close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

కాళ్లకు చెప్పులు లేకున్నా కార్యసాధకుడే..

పదేళ్లు చదువుకు దూరం..

బడి దారిలోని వాగు దాటేందుకు ఈత నేర్చుకొని..

స్ఫూర్తిదాయకం మూడో అదనపు జిల్లా జడ్జి నారాయణబాబు జీవితం

న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌

ప్రస్థానం

‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాట సర్వామోదితమైనది. పట్టుదలతో కష్టాలను ఎదురీదితే.. ఆశయం కోసం తపించే తత్వం.. సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే.. అందుకు తగ్గ ప్రోద్బలం లభిస్తే.. వ్యక్తి లక్ష్యాలను అందుకోవడం సుసాధ్యం. ఆసిఫాబాద్‌ మూడో అదనపు జిల్లా జడ్జి పి.నారాయణబాబు జీవితమే ఇందుకు నిదర్శనం. ఈ లక్షణాలతోనే కలను సాకారం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. స్ఫూర్తిదాయకమైన ఆయన జీవనశైలిని ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..


తల్లిదండ్రులు తులసీబాయి, జ్యోతిరాం

మాది మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం భట్టుపల్లి కుగ్రామం. అమ్మ తులసీబాయి, నాన్న జ్యోతిరాం ఇద్దరూ తాపీ పని కూలీలు. ముగ్గురు అన్నదమ్ముల్లో నేను మధ్యవాడిని. అయిదుగురు అక్కా చెల్లెళ్లు. 1980 ప్రాంతంలో దారులు సరిగా లేవు. ప్రాథమిక తరగతులు చదివేటప్పుడు బడికి వెళ్లాలంటే కొద్దిదూరం అడవిలో నడిచి వాగు దాటి వెళ్లాల్సి వచ్చేది. నాకే కాదు మా అమ్మానాన్నల కాళ్లకు కూడా చెప్పులు ఉండేవి కావు. కాళ్లకు ఆకులు కట్టుకొని నడిచేవారు. నాకు ముళ్లు గుచ్చకుండా చూసేవారు. మొదట్లో అమ్మా, నాన్నలు తీసుకొచ్చి బడిలో కూర్చోబెట్టేవారు. వాగు వచ్చినపుడు బడికి వెళ్లేవాడిని కాదు. ఇందుకోసం బావిలో ఈత నేర్పించారు. నేను మూడో తరగతి చదువుతున్నపుడే మా అమ్మానాన్నలు వలస కూలీలుగా మహారాష్ట్రలోని పూనే, షోలాపూర్‌ ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. ఆ సమయంలో నన్ను మా అమ్మమ్మగారి ఊళ్లో ఉంచి వెళ్లారు. అక్కడ ప్రాథమిక తరగతులు పూర్తి చేసుకున్నాను. నాలుగు నుంచి ఏడో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని డీఎన్‌టీ వసతి గృహంలో ఉండి చదువుకున్నాను. ఏడు నుంచి 10వ తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని సాహబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాను. నేను తెలుగు మీడియంలో సగటు విద్యార్థిని. పదో తరగతి పూర్తయ్యాక అమ్మానాన్నలు దూరంగా ఉండటం, ఆర్థిక ఇబ్బందుల కారణాలుగా 1991 నుంచి 2001 వరకు పదేళ్ల పాటు చదువుకు దూరమయ్యాను.

పట్టుదలే న్యాయమూర్తిగా ఎదిగేలా చేసింది..

లాయర్‌ అయ్యాక న్యాయమూర్తి ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నాను. 2014లో స్వయంగా సిద్ధమై మెజిస్ట్రేట్‌ ఎంపిక పోటీ పరీక్ష రాశాను. ఇంటర్వ్యూకు వెళ్లలేక పోయాను. 2016 హైకోర్టు నోటిఫికేషన్‌ వచ్చాక పట్టుదలతో ప్రయత్నించి జిల్లా జడ్జి పోస్టు కోసం పరీక్ష రాశాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకైక అభ్యర్థిగా ఈ పోస్టుకు ఎంపికయ్యాను. మొదటగా వరంగల్‌ మూడో అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యాను.. మా సతీమణిని కూడా లా చదివిస్తున్నాను. ఇద్దరు పిల్లలు పాఠశాల చదువుల్లో ఉన్నారు.


