close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

ఏకోపాధ్యాయ చదువులు మిధ్య

పదోన్నతులతో బదిలీ

సెలవు పెడితే మూతే

ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీలోని పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు

మీరు ఎక్కడైనా ఒకటి నుంచి అయిదు తరగతులకు ఒక బోధకుడ్ని చూశారా? ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు కదూ! అయితే తప్పులో కాలేసినట్లే. కాదండీ ప్రభుత్వ పాఠశాలల్లో సుమా! అవసరమైన మేరకు ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమిస్తుంది కదా ఒక ఉపాధ్యాయుడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదూ! నిజమే మరి. పాలకుల నిర్ణయాలతో అనేక పాఠశాలలు ఒక బోధకుడితో నడుస్తున్నాయి. వీరు అత్యవసరమై సెలవు పెడితే ఆరోజు బడి మూతబడుతోంది. పైగా అన్ని తరగతులకు ఒకరే కావడంతో బోధన కుంటుపడుతోంది. ఇదీ జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి.

న్యూస్‌టుడే, నాయుడుపేట, నాయుడుపేట పట్టణం : జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలంలో 40 నుంచి 75 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 20 నుంచి 50 మంది చదువుతున్నారు. అయితే ఒక్కో మండలంలో 10 నుంచి 20 వరకూ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. తాజాగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే పాఠశాలల నుంచి ఒక టీచరు పదోన్నతిపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య రెట్టింపైంది. ప్రాథమిక విద్య గాడి తప్పింది.

సెలవు పెడితే బంద్‌

ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో సెలవు పెడితే ఆ పాఠశాలలు మూతపడాల్సిందే. మండల విద్యాశాఖాధికారులు సీఆర్పీలను పంపి బోధించేలా చేస్తున్నారు.కొన్నిసార్లు వీలుకావడం లేదు. 10 నుంచి 20 పాఠశాలల్లో ఒకరే ఉండడంతో సర్దుబాటు చేసేందుకు వీల్లేకుండా ఉంది.

ఆనందలహరి పాఠశాలల్లో సమస్య: మండలానికి రెండు పాఠశాలల్లో ఆనందనలహరి పద్ధతిలో ట్యాబ్‌లతో బోధిస్తున్నారు. ఈ ఏడాది మరో పాఠశాలలో అమలు చేయాల్సి ఉంది. అయితే అదనంగా మూడు నాలుగు తరగతులకు ప్రవేశపెట్టారు. ఈవిధానంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులు శిక్షణ పొంది చెప్పాల్సి ఉంది. కానీ ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పదోన్నతులపై వెళ్లడంతో అక్కడ బోధన కుంటుపడుతోంది. లక్షలాది రూపాయల ఖర్చుతో ట్యాబ్‌లు, వస్తుసామగ్రి దిగుమతి చేసినా ఉపాధ్యాయుల కొరతతో లక్ష్యం నీరుగారుతోంది.

మారుమూల ప్రాంతాల్లో : రవాణాపరంగా అనువైన నాయుడుపేట, నెల్లూరు గ్రామీణం,, పొదలకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, కావలి ప్రాంతాల్లోనే ఉపాధ్యాయుల కొరత ఉంటే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తీరప్రాంతాలకు పోయేందుకు ఇష్టపడరు. ఆ ప్రాంతాలకు రాకపోకలు ఇబ్బంది కావడంతో పదోన్నతులను ఆసరాగా తీసుకుని ఇతరప్రాంతాలకు వెళుతున్నారు. ఈ ప్రాంతాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది.

ఇవిగో ఉదాహరణలు

పొదలకూరు మండలంలోని చిట్టేపల్లి, లింగపల్లి, మర్రిపల్లి, ఉలవరపల్లి, అమ్మవారిపాళెం ఇలా 21 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. టీచరు సెలవు పెడితే పాఠశాల మూతే. ● నాయుడుపేట మండలంలోని అరవపెరిమిడి ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు కొద్ది రోజుల క్రితం బదిలీ అయ్యారు. ఒకే ఉపాధ్యాయిని బోధిస్తున్నారు. ఇటీవల మండల విద్యావనరుల కేంద్రంలో సమావేశం జరిగితే పాఠశాల మూసేశారు. ● పండ్లూరు ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ ఒకే ఉపాధ్యాయిని బోధిస్తున్నారు. ఇటీవల ఒకరు బదిలీపై వెళ్లారు. ఒక తరగతి విద్యార్థులకు పాఠం చెప్పి వచ్చేసరికి మరో తరగతి విద్యార్థులు అరుస్తున్నారు. క్రమశిక్షణ గాడితప్పుతోంది. ● తడ మండలంలో మూలకుప్పం, పులివేంద్ర, చిన్నమాంబట్టు, గ్రద్దగుంట,పూడి, ప్రాథమిక పాఠశాలల్లో ఒకరే ఉన్నారు. ఇరకంలో వాలంటీరు విద్యార్థులకు బోధిస్తున్నారు. 46 ప్రాథమిక పాఠశాలల్లో 4 వేల మంది వరకు చదువుకుంటున్నారు. ● పురపాలక సంఘంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీలో 46 మంది ఉన్నారు. ఆనందలహరి అమలవుతోంది. ఇద్దరు ఉపాధ్యాయులు ఒకటి, రెండు తరగతులకు ట్యాబ్‌లతో బోధిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఉపాధ్యాయుడు పదోన్నతిపై వేరే పాఠశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఒకరే బోధిస్తున్నారు. ఒక గదిలోనే ఐదు తరగతుల చిన్నారులకు బోధిస్తున్నారు. తాజాగా మూడు నాలుగు తరగతులకు ఆనందలహరి బోధన చేయాలని ట్యాబ్‌లు ఇచ్చారు. అన్ని తరగతుల పిల్లలకు ఒకే గదిలో ట్యాబ్‌లతో పాఠాలు చెబుతున్నారు.

బదిలీలపై ఆశలు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేసినా కొంత మెరుగుపడే అవకాశముంది. సర్దుబాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది. ఉపాధ్యాయుల కొరతతో బడులకు కేటాయించే ప్రభుత్వ నిధులు వృథా అవుతాయి. ఈవిషయమై డీఈవో జనార్దనాచార్యులును ‘న్యూస్‌టుడే వివరణ కోరగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని, కొత్త డీఎస్సీతోనూ కొన్ని ఖాళీలు భర్తీ అవుతాయని వివరించారు.

ఒకే గదిలో ఐదు తరగతుల విద్యార్థులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.