాధించాలనే తపనతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం, తీరా కాలం కలిసి రాక నష్టపోతుండటం, అప్పులు అధికం కావడంతో రైతులు అత్మహత్యలకు పాల్పడుతున్నారు

కలిసి రాని కాలం: ఖరీఫ్‌ ప్రారంభంలో ఆలస్యంగా వర్షాలు కురవడంతో విత్తుకోవడంలో జాప్యం జరిగింది. ఇప్పటి వరకు పత్తి, వరి పంటలు చేతికి రాలేదు. కోతల సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటలు తడిసిపోయి తేమశాతం పెరిగి ధర రాని పరిస్థితి నెలకొంది.

పెరిగిన పెట్టుబడులు: పంట సాగుకయ్యే పెట్టుబడి ఏటా పెరుగుతోంది. ఎరువుల ధరలు రెట్టింపు కాగా, పురుగు మందుల ధరలు ఆకాశన్నంటాయి. తాజాగా కంపెనీలు మళ్లీ ఎరువుల ధరలు పెంచాయి. కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా దిగుబడులు రాకపోవడం, వచ్చిన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతోంది.

ఇంకా రాని రుణమాఫీ: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేసింది. దీనిని విడతల వారీగా అందజేయడంతో అవి వడ్డీలకే సరిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5వేలు ఇవ్వడం కొంత ఊరట.

సకాలంలో అందని రుణాలు: పంట సాగు కంటే ముందే పంట రుణాలు ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. కాని బ్యాంకులు సకాలంలో పంట రుణాలు ఇవ్వకపోవడం, ఇచ్చిన అవి పెట్టుబడికి సరిపోకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

దళారులే దిక్కు: ప్రభుత్వ పథకాలు, అందని పంట రుణాల కారణంగా ఇంకా అనేక మంది రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 5.50 లక్షల మంది రైతులు ఉంటే 3.50 లక్షల మంది రైతులకే బ్యాంకు రుణాలు అందుతున్నాయి.

పొంతన లేని ధరలు: పంట సాగు పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అయిన దక్కుతుందా అంటే అది లేదు. నిబంధనల పేరిట కొంతమంది నుంచే పంటను కొనుగోలు చేస్తున్నారు. 60 శాతం మంది రైతులు తమ పంట ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి

ఇప్పటికే 41 మంది రైతుల అత్మహత్యలు

జిల్లాలో గత రబీ, ఈ ఖరీఫ్‌ కలుపుకొన్ని ఇప్పటికే 41 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2016 ఉమ్మడి జిల్లాలో 81 మంది రైతులు అత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది నుంచి రాష్ట్రంలో రైతుబీమా పథకం అమలవుతోంది. ఏ కారణంతో రైతులు చనిపోయిన రూ.5 లక్షలు పరిహారం వస్తుంది. దీంతో గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే వచ్చే రూ.6లక్షలు నిలిచిపోయాయి. అధికారులు వాటిపై విచారణ కూడా చేయడం లేదు. ఆత్మహత్యలపై ప్రజాప్రతినిధులు స్పందించి సాగు కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రయత్నించాలి. అన్నదాతలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మరణాలను ఆపే మార్గాలను ఆన్వేషించాలి. పరిష్కారం కనుక్కోవాలి.

రైతుల్లో భరోసా నింపాలి

ఎస్‌.బొర్రయ్య, రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ కార్యదర్శి

రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించాలి. సకాలంలో పంట రుణాలు ఇవ్వాలి, పంట బీమా అందేలా చర్యలు తీసుకోవాలి. పథకాలు రైతులకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య చేసుకున్న తరువాత వారికి పరిహారం ఇచ్చే బదులుగా రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా చూడాలి.

ఆరేళ్లలో ఉమ్మడి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య

2014 97

2015 118

2016 81

2017 79

2018 65

2019 41

జిల్లాల వారీగా గత ఆరేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులు

ఆదిలాబాద్‌ 233

నిర్మల్‌ 148

మంచిర్యాల 58

కుమురంభీం 42

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.