కారు డ్రైవరు అవుదామనుకున్నా..

చదువు మానేసిన సమయంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పని నేర్చుకున్నాను. జీపు డ్రైవింగ్‌ నేర్చుకున్నా. గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఉపాధి అవకాశాల కోసం వెతికి నిరుత్సాహానికి గురయ్యాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అటు చదువూ లేక ఇటు ఉపాధి లభించక ఒత్తిడికి లోనయ్యాను. కానిస్టేబుల్‌ కావాలని ఆలోచించాను. ఏదో ఒకటి సాధించాలని ఆశయం మాత్రం ఉండేది. మా పెద్దన్నయ్య వెంకటేశ్వరబాబు ఎంబీబీఎస్‌ చేసి వైద్యుడయ్యాడు. హైదరాబాద్‌ ఈఎస్‌ఐలో ఆయన డాక్టర్‌. ఆయన వద్దకు వెళ్లి అన్నయ్యా..! ఓ 30 వేలిస్తే కారు కొనుక్కొని డ్రైవింగ్‌ చేసుకొని జీవిస్తానని అడిగాను.


అన్నయ్య, వదినమ్మల ప్రోత్సాహం..


అన్న వేంకటేశ్వరబాబు, వదిన జయమ్మలతో నారాయణబాబు కుటుంబం

మా వదిన జయమ్మ ఈ సందర్భంలో నాకు ధైర్యం చెప్పింది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. చదువు కొనసాగించు. ఇంటర్‌, డిగ్రీ చెయ్యి. ఇంగ్లిష్‌ బాగా నేర్చుకో. ఖర్చులు మేం భరిస్తామని ధైర్యం చెప్పింది. అన్నయ్య వదినమ్మల ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో హెచ్‌ఈసీ తెలుగు మీడియం గ్రూపుతో ఇంటర్‌ చేశాను.


నల్లకోటును చూసి లాయరు కావాలనుకున్నాను..

మహబూబ్‌నగర్‌లో చదువుకునేటప్పుడు పాఠశాల పక్కనే కోర్టు ఉండేది. హైదరాబాద్‌ సిటీ కాలేజీ పక్కనా హైకోర్టు ఉండేది. నిత్యం లాయర్లను చూసేవాడిని. అప్పుడే నల్లకోటుపై మోజుపడ్డాను. నేనూ లాయర్‌ను కావాలని నిర్ణయించుకున్నాను. 2003 నుంచి 2008 వరకు మహాత్మాగాంధీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేశాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకనామిక్స్‌ లా విషయంలో 2010లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాను. 2008లోనే న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాను. సీనియర్‌ న్యాయవాది సాయిచక్రవర్తి వద్ద హైకోర్టులో ప్రాక్టీసు చేశాను. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైబ్యునల్‌లో ఏజీపీగా పనిచేశాను. ఈ క్రమంలో ఆంగ్లంపై, చట్టాలపై పట్టుసాధించాను.


ఓ ఆశయం ఉండాలి..

మనిషికి ఓ సదాశయం ఉండాలి.. దాన్ని సాధించడానికి గట్టి పట్టుదల..అందుకు తగ్గ కృషి ఉంటే జీవితంలో ఎవరైనా రాణించవచ్చని నా నమ్మకం. నా జీవితంలో అది రుజువైంది. నిజాయతీగా బతకాలి. బాధ్యతాయుత పౌరుడిగా జీవించాలి అనేదే నా ఆలోచన. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ నాకు ఆదర్శం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.