close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

నెరవేరే కల..ఆలస్యమైన వేళ

ఆగిన ఇళ్ల నిర్మాణాలు

రివర్స్‌ టెండర్ల దిశగా ముందుకు

కసరత్తు చేస్తున్న టిడ్కో యంత్రాంగం

న్యూస్‌టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ) : నెల్లూరు జిల్లాలో పట్టణ పేదలకు సొంతింటి కల నెరవేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం నెల్లూరుతో సహా కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల పరిధిలో ఇళ్ల నిర్మాణాలను భారీగా చేపట్టారు. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరులో చేపట్టిన తొలిదశ ఇళ్లు మాత్రమే పూర్తిచేసి లబ్ధిదారులకు అందించారు. రెండు, మూడు దశలు నిర్మాణాల్లో ఉండగా మిగతా పట్టణాల్లో వివిధ దశల్లో ఆగిపోయాయి. ఈ నిర్మాణ పనులను రీటెండరింగ్‌ ద్వారా అప్పగించనున్నారు. మరోసారి టెండర్లు పిలిచి.. కొత్త గుత్తేదారు సంస్థలకు అప్పగించడమో.. అంతకంటే తక్కువ ధరకు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొస్తే పాత సంస్థలకే అప్పగించడమో చేస్తారు.

ఏపీ టిడ్కోకు బాధ్యతలు..

గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో)ను ఏర్పాటు చేసి ఈ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. ఈ సంస్థ మూడు కేటగిరీలుగా నిర్మాణాలను చేపట్టింది. 300 చ.అ, 365 చ.అ., 430 చ.అ.ల విస్తీర్ణాల్లో నిర్మాణాలను చేపట్టింది. పడకగది, వంటగది, హాలు, లెట్రిన్‌, స్నానాల గదితో పాటు దాన్ని ఆనుకుని మరో చిన్న గది ఉంటాయి. మూడు విభాగాల్లో ఈ కొలతలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి కేటగిరీలో రూ.500లు, రెండో కేటగిరీలో రూ.50వేలు, మూడో కేటగిరీలో రూ.లక్ష లబ్ధిదారు తన వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. చివరి రెండు కేటగిరీల్లో ఈ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో సమకూర్చే వెసులుబాటును సంస్థ కల్పించింది. లబ్ధిదారు వాటా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించేలా రూపకల్పన చేశారు. లబ్ధిదారు ఈ మొత్తాన్ని బ్యాంకుకు వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. బకాయిలు తీరిపోయాక లబ్ధిదారు పేరుమీద ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. ఎన్నికల్లో ఈ ఇళ్లపై అప్పటి అధికార, ప్రతిపక్షాలు పలు రాయితీలను ప్రకటించాయి. ప్రస్తుతం ప్రభుత్వం బకాయిలపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కొరియా నైపుణ్యం

కొరియా నైపుణ్యం పేరుతో ఇళ్ల నిర్మాణాలను టిడ్కో చేపట్టింది. సాంకేతికంగా దీన్ని ‘షేర్‌వాల్‌ టెక్నాలజీ’ అంటారు. కొరియా నుంచి తెచ్చిన షట్టరింగులతో నిర్మాణాలు చేపడుతున్నారు. వాడుకభాషలో కొరియా టెక్నాలజీ ప్రాచుర్యం పొందింది. ఇవి అల్యూమినియం షట్టరింగులు, వీటినే మైవామ్‌ షట్టరింగులని అంటారు. వీటిని అటూ.. ఇటూ.. ఉంచి మధ్యలో 10 ఎంఎం. స్టీలు ఊచలు అమర్ఛి. పూర్తిగా కాంక్రీటుతో గోడల నిర్మాణాలను చేపడుతున్నారు. ఎక్కడా ఇటుకలు వినియోగించడం లేదు. ఈ విధానంలో త్వరగా నిర్మించవచ్ఛు ఈ సాంకేతికను ఎంపిక చేసినట్లు అప్పట్లో అధికార వర్గాలు విశ్లేషించాయి. మొదటి విడతలో పూర్తయిన ఇళ్లలోపలి భాగం కూడా అధునాతనంగా నిర్మించారు. అడుగున గచ్చు టైల్స్‌తో నిర్మించి.. వంట గదిలో గ్రానైట్‌ పలకలు అమర్చారు.

ధరల్లో భారీ వ్యత్యాసం..!

నిర్మాణ ధరల్లో వాస్తవంగా అయ్యే ఖర్చుకు.. గుత్తేదారులకు అప్పగించిన ధరకు భారీ వ్యత్యాసం ఉందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. టిడ్కో గృహాల నిర్మాణాల్లో ఒక్కో చ.అ.కు దాదాపు రూ.2వేల వంతున అప్పగించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అపార్టుమెంట్ల నిర్మాణంలో బిల్డర్లు చ.అ.కు రూ.1200లు నుంచి రూ.1500లు వరకు తీసుకుంటున్నారని.. ఆ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. ఒక్కో చ.అ.కు రూ.500లు వరకు అదనంగా చెల్లిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. 300 చ.అ. ఇంటి నిర్మాణానికి మార్కెట్టులో రూ.4.50 లక్షలు మాత్రమే ఖర్చవుతుండగా.. టిడ్కో రూ.6.12 లక్షలు వరకు చెల్లించిందనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిడ్కో సమీక్షలో ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రాతిపదికనగా కాకుండా మార్కెట్టులో ఉన్న రేట్ల ప్రాతిపదికగా రివర్స్‌ టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇంటి స్థలం, ఇసుక ఉచితంగా అందిస్తుండటంతో పాటు రాయితీతో అందిస్తున్న సిమెంటును పరిగణనలోకి తీసుకుంటే.. మార్కెట్టు ధర కంటే తక్కువకే నిర్మాణం కావాలనేది ముఖ్యమంత్రి సూచన.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీతో..

పట్టణ పేదలకు సొంతింటి కలను నెవరేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలకు రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు రాయితీని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఇళ్లు కావడంతో ‘పీఎంఏవై ఎన్టీఆర్‌నగర్‌’లుగా అప్పటి ప్రభుత్వం నామకరణం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తంగా ఒక్కో ఇంటికి రూ.3లక్షల రాయితీ చేకూరుతుంది. అదనపు మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.