close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

జారిన మన్నుగడ!

బోటు షికారుకు ముందే కరుగుతున్న కట్ట

రూ.30 లక్షల పనుల్లో నిబంధనలకు పాత

అటకానితిప్ప వద్ద బోటు షికారుకు ఏర్పాటు చేసిన గుంత

సూళ్లూరుపేట ,న్యూస్‌టుడే : జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యటకంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌ పేరిట మూడేళ్ల కిందట జిల్లాలోని రామతీర్థం , మైపాడు ,కొత్త కోడూరు బీచ్‌లు , నెల్లూరు చెరువు, నేలపట్టు పక్షుల సంతానోత్పత్తి కేంద్రం, ఇస్కపల్లి బీచ్‌, బీవీపాళెం ఓడరేవు, అటకానితిప్ప, వేనాడు దర్గా ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.23 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా సూళ్లూరుపేట ప్రాంతం వన్యప్రాణి విభాగం పరిధిలో ఉన్న

చిన్నారులు, పెద్దలు సేద తీరేందుకు.. కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా చేపట్టిన పనుల్లో నాణ్యత కానరావడం లేదు. ప్రారంభం కాక మునుపే పాడవుతున్నాయి. పులికాట్‌ సరస్సులోని అటకానితిప్ప వద్ద ఏర్పాటు చేస్తున్న బోటు షికారు గుంత పనుల మన్నిక నేతి బీర చందంగా ఉంది. గుంతకు ఏర్పాటు చేసిన రివిట్‌మెంటు జారి పోతోంది. పలుచోట్ల కుంగిపోతోంది. రూ.లక్షల వ్యయంతో నిర్మిస్తున్నప్పటికీ నిబంధనలకు తిలోదకాలు పలికారు. పనుల తీరు తెన్నులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

బీవీపాళెం ఓడరేవునకు రూ.184.97 లక్షలు, నేలపట్టుకు 532.16 లక్షలు, అటకానితిప్పలోని పర్యావరణ కేంద్రంలో అభివృద్ధి పనులకు రూ.1.20 కోట్లు, వేనాడుకు రూ.2కోట్లు మంజూరు చేశారు. స్వదేశీ దర్శన్‌ నిధులతో పర్యటకులను ఆకట్టుకునేలా వివిధ రకాల పనులు చేయాల్సి ఉంది. ఇందులో చిన్న పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆయా ప్రాంతాల్లో పనులు చేయాలి. జిల్లాలోని అటకానితిప్ప, వేనాడు మినహా మిగిలిన అన్ని చోట్ల స్వదేశీ దర్శన్‌ నిధులతో వివిధ రకాల పనులను పూర్తి చేేశారు.

అటకానితిప్ప విషయానికి వస్తే..

సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్‌ సరస్సు వద్ద వన్యప్రాణి విభాగం పరిధిలోని అటకానితిప్ప వద్ద పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో పర్యటకులను ఆకర్షించేందుకు వీలుగా, వారిని ఆహ్లాద పరచాలన్న ఆలోచనతో బోటు షికారు ఏర్పాటు చేయాలని అధికారులు తలచారు. ఇందులో భాగంగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఆవరణలోని ఓ గుంతను ఎంపిక చేశారు. పూర్తిస్థాయిలో బోటు షికారుకు అనువుగా గుంతను అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల కిందట రూ.30 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు పర్యటక శాఖ ఇంజినీర్లు సాంకేతిక అనుమతులిచ్చారు. అనంతరం వన్యప్రాణి అధికారులు ఈ టెండర్లు నిర్వహించారు. ఓ గుత్తేదారు టెండరును దక్కించుకున్నారు. ఆయన పనులు చేయకుండా ఉప గుత్తేదారుకు పనులు చేసే బాధ్యతను అప్పగించారు. ఈయన కొంతకాలంగా బోటు షికారు కోసం గుంత ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా గుంతలోని పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం పూడికతీత చర్యలు చేపట్టారు. అంతా చదును చేసిన తర్వాత గుంత చుట్టూ కట్టను పోశారు. కట్ట మట్టి జారి పోకుండా ఉండేందుకు వీలుగా గుంత లోపల రివిట్‌మెంటు ఏర్పాటు చేయాల్సి ఉంది.

కానరాని నాణ్యత .. ఇటీవలి కాలంలో గుంత లోపలి భాగంలో రివిట్‌మెంటు పనులు చేశారు. నాణ్యత నేతిబీర చందంగా తయారైంది. పనులు చేసిన కొద్ది రోజులకే పలుచోట్ల కుంగిపోవడం కనిపిస్తోంది. దీంతోపాటు జారి పోతోంది. గుంతకు వేసిన కట్ట సైతం కోతకు గురవుతోంది. కట్టమట్టి కూడా కరిగి గుంతలోకి చేరుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకే జారి పోతుంటే.. ఇక పెద్ద వర్షాలు కురిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. బోటు షికారు సమయంలో అలల తాకిడికి కట్ట కోతకు గురికాకుండా ఉండేందుకు వీలుగా రివిట్‌మెంటు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గుంతలో నీరు చేరకుండానే జారుతూ, మధ్య మధ్యలో ఖాళీ స్థలం ఏర్పడుతోంది.

రాజీ ప్రసక్తే లేదు.. - హిమ శైలజ, సబ్‌ డివిజినల్‌ అటవీశాఖాధికారి

అటకానితిప్పలోని పర్యావరణ విజ్ఞానకేంద్రంలో బోటు షికారు కోసం చేస్తున్న గుంత పనుల్లో నాణ్యత లేకుంటే సంబంధిత గుత్తేదారుకు బిల్లులు చెల్లించం. ఇప్పటి వరకు ఎలాంటి బిల్లు చెల్లించలేదు. పనులన్నీ నిబంధనల మేరకు చేస్తేనే చెల్లింపులు ఉంటాయి. రివిట్‌మెంట్‌ పనుల్లో నాణ్యత లేనట్లు నా దృష్టికి కూడా వచ్చింది. దీనిపై ఇప్పటికే గుత్తేదారుకి తెలియజేశాం. నాణ్యతతో పనులు చేయాలని సూచించాం. నాణ్యత విషయంలో ఎక్కడా కూడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ లోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తాం.

రివెట్‌మెంటు జారిపోయి రాళ్ల మధ్య ఏర్పడ్డ ఖాళీ

కుంగిన గుంతకు కట్టిన రివిట్‌మెంటు

  

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.