close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

మొరం.. కాసుల వరం..

అక్రమ క్వారీల నుంచి యథేచ్ఛగా తరలింపు

కరుగుతున్న గుట్టలతో పొంచి ఉన్న ప్రమాదం

చోద్యం చూస్తున్న అధికారులు

భైంసా, న్యూస్‌టుడే

అయ్యప్ప గుట్ట వద్ద తవ్వకాలు జరుపుతున్న జేసీబీ

కాసులు కురిపిస్తున్న మొరం దందాపై కొందరు అక్రమార్కులు మక్కువ పెంచుకున్నారు. వారి ధన దాహానికి గుట్టలు కర్పూరంలా కరిగి పోతున్నాయి. సహజసిద్ధమైన ప్రకృతి సంపదను రాంత్రింబవళ్లు తేడాలేకుండా కొల్లగొడుతున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో ఇక్కడ గుట్టలు ఉంటాయా అన్న ప్రశ్న తలెత్తక మానదు. అన్యాక్రాంతమవుతూ ప్రమాదకరంగా మారిన గుట్టలపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

భైంసా పట్టణం చుట్టుపక్కల ఉన్న గుట్టలతో పాటు డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లోని గుట్టలను మొరం మాఫియా తోడేస్తోంది. భారీ యంత్రాలు ఏర్పాటు చేసి పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్చగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగని వారికి క్వారీల నిర్వహణకు అనుమతులు ఉన్నాయా అంటే అదీ లేదు. కొందరు తమవి పట్టా భూములు, అసైన్డ్‌, ఇనాం భూములని ఎవరికీ భయపడేది లేదంటూ యథేచ్ఛగా మొరం మాఫియాకు అప్పగిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రహదారి పక్కన పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. వాటిపైన చెట్టూ చేమ నరికివేతకు గురవుతోంది. ఫలితంగా పర్యారణానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది.

నిబంధనలకు విరుద్ధంగా..

రహదారులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంబంధిత గుత్తేదారులకు అవసరమైన మొరం తీసుకెళ్లేందుకు క్వారీలను సూచిస్తూ అనుమతులు ఇస్తుంది. ఎన్ని క్యూబిక్‌ మీటర్ల మొరం అవసరమవుతుందో లెక్కకట్టి రాయాల్టీ తీసుకుంటుంది. భూగర్భ గనులశాఖ, రెవెన్యూ అధికారులు క్వారీ ప్రాంతాన్ని సూచిస్తూ అనుమతిని జారీ చేస్తారు. కాని ఇక్కడ పనులు పొందిన గుత్తేదారులు అవేమీ పాటించకుండా దూరాభారం అవుతుందని సూచించిన క్వారీల నుంచి కాకుండా దగ్గర్లోని గుట్టల నుంచి తీసుకెళ్తున్నారు. అందుకోసం ఇక్కడి వ్యాపారులను ఆశ్రయించి మొరాన్ని తరలిస్తున్నారు. దీనికి అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. మరోపక్కా పట్టణంతోపాటు చూట్టుపక్కల సమీప ప్రాంతాల్లో అక్రమంగా వెలుస్తున్న వెంచర్ల ఏర్పాటుకు ఇక్కడి మొరం వినియోగిస్తున్నారు. ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో వెంచరులో అయిదారు అడుగులమేర ఎత్తులో మొరం నింపుతున్నారు. ఇందుకోసం పట్టపగలే మొరం తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు అప్పుడప్పుడు దాడి చేసి యంత్రాలను అదుపులోకి తీసుకున్నా వెంటనే మొరం వ్యాపారులు వారిపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తూ యంత్రాలను విడిపించుకు పోతున్నారని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ అధికారి తన నిస్సాహాయతను వ్యక్తం చేశారు. ఒక పొక్లెయిన్‌.. మూడు టిప్పర్లతో నిరాటకంగా కొనసాగుతున్న అక్రమార్కుల వ్యాపారంతో ప్రభుత్వానికి రాయాల్టీ రూపంలో సమకూరే ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

తరలుతోంది ఇక్కడి నుంచే..

భైంసా పట్టణం మిర్జాపూర్‌గుట్ట, గోరక్షణ్‌ భూములు, బొర్ర గణేశ్‌ సమీపంలోని గుట్ట, సుద్దవాగు సమీపంలోని మిషన్‌భగీరథ గ్రిడ్‌ ప్రాంతంలోని గుట్ట, కమలాపూర్‌ గుట్టలు త్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారుల కళ్లుగప్పి తరచూ గుట్టలను మార్చుతూ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దేగాంలోని దత్తాత్రి గుట్ట ఆనవాళ్లు లుకుండా పోయింది. చింతల్‌బోరి, ఇలేగాం గుట్టలు సహజస్వరూపాన్ని కోల్పోయాయి. ఒక టిప్పర్‌ మొరానికి రూ.1000, ట్రాక్టర్‌కు మొరానికి రూ.600లు తీసుకుంటూ సొమ్ము చేసేకుంటున్నారు. ఇలా ఒక్కో రోజు ఒక టిప్పరుతో పది ట్రిప్పుల మొరం తరలిస్తున్నారు. సుమారు పది వరకు జేసీబీలు, ఎక్స్‌కావేటర్లు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లుతో అనునిత్యం వివిధ చోట్లకు మొరం రవాణా చేస్తున్నారు.

పట్టుకుంటే రెండు రోజుల విరామం

అధికారులు దాడులు చేసి పట్టుకుంటే రెండు రోజులు విరామం ఇస్తున్నారు. తరువాత యంత్రాలను వాహనాలపై తరలించి యథేచ్ఛగా తవ్వుతున్నారు. మిషన్‌భగీరథ గ్రిడ్‌ ప్రాంతలో తవ్వతున్న యంత్రాలు, వాహనాలను ఇటీవల అటువైపు వెళ్తున్న పుర ప్రత్యేకాధికారి, జేసీ భాస్కర్‌రావు చూసి ఇక్కడ అసలేం జరుగుతోందని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని సీజ్‌ చేయించారు. జరిమానాలు చెల్లించిన వ్యాపారులు మళ్లీ 15 రోజుల తరువాత తవ్వకాలు మొదలుపెట్టారు.

అక్రమ తవ్వకాలతో పొంచి ఉన్న ప్రమాదం...

అక్రమార్కుల దందాకు గడ్డెన్న జలాశయం వద్ద గుట్టపై రహదారికి ఆనుకుని ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడి గుట్టపై మిషన్‌భగీరథ ప్రత్యేక విద్యుత్తు సబ్‌స్టేషన్‌, కుభీరు మండలంలోని సబ్‌స్టేషన్‌లకు వెళ్లే 33కేవీ, మిర్జాపూర్‌కు సరఫరా చేసే 11కేవీ విద్యుత్తు తీగల స్తంభాలు ఉన్నాయి. అక్రమార్కులు వాటి చుట్టూ ఉన్న మొరం తవ్వేశారు. దీంతో అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గాలులు బలంగా వీచినా, భారీ వర్షం కురిసినా మొరం కొట్టుకుపోయి స్తంభం కూలిపోతుందని ఆ మార్గంలో వెళ్లేవారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే గుట్టపై రూ.కోట్లాది నిధులు వెచ్చించి మిషన్‌ భగీరథ గ్రిడ్‌ నిర్మించారు. దాని ప్రహరీ పునాది పొడవునా మొరం మాఫియా తవ్వకాలు జరిపింది. భారీ లోతులో తవ్వకాలు జరపడంతో పునాదులకింద కందకం ఏర్పండింది. దీంతో ఆ ప్రహరీ ఎప్పుడు కూలి పోయే ప్రమాదం ఉంది.

చర్యలు తీసుకుంటాం..

-ఇ.రాజు, ఆర్డీవో, భైంసా

అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురికి జరిమానాలు విధించాం. మళ్లీ మొరం తవ్వకాలు జరపుతుంటే సంబంధిత వీఆర్వో, తహసీల్దారు వెళ్లి పరిశీలించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని గుట్టలను కాపాడుతాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.